వైసీపీ శ్రేణుల పిచ్చి చేష్టలు.. జగన్ కి చెడ్డపేరు

 

ఏపీలో వైసీపీ ఘన విజయం సాధించింది. వైసీపీ అధినేత జగన్ ఈ నెల 30 న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని జగన్ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం చెప్పారు. అయితే కొందరు వైసీపీ కార్యకర్తలు, క్రిందిస్థాయి నేతలు మాత్రం అత్యుత్సాహానికి పోయి.. జగన్ పేరుని, వైసీపీ పేరుని చెడగొడుతున్నారు.

కొన్ని గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలు.. బాబు హయాంలో పలు ప్రభుత్వ పథకాల కోసం టీడీపీ నేతల పేర్లతో ఏర్పాటు చేసిన శిలాపలకాల్ని ధ్వంసం చేస్తున్నారు. ఇంకొందరు.. సేవా కార్యక్రమాల్లో భాగంగా పలు చోట్ల టీడీపీ అభిమానులు ఏర్పాటు చేసిన బల్లలను, బస్ షెల్టర్లను కూల్చేశారు. కొన్ని చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు. కొందరు యువకులైతే కార్లు, బైకులతో ర్యాలీలు తీస్తూ స్థానిక టీడీపీ నేతల్ని దూషిస్తూ అనవసర హంగామా చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల రోజు టీడీపీ ఓడిపోతుందని కన్ఫర్మ్ కాగానే చంద్రబాబు ఇంటి ముందుకు వెళ్లి వైసీపీ అభిమానులు బైబై బాబు అంటూ నినాదాలు చేశారంటేనే వారి చర్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఇవన్నీ ఒకెత్తు అయితే.. అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయ యూనివర్శిటీలో వైసీపీ విద్యార్థి నేతల పేరుతో కొంత మంది చేసిన హడావుడి అందరికీ విస్మయం కలిగించేలా చేసింది. ఫలితాలు వచ్చిన మూడో రోజున విద్యార్థి నేతలు అడ్మినిస్ట్రేషన్‌ బ్లాక్‌లోకి చొరబడ్డారు. విధుల్లో ఉన్న అధికారులతో.. బలవంతంగా రాజీనామా పత్రాలపై సంతకాలు చేయించారు. మొదట మహిళా అధికారి అయిన ఎస్కేయూ రెక్టార్‌ శుభ చాంబర్‌లోని నేమ్‌ బోర్డును ధ్వంసం చేశారు. మా ప్రభుత్వం వచ్చింది, మీ సేవలు ఇక చాలంటూ వెళ్లిపోవాలని ఆదేశించారు. తెల్ల కాగితంపై ఆమె రాజీనామా లేఖను తీసుకుని.. వీసీకి పంపారు. ఓఎస్డీ ఏవీ రమణను కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో ఆయన కూడా రాజీనామా చేశారు. ఈ ఘటనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి రెక్టార్ కానీ, ఓఎస్డీ పదవులు కానీ నామినేటెడ్ పోస్టులు కావు. వారు ఉద్యోగులే. వారేదో టీడీపీ ప్రభుత్వ హయాంలో నియమితులయ్యారు కాబట్టి.. వారు టీడీపీ నేతలన్నట్లుగా అనంతపురం వైసీపీ నేతలు వ్యవహరించి అత్యంత దారుణంగా ప్రవర్తించారు.

ఇలాంటి సంఘటనలు ఇంకా ఎన్నో జరుగుతున్నాయి. కొందరి అత్యుత్సాహం వల్ల జగన్ ఇమేజ్ , వైసీపీ ఇమేజ్ మసకబారే ప్రమాదం ఉంది. ఒకవైపు జగన్ ఏమో ఏపీని అభివృద్ధి చేయాలని, మంచి సీఎంగా పేరు తెచ్చుకోవాలని చూస్తుంటే.. కొందరు పార్టీ శ్రేణులు మాత్రం అనవసర హాంగామా చేస్తూ వారికి తెలియకుండానే జగన్ కి చెడ్డపేరు తెస్తున్నారు. మరి పార్టీ పెద్దలైనా వారికి సర్దిచెప్తారేమో చూడాలి.