పార్లమెంట్.. రూమ్ నెo.5 లో ఏం జరుగుతోంది?

 

ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవడం అంటే ఏమిటో టీడీపీకి తెలిసి వస్తోంది. ఎన్ని ఏళ్ళ రాజకీయ జీవితంలో చూడని వన్నీ జగన్ బాబుకు చూపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టలని చూస్తున్న జగన్ పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కేటాయించిన పార్లమెంటులోని ఐదో నంబర్ గదిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం టీడీపీ కార్యాలయం పార్లమెంట్ లోని ఐదో నంబర్ గదిలోనే ఉంది.

అయితే అంత పెద్ద గది వాళ్లకి అక్కర్లేదని 22 మంది లోక్‌సభ, ఇద్దరు రాజ్యసభ సభ్యులున్న ఆ గదిని తమ పార్టీకి కేటాయించాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ చేసిన విజ్ఞప్తిని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించినట్లు తెలిసింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత ఐదో నంబర్ గదిని ఖాళీ చేసి మూడో అంతస్తులో ఉన్న చిన్న గదిలోకి టీడీపీ తమ కార్యాలయంగా మార్చుకోవలసి ఉంటుందని అంటున్నారు. పార్లమెంటు ఆవరణలోని ఐదో నంబర్ గది దాదాపు 35 సంవత్సరాల నుండి తెలుగుదేశం అధీనంలో ఉన్నది. 

1984లో ఎన్‌టీ రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ 30 లోక్‌సభ సీట్లు గెలుచుకోవటంతో ఐదో నంబర్ గదిని ఆ పార్టీకి కేటాయించారు. తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంది సభ్యులుండటం వల్ల గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న ఆ గదిని పార్టీ కార్యాలయం కోసం కేటాయించారు. అప్పటినుంచీ ఆ గది టీడీపీ కార్యాలయంగా కొనసాగుతూనే ఉంది. 1989లో తెలుగుదేశం లోక్‌సభ సభ్యుల సంఖ్య రెండుకు పడిపోయినా ఆ ఐదో నంబర్ గదిని మాత్రం ఎలానో కాపాడుకున్నారు. 

2004లో టీడీపీ సభ్యుల సంఖ్య ఐదుకు పడిపోయినప్పడు కూడా అప్పటి టీడీఎల్‌పీ నాయకుడు ఎర్రంనాయుడు, 2009 ఎన్నికల్లో టీడీపీ ఆరు సీట్లు మాత్రమే గెలిచినా అప్పటి టీడీఎల్‌పీ నాయకుడు నామా నాగేశ్వరరావు ఐదో నంబర్ గది తమ చేయి జారకుండా కాపాడుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం లోక్‌సభ సభ్యుల సంఖ్య మూడుకు పడిపోవటం సుజనా చౌదరి, రమేష్, గరికపాటి రామ్మోహన్‌రావు, వెంకటేష్ బీజేపీలో చేరిపోవటంతో రాజ్యసభలో టీడీపీకి ఇద్దరు సభ్యులే మిగిలారు. 

దీనికితోడు ఆ సీట్లను వైసీపీ గెలుచుకోవడంతో ముప్పై ఐదేళ్ళు పైగా ఉంటున్న ఆ గది నుండి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఖాళీ చేయవలసి వస్తోంది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి ఈ ఐదో నంబర్ గదికోసం గట్టిగా కృషి చేశారని అంటున్నారు. ఆయన బీజేపీ నాయకులను కలిసి ఐదోనంబర్ గదిని తమకు కేటాయించవలసిన అవసరం గురించి పలుమార్లు వివరించటంతో వైసీపీకి కేటాయించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. 

అయితే ఈ గది వైసీపీకి దక్కకుండా చూసేందుకు తెలుగుదేశం నాయకులు గట్టిగా ప్రయత్నించినా ఫలితం కనిపించటం లేదని అంటున్నారు. నిజానికి వారం క్రితమే ఐదో నంబర్‌ గదిలో ఉన్న టీడీపీ కార్యాలయాన్ని పార్లమెంటరీ మంత్రిత్వశాఖకు కేటాయించారని సమాచారం. ఈ గదిని పార్లమెంటరీ మంత్రిత్వశాఖ కార్యదర్శి పేరిట కేటాయించారని, దానిని తర్వాత మరెవరికైనా కేటాయించవచ్చునని అనుకున్నారు. అది వైసీపీకే అని తాజాగా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.