సాక్షి ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి రూ.కోట్ల చెల్లింపులు!!

 

ఏపీ ప్రభుత్వం సాక్షి ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి లక్షల జీతాలు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ అధికారంలోకి రాకముందు వరకు సాక్షి పే రోల్స్‌లో ఉన్న 8 మంది ఉన్నత స్థాయి ఉద్యోగులకు.. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుల పేరుతో జీతాలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జీతాలు కూడా లక్షల్లో ఉండటం, అదే స్థాయిలో అలవెన్స్‌లు కూడా మంజూరు చేయడం విమర్శలకు కారణమవుతోంది. ఇప్పటికే 8 మందిని ఇలా తీసుకున్నారని.. మరికొంత మందిని నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సీఎం జగన్ బంధువు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రజాసంబంధాల సలహాదారుగా నియమితులయ్యారు. అంతకు ముందు ఆయన సాక్షి ఎడిటోరియల్ డైరక్టర్‌గా ఉండేవారు. తర్వాత పూర్తిగా వైసీపీ వ్యవహారాలు చూస్తున్నారు. అయినప్పటికీ.. ఆయనకు సాక్షి నుంచి జీతం అందేది. ఇప్పుడు ప్రజాసంబంధాల సలహాదారుగా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నారు. ఈయన జీతం రూ. మూడు లక్షలకుపైనే. 8 మంది వరకూ సిబ్బందిని నియమించునే అవకాశం, కారు, ఫోన్, ఇంటి అద్దె ఇలా అన్ని రకాల అలవెన్సులు కలిపి.. నెలకు రూ. 10 లక్షలకు పైగానే అవుతుంది. అంటే ఏడాదికి 1 కోటి 20 లక్షలు.. ఐదేళ్లలో ఇది 6 కోట్లు పైనే.. ఇలా ఒక్క సాక్షి ఉద్యోగికి ఏపీ ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

కమ్యూనికేషన్ సలహాదారుడిగా జీవీడీ క్రిష్ణమోహన్ ని నియమించారు. ఈయన సాక్షిలో బ్యూరో చీఫ్ స్థాయిలో పనిచేసేవారు. జగన్ సభలలో మాట్లాడే స్పీచ్‌లు ఈయనే రాసేవారని సమాచారం. రెండు నెలల క్రితం వరకూ సాక్షి తరపునే జీతం ఇచ్చేవారు. అయితే ఇప్పుడు కమ్యూనికేషన్స్ సలహాదారుగా నియమించి జీవీడీ క్రిష్ణమోహన్ కి ఏడాది 1 కోటి 20 లక్షలకు పైనే.. ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించనున్నారని తెలుస్తోంది.

సీపీఆర్వోగా పూడి శ్రీహరి అనే సాక్షి ఉద్యోగిని నియమించుకున్నారు. సాక్షిలో.. రూ. 50 వేలలోపే జీతం తీసుకునే ఈ ఉద్యోగి.. జగన్ పాదయాత్ర సమయంలో ఆయన వెంట ఉంటూ మీడియా వ్యవహారాలు చూసుకున్నారని తెలుస్తోంది. ఈయనను ఇప్పుడు సీపీఆర్వోగా నియమించారు. ఈయన జీతం కూడా.. సీనియర్ సలహాదారుల స్థాయిలోనే ఉందని చెబుతున్నారు. అన్నీ కలిపి నెలకు.. రూ. 10 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.

వీరు మాత్రమే కాదు.. సాక్షి పేరోల్స్‌లో కాస్త ఎక్కువ జీతం అనుకున్న మరో ఐదుగురికి కూడా.. ఇదే తరహాలో సలహాదారుల పోస్టులు ఇచ్చి ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఇలా నియమించుకుంటున్న సలహాదారులకు.. కావాల్సిన సిబ్బంది కూడా సాక్షి గ్రూప్ లో పనిచేసే ఉద్యోగులేనని చర్చ నడుస్తోంది.

ప్రమాణస్వీకారం చేసేటప్పుడు తాను నెలకు ఒకే ఒక్క రూపాయి జీతం తీసుకుంటానని ప్రకటించిన సీఎం జగన్.. దయనీయస్థితిలో ఉన్న ఏపీ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దడం తన ముందున్న ప్రథమకర్తవ్యం అని ప్రకటించారు. తాను చంద్రబాబులా హిమాలయ వాటర్ తాగనని, కిన్లే తాగడం వల్ల ఖజానాకు రోజుకు 80 నుంచి 120 రూపాయలు మిగిల్చుతానని చెప్పుకొచ్చారు. అయితే.. ఏపీ ఆర్థిక కష్టాల్లో ఉందని.. తాను ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటానని ప్రకటించిన జగన్.. ఇలా సలహాదారులు, వారి సహాయకుల కోసం.. కోట్లకు కోట్లు జీతభత్యాలు వెచ్చించడం ఏంటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ప్రభుత్వానికి అవసరం అయి తీసుకుంటే పర్వాలేదు కానీ.. తమ సొంత సంస్థలో జీతాలు తీసుకునేవారిని ఇలా నియమిస్తూండటంతో.. ప్రజాధనాన్ని సొంత అవసరాలకు వాడుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.