జనసేన-బీజేపీ మైత్రితో జగన్ కి తిప్పలు తప్పేలా లేవు!!

జనసేన-బీజేపీ కలయికపై మౌనం వహించాలని తెలుగు దేశం పార్టీ భావిస్తుంది. ఈ పరిణామం పై స్పందించరాదని నిర్ణయించింది. అయితే వాటి చెలిమి సీఎం జగన్ మోహన్ రెడ్డికే తలనొప్పులు తెచ్చిపెడతుందని అంచనా వేస్తోంది. రాజధాని తరలింపు.. అక్రమాస్తుల కేసుల విషయంలో ఆయనకు ఇబ్బందులు ఎదురుకావచ్చు అని భావిస్తుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ నేతల సమావేశంలో జనసేన బిజెపి పొత్తు ప్రస్తావనకు వచ్చింది. అయితే జరగబోయేది కొంత కాలం వేచి చూద్దామని అప్పటి వరకు దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనం వహించాలని సమావేశంలో అభిప్రాయపడింది. రాజధాని వ్యవహారంలో అన్ని పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నందున పరస్పర విమర్శలతో ఉద్యమం పక్కదారి పడుతుందని భావించి.. అందువల్ల తామే కొంత నిగ్రహంతో ఉండాలని అనుకుంటున్నట్టు టిడిపి నేతలు చెబుతున్నారు. 

అమరావతి విషయంలో జనసేన, బిజెపి కలిసి ఉద్యమం చేపట్టే అవకాశముందని అంటున్నారు. బిజెపి సొంతంగా ఉద్యమం చేపట్టటమంటే రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్నట్లేనని భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాజధాని మార్పిడికి వ్యతిరేకంగా ఉద్యమిస్తే రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని మార్చడం అంత తేలిక కాదని చాలా అడ్డంకులు ఏర్పడతాయని భావిస్తున్నారు. రాజధాని ఉద్యమం తీవ్రతరం అవుతుందని టిడిపి సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు. జగన్ కేసుల్లో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదని మరో టీడీపీ నేత అన్నారు. తన కేసులో విచారణ జాప్యం కావడానికి జగన్ ఇప్పటి వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకారం పొందారని.. ఆ సహకారం ఆగిపోతే కేసుల విచారణలో వేగం పెరిగే అవకాశముందన్నారు. విచారణ త్వరగా ముగిస్తే శిక్షలు కూడా ఖాయం. జనసేనతో కలిసి బలపడాలనుకునే రాజకీయ పార్టీగా బిజెపి ఈ దిశగా పావులు కదుపుతోందనే ప్రచారం జరుగుతుంది.