సర్వే’జ(గ)నా సుఖినోభవన్తు!

 

 

 

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిన దారుణమైన సంఘటనని ఎవరో ఒక రాజకీయ నాయకుడు ఎప్పుడో ఒకప్పుడు గుర్తు చేస్తూనే వుంటాడు. ఈసారి ఆ బాధ్యత వైఎస్సార్సీపీ నాయకుడు జగన్ తీసుకున్నట్టుగా వుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర విభజనకు జరుగుతున్న ప్రయత్నాలు తెలుగువారి గుండెను మండేలా చేస్తుంటే మరోవైపు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులన్నీ జగన్ ముఖ్యమంత్రి కావడానికి అనుకూలంగా వున్నాయంటూ ‘కొన్ని’ మీడియాలలో సర్వేలు రావడం రాజకీయ వర్గాలను దిగ్ర్భాంతికి గురిచేసింది.

 

రాష్ట్రం విడిపోయే పరిస్థితులొచ్చాయి. తెలుగుజాతి దారుణంగా చులకనకు గురైన విపత్కర పరిస్థితులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ గండం నుంచి ఎలా బయటపడాలన్నది ఆలోచించడం తెలుగువారి ప్రస్తుత కర్తవ్యం. అయితే ఆ విషయాన్ని వదిలేసి జనం ఎవరికి ఓట్లేస్తారన్న విషయం మీద సర్వేలు మీడియాలో ప్రసారం కావడాన్ని ఏమనాలో అర్థం కావడం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమవుతున్న సర్వేల వెనుక జగన్ హస్తం వుందన్న విషయాన్ని కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నాయి. దండిగా డబ్బులు ఇస్తే సర్వేలు చేసే సంస్థలు మనకు అనుకూలంగా వుండేలా సర్వే రిపోర్టులు అందజేస్తాయన్న విమర్శలు వినిపిస్తూ వుంటాయి. అలాంటి విమర్శలను ఇంతవరకూ నమ్మనివారు ఇప్పుడు జగన్‌కి అనుకూలంగా వస్తున్న సర్వేల ఫలితాలను చూస్తే తప్పకుండా నమ్ముతారని విశ్లేషకులు అంటున్నారు.



సర్వే జగనా సుఖినోభవన్తు అని ఆశీర్వదిస్తున్న సర్వేల ప్రకారం ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ అంటూ తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ జగన్ హవా నడుస్తోంది. ఇటు అసెంబ్లీలోనూ, అటు పార్టమెంటులోనూ జగన్ పార్టీ బోలెడన్ని సీట్లు గెలుచుకుంటుంది. జగన్‌కి ఓట్లు వేయడానికి జనం ఎంతో ఉత్సాహంగా వున్నారు. అయితే, ఏం చూసి జగన్‌ని జనం నమ్ముతారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలి కాలంలో అడుగంటపోయిన తన ఇమేజ్‌కి బూస్టప్ ఇచ్చుకోవడం కోసమే జగన్ ఇలాంటి సర్వేలను ప్లాన్ చేశాడన్న అభిప్రాయం ఎవరికైనా కలిగితే దాన్ని ఖండించలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి ట్రిక్కులు జనం దగ్గర పనిచేయవని చెబుతున్నారు.