మంటని పొడిచే కొద్దీ పెద్దదవుతుంది! మోదీ అయినా, యోగీ అయినా అంతే!

ఒక వ్యక్తిని మనం వ్యతిరేకించాలంటే అతను ఏదైనా పొరపాటు చేసి వుండాలి. లేదంటే అతడ్ని మనం ద్వేషించాలంటే అతడేదైనా దారుణమైన తప్పు చేసి వుండాలి. ఇక ఒక వ్యక్తిని మనం అసహ్యించుకోవాలంటే తాను పరమ నీచుడై వుండాలి! కాని, మన ప్రజాస్వామ్య దేశంలో ఈ మధ్య ఒక విడ్డూరం మొదలైంది! అదే ఆకారణ అసహనం!

 

ఆ మధ్య దేశంలో అసహనం ప్రబలిందంటూ అవార్డులు వాపస్ చేశారు కొంత మంది మేధావులు. వాళ్లు ఎందుకు చేశారు? వాళ్లకు వాపస్ ఇచ్చిన ఆ అవార్డ్ లు గతంలో ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు ఎందుకు ఇచ్చారు? ఇదంతా పెద్ద చర్చ! అది పక్కన పెడితే అసలు అసహనం నిజంగా మన దేశంలో వుందా? ఈ ప్రశ్నకు సమాధానం అవును అనే! అసహనం నిజంగానే వుంది! కాని, హిందూత్వం వినిపించే అతి వాదుల్లో కాదు! వారికంటే ఎక్కువగా అభ్యుదయవాదులమని చెప్పుకునే వారిలో అసహనం ప్రజ్వరిల్లుతోంది!

 

అభ్యుదయవాదులు, లిబరల్స్, ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులు.. ఇలా ఎన్ని పేర్లు పెట్టుకున్నా మన దేశంలో చాలా మంది తరతరాల పాత చింతకాయ నిర్వచనాలకు స్థిరపడిపోయారు. వాట్ని మార్చుకునే ఉద్దేశమే వున్నట్టుగా కనిపించదు. అందులో ప్రధానమైంది, కాషాయం వేసిన వార్ని కఠినాత్ములుగా, కర్కశులుగా చూడటం! హిందూత్వం వినిపిస్తే చాలు వార్ని అంటరాని వారిగా చూసే సంస్కృతి మన దేశంలో ఎప్పుడూ కొనసాగుతోంది. అదే తాజాగా యోగి ఆదిత్యనాథ్ ఎంపిక తరువాత కూడా బయటపడింది! ఆయన్ని విమర్శించేవారు, వ్యతిరేకించేవారు, అడ్డూ అదుపు లేకుండా తిట్టిపోసే వారూ అందరూ ఏకమై దాడి మొదలు పెట్టారు! వాళ్ల ప్రధాన అభ్యంతరం, ఆరోపణ ఏంటంటే... యోగి ఆదిత్యనాథ్ ఒక హిందూ మతోన్మాది! దీనికి ఏంటి ఆధారం?

 

యోగి ఆదిత్యనాథ్ అయిదు సార్లు వరుసగా ఎంపీగా ఎన్నికైన ప్రజా నేత. ఆయనను గోరఖ్ పూర్ ప్రజలు నమ్మకంతో పదే పదే పార్లమెంట్ కు పంపించారు. లక్షల మెజార్టీ ఇచ్చి మరీ తమ ప్రతినిధిగా చేశారు! దీన్ని గౌరవించే బాధ్యత మీడియాలోని కొందరు జర్నలిస్టులకి, చర్చల్లో పాల్గొనే మేధావులకి, సోషల్ మీడియాలో చెలరేగే అభ్యుదయవాదులకి లేదా? లేక గోరఖ్ పూర్ ఓటర్ల కంటే యోగి ఆదిత్యనాథ్ గురించి దేశంలో ఎక్కడెక్కడో వుంటోన్న అపర మేధావులకే ఎక్కువ తెలుసా? 
యోగి ఆదిత్యనాథ్ ముక్కుసూటిగా మాట్లాడతారు. అంతే తప్ప ఆయన ఇప్పటి వరకూ నీచమైన కామెంట్స్ ఏమీ చేయలేదు. అడపాదడపా హిందూత్వ వాదిగా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసి వుండవచ్చు. కాని, అవేవీ కూడా ఆయన్ని కోర్టుల్లో శిక్షార్హుడ్ని చేసేవి కావు! అలాంటి అవకాశమే వుంటే 1998 నుంచి ఇప్పటి వరకూ మాయవతి, అఖిలేష్ సర్కార్లు ఊరుకునేవా? యోగి ఆదిత్యనాథ్ ను కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టేవి కావా? 

