దస్తగిరిని కాపాడు దేవుడా!

గురువారం నాడు పులివెందులలో జగన్మోహన్‌రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి పేరిట ఈనెల 22వ తేదీన ఆయన మరో బాబాయ్ వైఎస్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. గురువారం నాడు జగన్ స్వయంగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా లోకల్‌గా వున్న వైసీపీ కార్యకర్తలు మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు పులివెందులకు వచ్చే అవకాశం వుంది. వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఇల్లు మరెక్కడో లేదు.. జగన్ ఇంటికి కూత వేటు దూరంలోనే వుంటుంది. గురువారం నాడు జగన్ నామినేషన్ సందర్భంగా దస్తగిరి ఇంటి మీదకి వైసీపీ కార్యకర్తలు ఆవేశంతో దాడి చేసి లేపేసే ప్రమాదం వుందనే అనుమానాలు వున్నాయి. అందుకే దస్తగిరికి బుధ, గురువారాల్లో భద్రత పెంచారు. ప్రస్తుతం 3 ప్లస్ 3, 4 ప్లస్ 4 భద్రత నుంచి 4 ప్లస్ 4, 10 ప్లస్ 10 స్థాయికి భద్రతను పెంచారు. ఇదిలా వుంటే వైసీపీ కారకర్తల బారి నుంచి దస్తగిరిని కాపాడు దేవుడా అని దస్తగిరి కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారు. ఇదిలా వుంటే, మరోవైపు దస్తగిరి కూడా ర్యాలీగా వెళ్ళి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రేపు నామినేషన్ దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జై భీమ్ భారత్ పార్టీ తరఫున దస్తగిరి బరిలోకి దిగుతున్నారు. జగన్ నామినేషన్ వేసినప్పుడే తాను కూడా నామినేషన్ వేస్తానని, తనకు అధికారులు అడ్డుపడుతున్నారని దస్తగిరి అంటున్నారు. అధికారులు అడ్డుకున్నా తాను గురువారం నాడు నామినేషన్ వేయడం ఖాయమని ఆయన అంటున్నారు. తాను నిర్వహించే ర్యాలీలోకి వైసీపీ కార్యకర్తలు ప్రవేశించి దాడి చేసే అవకాశం వుందని దస్తగిరి అనుమానిస్తున్నారు.
Publish Date: Apr 24, 2024 6:21PM

చావగొడుతున్న భార్య.. చెరువులోకి దిగిన భర్త!

ఇది యావత్ భర్తలు సానుభూతిని వ్యక్తం చేయాల్సిన ఘటన. ఇలాంటి పరిస్థితి తమకూ రాకూడదని ప్రార్థించాల్సిన ఘటన. భర్త భార్యని కొడితే వార్త కాదు.. భార్య భర్తని కొడితే వార్త. అలాంటి వార్త వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్‌లోని కొంపల్లె ప్రాంతానికి చెందిన నగేష్ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం పెళ్ళయింది. (చాలామంది భార్యలు ఆమెని సంప్రదించి, భర్తని కొట్టడం ఎలా అనే పాఠాలు నేర్చుకునే ప్రమాదం వుంది కాబట్టి, సదరు భార్య పేరు గానీ, ఆమె వివరాలు గానీ ఇవ్వడం లేదు.. ఇది భర్తలకు మావంతుగా మేం అందిస్తున్న సహకారం). వీళ్ళ దాంపత్యానికి గుర్తుగా ఇద్దరో ముగ్గురో పిల్లలు కూడా వున్నారు. పిల్లలు పుట్టేవరకూ బాగానే వుందిగానీ, ఆ తర్వాత ఏం తేడా వచ్చిందో ఏమో, సదరు నగేష్ భార్య భర్తని చావబాదడం ప్రారంభించింది. తనకు ఎప్పుడు కోపమొస్తే అప్పుడు భర్తకి బడితపూజ చేసేది. చేతికి ఏది దొరికితే దానితో చావబాదే పెళ్ళాం ధాటికి తట్టుకోలేక, ఇక జీవించి వృధా అని నగేష్ ఏం చేశాడంటే, తన ఇంటికి దగ్గర్లోనే వున్న చెరువులోకి దిగాడు. ఇది గమనించిన వారు, పెద్దగా అరిచి నగేష్‌ని ఆపారు. చెరువులో ఎందుకు దూకావని అడిగితే, నగేష్ తన కష్టాన్నీ చెప్పుకుని బాధపడ్డాడు.  తన భార్య తనను ప్రతిరోజూ టైమ్ టేబుల్ తప్పకుండా కొడుతుందని, అప్పుడప్పుడు వాతలు కూడా పెడుతుందని చెప్పుకొచ్చి భోరుమన్నాడు. తన మాటలు జనం నమ్ముతారో లేదోనని చొక్కా విప్పి మరీ తన ఒంటి మీద వున్న వాతలు చూపించాడు. తన పిల్లలని తన దగ్గరకి రానివ్వదని, తన పిల్లల కోసం ఐస్‌క్రీమ్ కొని తీసుకెళ్తే, తన భార్య దాన్ని పిల్లలకు పెట్టకుండా తానే తినేస్తుందని చెప్పి లబోదిబోమన్నాడు. భార్య టార్చర్ భరించలేక తాను అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళడం కూడా మానుకుంటానని చెప్పాడు. అలాంటి సందర్భాల్లో తన పిల్లలు డాడీ ఎక్కడకి వెళ్ళాడమ్మా అని తన పిల్లలు అడిగితే, తన భార్య చచ్చిపోయాడు అని కూల్‌గా చెబుతుందని చెప్పి నగేష్ బావురుమన్నాడు. తన భార్య నుంచి తనకు విడాకులు కావాలని వేడుకున్నాడు. విడాకులు ఇప్పించకపోతే చచ్చిపోతానని చెప్పాడు. దాంతో స్థానికులు అతనికి నచ్చజెప్పారు. తాడు వేసి అతన్ని  చెరువులోంచి పైకి లాగాడు. పరిస్థితులు మెల్లగా చక్కబడతాయిలే అని అతనికి చెప్పి ఇంటికి పంపించారు. నగేష్ ఇంటికి వెళ్ళాడు. మరి పరిస్థితులు చక్కబడతాయో... భార్య చేతిలో ఇంకో రౌండ్ కోటా పడుతుందో ఆ పైవాడికే తెలియాలి.
Publish Date: Apr 24, 2024 5:29PM

