మోడీ ఇక జగన్‌ను పక్కనపెట్టేస్తాడా...?

వచ్చే ఎన్నికల నాటికి తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎలాగైనా పాగా వేయాలని భారతీయ జనతా పార్టీ వేసిన ఎత్తులు అన్నీ ఇన్నీ కావు. ఒకవేళ తెలుగుదేశం పార్టీకి జనంలో ఆదరణ తగ్గి.. వైసీపీ పుంజుకుంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావించి.. అందుకు తగినట్లుగా వ్యూహారచన చేశారు కమలనాథులు. జగన్‌ను బలపరిచేందుకు అస్త్రశస్త్రాలను కూడా రెడీ చేసి పెట్టింది. వీరి బంధంపై ముందు నుంచి వార్తలు వచ్చినప్పటికీ.. రాష్టపతి ఎన్నికలకు మద్దతు.. సంఘ్ పరివార్ నేతలతో వైసీపీ నేతల మంతనాలతో.. వైసీపీ-బీజేపీ ఫ్రెండ్‌షిప్ రాజకీయ సమాజానికి తెలిసింది.

 

సరిగ్గా ఇలాంటి సమయంలోనే బీజేపీ కనుక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటానని జగన్ ఓపెన్‌గా చెప్పడం ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చింది. ఇలోగా బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపుల్లో అన్యాయం జరగడం.. టీడీపీ-బీజేపీ మధ్య అగ్గిని రాజేసింది. మాటల యుద్దం శృతిమించిపోయి.. తెగదెంపులు చేసుకుంటేనే మంచిదనే స్థాయికి వ్యవహారం వెళ్లింది. ఇక ఏ క్షణమైనా కమల దళం నుంచి సైకిల్ పక్కకు తప్పుకోకతప్పదని.. జగన్‌తో చనువు పెంచుకోవచ్చు అనుకుంటున్న టైంలో.. మారిషస్ ప్రభుత్వం ప్రధాని మోడీకి షాకిచ్చింది. ఇందూ టెక్ జోన్ వ్యవహారంలో తాము పెట్టిన పెట్టుబడులు నష్టపోయామని.. తమకు న్యాయం చేయాలంటూ మారిషస్ ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో.. కోర్టు భారతప్రభుత్వానికి నోటీసులు పంపింది.

 

ఈ వ్యవహారంలో మోడీకి నోటీసులు పంపడంతో పాటు.. ఆర్థిక, వాణిజ్య పన్నులు, న్యాయ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రులను ప్రతివాదులుగా చేర్చింది. ప్రధానమంత్రికే నోటీసులు వచ్చేలా.. ప్రధాని కార్యాలయానికే మచ్చ తెచ్చేలా పరిణమించిన.. జగన్ అక్రమాస్తుల కేసుపై ప్రధాని మోడీ ఆగ్రహాంతో ఉన్నట్లు పోలిటికల్ టాక్. ఉన్నపళంగా పార్టీ నేతలతోనూ.. కేంద్రమంత్రులతోనూ సమావేశమై నోటీసుల గురించి చర్చించారట. ఇప్పటి వరకు మచ్చలేని పార్టీగా బీజేపీకి గుర్తింపు ఉంది. రాజకీయలబ్ధి కోసం అవినీతిపరులతో చేతులు కలిపితే... పార్టీపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని.. ఇప్పటికే విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఘటనలతో అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో.. జగన్‌తో ప్రయాణంపై మోడీ- అమిత్‌షాలు ఆలోచనలో పడ్డట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.