మంత్రులపై ఇంటెలిజెన్స్ నిఘా.! అప్పుడే పనితీరుపై జగన్ ఆరా.!

 

రెండున్నర సంవత్సరాల తర్వాత కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేపడతానని, ఇప్పుడున్న మంత్రుల్లో 80-90శాతం మందిని వాళ్ల పనితీరు ఆధారంగా మార్చేసి, కొత్త వారికి అవకాశం కల్పిస్తానంటూ, వైసీఎల్పీ మీటింగ్ లో ముందే ప్రకటించిమరీ మంత్రివర్గ విస్తరణ చేపట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి... వంద రోజులు కూడా పూర్తికాకుండానే, అప్పుడే మంత్రుల పనితీరుపై దృష్టిపెట్టారట. మంత్రుల పనితీరుపై ఆరా తీయడమే కాకుండా, అవినీతికి చోటు లేకుండా పనిచేస్తున్నారో లేదో తెలుసుకుంటున్నారట. శాఖలవారీగా అధికారుల నుంచి ఎప్పటికప్పుడు డేటా తీసుకుంటూ మార్కులు వేస్తున్నారట. ముఖ్యంగా ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేస్తున్నారో లేదో తెలుసుకుంటున్నారని పార్టీ అండ్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అయితే, పలువురు మంత్రులపై సీఎం జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదులు వచ్చాయట. అధికారుల నుంచే కాకుండా, పార్టీ వర్గాల నుంచి కూడా కంప్లైంట్స్ రావడంతో ఆయా మంత్రులను జగన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉద్యోగుల బదిలీల వ్యవహారంలో మంత్రుల బంధువుల జోక్యం, పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు రావడంతో... ఇంటలిజెన్స్ నుంచి జగన్ వివరాలు సేకరించినట్లు చెబుతున్నారు. ప్రతి చిన్న విషయాన్ని మానిటర్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి.... తప్పు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదని నేరుగానే చెబుతున్నారట. ఒకరిద్దరు మంత్రులకైతే జగన్ క్లాస్ కూడా పీకారని మాట్లాడుకుంటున్నారు. 

తమతమ శాఖల్లో లోటుపాట్లు జరిగితే మంత్రులే బాధ్యతవహించాలంటోన్న జగన్మోహన్ రెడ్డి... ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే మాత్రం ఉపేక్షించేది లేదని మొహమాటం లేకుండా చెబుతున్నారట. అయితే, పదవి చేపట్టి ఇంకా వంద రోజులు కూడా కాకుండానే, ఈ మానిటరింగ్ ఏంటంటూ పలువురు మంత్రులు ఇబ్బంది ఫీలవుతున్నారట.