 

యోగి ఆదిత్యనాథ్ ని బీజేపి అభిమానులు, మోదీ భక్తులు, కరుడుగట్టిన హిందూ వాదులు ఆకాశానికి ఎత్తేసి వుండొచ్చు. కాని, ఆయన్ని విమర్శించదలుచుకున్న ఉదారవాదులు మరీ తొందర్లో ఏం చేస్తున్నారో కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఒక మార్ఫ్ చేసిన ఫోటోషాప్ ఫోటోను చూపించి యోగి ఆదథ్యనాథ్ విదేశీ వనిత సేవలో తరిస్తున్నాడని షోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు! ఇది ఎంతటి మూర్ఖత్వం? అదే నిజమైతే ఇన్ని రోజులు ఆ వ్యవహారం దాగేదా? ఒక హిందూ సన్యాసిని ఆటాడుకునే అవకాశం మనం మీడియా వదులుకుంటుందా? ఫేక్ ఫోటో షేర్ చేసిన ప్రబుద్ధులు అక్కడితో ఆగకుండా ఇక ముందు ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు అంటూ రొమ్ములు బాదుకున్నారు! అసలు ఇదేం విడ్డూరం? ప్రత్యక్ష రాజకీయాల్లో వుంటోన్న ఒక నేత జనం భారీ మెజార్టీ ఇచ్చినప్పుడు సీఎం అయితే తప్పేంటి? ఎమ్మెల్యేల మద్దతు వున్నాయన పీఠం ఎక్కితే ఆపటానికి మనం ఎవరం? యూపీ ప్రజలు పిచ్చివాళ్లనా ఈ సోకాల్డ్ టీవీ స్టూడియో ఇంటలెక్చువల్స్ అభిప్రాయం? 

 

అకారణంగా యోగి ఆదిత్యనాథ్ పై మీడియా, మేధావులు, సెక్యులర్ పార్టీల అక్కసు చూస్తుంటే ఒకప్పటి అద్వానీయే గుర్తొస్తున్నారు! ఆయనని బాబ్రీ కూల్చివేతకు ప్రధాన కారకుడ్ని చేసి ఎదిగేలా చేసింది ఇలాంటి అభ్యుదయ బ్యాచీనే! వాజ్ పేయ్ తో పోల్చి అద్వానీ మతోన్మాది అన్నారు. తరువాత మోదీ వచ్చాక 2002 జపం చేస్తూ గుజరాత్ సీఎంని కాస్తా దేశ ప్రధానిని చేశారు! మోదీ ఎవరో తెలియని వారికి కూడా పనిగట్టుకుని పరిచయం చేశారు! మోదీ ఆగమనంతో అద్వానీ సెక్యులరే కాని నమో కర్కోటకుడని అన్నారు! ఇక ఇప్పుడు యోగి రాగానే మోదీ అభివృద్ది చేసే దార్శనికుడు కాని... యోగి కరుడుగట్టిన హిందూ వాది అంటున్నారు! ఇది యోగీకి రివర్స్ లో ఉపయోగపడి భవిష్యత్ లో ఆయన జాతీయ స్థాయి నేత అయినా ఆశ్చర్యం లేదు! అదే పనిగా అందరూ కలిసి ఆయనని అభిమన్యుడ్ని చేయాలనుకుంటే... జనం అతడిలో ఏదో గొప్పతనం వుందని బలంగా భావిస్తారు! లేకపోతే... ఇంత మంది ఎందుకు భయపడతారనేది జనం లాజిక్!

 

యోగి ఆదిత్యనాథ్ ని సన్యాసి అని, మతోన్మాది అని విమర్శలు చేస్తూ పసలేని తతంగం నడపకుండా కొన్నాళ్లు ఆగి తప్పులు చేస్తుంటే అప్పుడు టార్గెట్ చేయటం మంచిది! మత కలహాలు జరిగినా, అభివృద్ది జరగకపోయినా ఆయనని క్షమించాల్సిన అవసరం లేదు! అంతే కాని, అకారణంగా దుమ్మెత్తిపోసే కార్యక్రమం పెట్టుకుంటే మాత్రం అసలు ఎసరు రాక మానదు!