పవన్-వైసీపీల గుట్టు బయటపడింది...!

 

ఉన్నట్టుండి ఒక్కసారిగా పవన్ టీడీపీపై విమర్శలు గుప్పించడంతో...ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడేక్కాయి. నిన్నటి వరకూ ఊహించింది ఒకటి ఇప్పుడు జరుగుతోంది ఒకటి. ఇప్పటివరకూ ఏ సభ జరిగినా టీడీపీ పై పవన్ ఇంతలా విమర్శలు చేసింది లేదు. బీజేపీపై, వైసీపీ పై విమర్శలు గుప్పించారు కానీ.. నిజానికి అందరూ అన్నట్టుగానే టీడీపీ పై కాస్త సాఫ్ట్ కార్నర్ తోనే ఉండేవారు. అలాంటిది జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున పనిగట్టుకొని టీడీపీనే టార్గెట్ చేసినట్టు ఉంది పవన్. ఓ రకంగా చెప్పాలంటే వైసీపీని, కేంద్రాన్ని తిట్టినప్పుడు కూడా ఇన్ని విమర్శలు గుప్పించలేదు. టీడీపీపై ఏకంగా ఓరేంజ్ లో అవినీతి మరకలు అంటించారు. ఏకంగా లోకేశ్ పేరునే చెబుతూ చంద్రబాబును ప్రశ్నించారు.

 

దీంతో ఇప్పుడు టీడీపీ నేతలు పవన్ పై గుర్రుమంటున్నారు. పవన్ వెనుక బీజేపీ ఉందని.. మోడీ ఉన్నారని ఇలా ఎవరి నచ్చిన విమర్శలు వాళ్లు చేస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ భవిష్యత్ వ్యూహం ఎలా ఉండబోతోందో నిన్నటి సభతో తేలిపోయింది. ఇకపై తాను టీడీపీ తో కలిసి వెళ్ళేది లేదని ఈ సభ ద్వారా పవన్ చెప్పేసారు. అయితే ఇప్పుడు మరో కొత్త విషయం వెలుగు చూసింది. వైసీపీతో పవన్ వెళ్లే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని సాక్షాత్తు వైసీపీ కి చెందిన తిరుపతి ఎంపీ వరప్రసాద్ నిర్ధారించారు. ప్రత్యేక హోదా పై వైసీపీ పార్లమెంట్ లో అవిశ్వాసం పెట్టనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఇన్ని రోజుల నుండి పోరాటం చేస్తున్నా.. కనీసం సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని.. అందుకే అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నామని చెప్పారు. దీనికి అన్ని పార్టీల మద్దతు కావాలని అన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ టీడీపీ పై చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించి...  నాలుగేళ్లుగా హోదాపై మాట్లాడని పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికైనా మాట్లాడినందుకు సంతోషంగా ఉందన్నారు. హోదాకోసం పోరాడితే పవన్ కు మద్దతిస్తాం... హోదాపై జనసేన, వైసీపీ కలిపే పోరాడతామని అన్నారు. ఇంకా ఒకరోజు పవన్ ఫోన్ చేసి కలవాలంటే కలిశాను.. అప్పుడు వైసీపీ నేతలు నన్నేందుకు విమర్శిస్తున్నారని అడిగారు.. దానికి మీరు టీడీపీకి వంత పాడుతున్నారు కాబట్టే విమర్శిస్తున్నాం అని చెప్పాను.. నేను టీడీపీ తో లేను అవసరమైతే జగన్ కు మద్దతిస్తాను అని చెప్పారని తెలిపార అని అసలు విషయం బయటపెట్టారు. దీంతో వైసీపీ-జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేస్తాయి అని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తలపై పవన్ ఎలా స్పందిస్తాడు.. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.