ఈ మాత్రం ఓదార్పు చాలునా..!


ఓదార్పు యాత్రలు, పాద యాత్రలు అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఎవరు అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని అందరికీ తెలిసిందే. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ మరణానంతరం చేపట్టిన ఓదార్పు యాత్రలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. తనకు టైం దొరికినప్పుడల్లా ఓదార్పు యాత్ర అంటూ మొదలుపెడతాడు. మరి అలాంటి జగన్ కు ఓదార్పు కావాల్సి వచ్చింది. నంద్యాల, కాకినాడ ఎన్నికల ఓటమి జగన్ ను తేరుకోలేని దెబ్బ కొట్టాయి. విజయం తమదేనని గట్టి నమ్మకంతో ఉన్న అతనికి ఓటర్లు పెద్ద షాకే ఇచ్చారు. నంద్యాల ఓటమి తరువాత ఆయన కాకినాడ ప్రచారంలో కూడా సరిగా పాల్గొనలేదు. ఇక జగన్ ఓటమిపై టీడీపీ నేతలు కూడా స్పందించి.. జగన్ కు ఓదార్పు అవసరమని సెటైర్లు కూడా వేశారు. మరి ఈ సెటైర్లను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సీరియస్ గా తీసుకున్నారేమో కానీ.. జగన్ ను ఓదార్చేవిధంగా మాట్లాడారు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీలు గెలవడం చాలా సహజమని… గతంలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో టీడీపీ పలు చోట్ల డిపాజిట్లు కోల్పోయిందని అన్నారు. అయితే ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో అదే స్థానాల్లో టీడీపీ భారీ మెజార్టీతో గెలిచిందని గుర్తు చేశారు. కాబట్టి ఉప ఎన్నికల ఫలితాలు… సాధారణ ఎన్నికల ఫలితాలు ఒకే రకంగా ఉంటాయని ఊహించలేమంటూ కాస్త జగన్ కు ఓదార్పు కలిగేలా మాట్లాడారు. మరి ఓటమి తరువాత సొంత పార్టీ నేతలే పార్టీ మారాలని చూస్తున్న నేపథ్యంలో ఉండవల్లి మాటలు జగన్ కు నిజంగానే ఓదార్పును కలిగించి ఉంటాయి...