ఏపీలో వరుస విచారణలు.. స్ధానిక ఎన్నికల వేళ టీడీపీని బదనాం చేసేందుకేనా?

ఏపీలో ప్రతిపక్ష టీడీపీ నేతలే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు ఇప్పుడు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గత టీడీపీ సర్కారులో తీసుకున్న నిర్ణయాలపై వరుసగా విచారణకు ఆదేశించడం నిజంగా వారి మెడకు చుట్టుకుంటుందా? లేక కేవలం ప్రజల్లో టీడీపీని పలచన చేయడమే వాటి అంతిమ లక్ష్యమా అన్న చర్చ మొదలైంది. వైసీపీ అధికారం చేపట్టి 9 నెలలవుతున్నా ఇప్పటివరకూ ఏ ఒక్క దర్యాప్తులోనూ టీడీపీ నేతలపై చర్యలకు ఉపక్రమించకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

గతేడాది జూన్ నెలలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపించింది. ఏకంగా గత ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా కేంద్రంగా వాడుకున్న ఉండవల్లి కరకట్ట ప్రజావేదికను అక్రమ కట్టడంగా గుర్తిస్తూ రాత్రికి రాత్రే కూల్చివేసింది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా లక్షల కొద్దీ ఉన్న అక్రమ కట్టడాలను గుర్తించి చర్యలు తీసుకుంటుందని భావించినా అలాంటిదేమీ జరగలేదు. విశాఖలోని టీడీపీ కార్యాయానికి కూడా నోటీసులు ఇచ్చి వదిలేశారు. మిగతా చోట్ల ఒకటీ అరా కట్టడాల కూల్చివేతలు చేపట్టారే కానీ వాటిని ఆ తర్వాత కొనసాగించలేదు. అదే సమయంలో గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడంతో పాటు మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించారు. కానీ సంచలన అంశాలేవీ లేకపోవడంతో మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏమీ చేయలేని పరిస్ధితి. ఆ తర్వాత రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు ప్రారంభించిన ఈ ప్రచారాన్ని అధికారంలోకి వచ్చాక తీవ్రంగా పరిగణించి విచారణ జరిపిస్తుందేమోనని అంతా ఆశించారు. కానీ ఇన్ సైడర్ ట్రేడింగ్ ను నిరూపించే ఆధారాలేవీ పకడ్బందీగా దొరక్కపోవడంతో సీఐడీ కూడా నోటీసులతోనే సరిపెట్టింది. చివరకు దాన్ని మరింత లోతుగా విచారించేందుకు అంటూ ఈడీ, ఐటీకి అప్పచెప్పారు.

ఇదే కోవలో ఇంటిలిజెన్స్ మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు అక్రమంగా భద్రతా పరికరాలు కొన్న వ్యవహారంలోనూ వైసీపీ ప్రభుత్వం గట్టిగా ముందుకెళ్లలేని పరిస్ధితి. ఏబీ వెంకటేశ్వరరావు విదేశాల నుంచి నిఘా పరికరాలు కొనే ప్రక్రియలో రాష్ట్రానికి చెందిన సమాచారాన్ని ఇజ్రాయెల్ కు అందించారని, తన కుమారుడి సంస్ధకు మేలు చేశారని, పై అధికారుల అభ్యంతరాలను పట్టించుకోలేదని పలు ఆరోపణలతో ఆయన్ను సస్పెండ్ చేశారు. కానీ అంత తీవ్రత ఉన్న అంశాన్ని కేంద్రానికి ఎందుకు రిఫర్ చేయలేదంటే జవాబు లేదు. చివరికి క్యాట్ ఇదే ప్రశ్న వేస్తే రాష్ట్ర ప్రభుత్వం తెల్లమొహం వేయాల్సిన పరిస్ధితి. తాజాగా ఈఎస్ఐ స్కామ్ లోనూ ఇదే తంతు. ఈఎస్ఐకు చెందిన పలువురు డైరెక్టర్ స్ధాయి అధికారులు చెల్లింపులు జరిపారంటూ ఆరోపించిన ప్రభుత్వం... అందులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఏంటనే దానిపై స్పష్టత ఇవ్వలేకపోతోంది. ఓవైపు ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ మరోవైపు కొనుగోళ్లకు ఆయన ఆదేశించారని నిరూపించే ఆధారాలేవీ బయటపెట్టలేకపోవడం ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్ధితిగా మారింది. ఇదే కోవలో మంత్రివర్గ ఉపసంఘం అప్పుడెప్పుడో గత ప్రభుత్వ నిర్ణయాల ద్వారా చోటుచేసుకున్న అక్రమాలపై ప్రారంభించిన దర్యాప్తు 9 నెలల తర్వాత ఇప్పటికి పూర్తి చేస్తే ప్రభుత్వం చివరికి సిట్ కు అప్పగించింది. ఇందులోనూ అదే డొల్లతనం. రాజధాని భూములతో పాటు విశాఖ భూములపై విచారణ, ఎర్రచందనం వంటి పలు అంశాలను ఇందులో ప్రస్తావించినా అందులో అక్రమాలను మంత్రివర్గ ఉపసంఘం నిరూపించిందా అంటే అధీ లేదు. దీంతో ఈ వరుస విచారణల పర్వం కేవలం టీడీపీ నేతలను ప్రజల్లో పలుచన చేయడమే లక్ష్యంగా సాగుతున్నట అర్ధమవుతోంది. స్ధానిక సంస్ధల ఎన్నికల నేపథ్యంలో విపక్షాన్ని సాధ్యమైనంత అప్రతిష్ట పాలు చేయాలనేదే ఇందులో లక్ష్యంగా కనిపిస్తోంది.