కేసీఆర్ బస్సు యాతన ప్రారంభం

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ ప్రచారంలోకి దిగారు. బుధవారం నాడు తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమైంది. తెలంగాణ భవన్‌లో వున్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, మహిళల హారతులు అందుకుని, కార్యకర్తల బాణాసంచా హడావిడి మధ్య కేసీఆర్ బస్సు ఎక్కారు. బుధవారం నుంచి మే 10 వరకు కేసీఆర్ బస్సు యాత్ర జరుగుతుంది. మిర్యాలగూడలో మొదటి సభ, సిద్దిపేటలో చివరి సభ జరుగుతాయి. రాష్ట్రమంతా తిరగాలని కేసీఆర్‌కి విజ్ఞప్తులు వస్తున్నప్పటికీ సమయం తక్కువగా వుండటం, ఎండ బాగా వుండటం వల్ల కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే తిరగాలని కేసీఆర్ భావించారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ చేపట్టిన ఈ బస్సు యాత్రను.. బస్సు యాత్ర అనడం కంటే ‘బస్సు యాతన’ అనడం బెస్టు. ఎందుకంటే, పార్లమెంట్ ఎన్నికలలో తమ పార్టీ పదికి పైగానే స్థానాలు గెలుస్తుందని బీఆర్ఎస్ నేతలు బిల్డప్పుగా చెబుతున్నప్పటికీ, ఒక్క మెదక్ స్థానంలో తప్ప ఎక్కడా గెలిచే అవకాశాలు లేవని ఏరకంగా చూసిన క్రిస్టల్  క్లియర్‌గా అర్థమవుతోంది. మెదక్ విషయంలో రేవంత్ రెడ్డి ఏదైనా మ్యాజిక్ చేస్తే  ఆ స్థానం కూడా బీఆర్ఎస్‌కి దక్కనట్టే. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఈ వయసులో పదిహేను రోజులపాటు బస్సు యాత్ర చేసి యాతన పడటం అవసరమా అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కేసీఆర్ ఇప్పుడు చేపట్టిన బస్సు యాత్ర అయిపోయిన పెళ్ళికి సన్నాయి ఊదినట్టుగా వుందని భావిస్తున్నారు.
Publish Date: Apr 24, 2024 5:04PM

మళ్ళీ ‘టీఆర్ఎస్’గా మార్చాలా? ఎల్లెళ్ళవయ్యా!

కేసీఆర్ తన పార్టీ పేరును ఏ దుర్ముహూర్తంలో ‘టీఆర్ఎస్’ నుంచి ‘బీఆర్ఎస్’ అని మార్చాడో అప్పటి నుంచి ఆయన కుటుంబాన్ని, ఆయన పార్టీని దరిద్రం బబుల్ గమ్ అతుక్కున్నట్టు అతుక్కుంది. ఆ దరిద్రం పుణ్యమా అని అటు అధికారం పోయింది. ఇటు ముద్దుల కూతురు తీహార్ జైల్లో పడింది. పదేళ్ళ కేసీఆర్ హయాంలో జరిగిన కుంభకోణాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. ఇంకా ముందు ముందు ఇంకెంత బ్యాండ్ పడనుందో ఆ భగవంతుడికే తెలియాలి. తెలంగాణ ప్రజల్లో వున్న సెంటిమెంట్‌ని అడ్డం పెట్టుకుని, ఆంధ్ర ప్రజలను తిట్టిపోసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ నుంచి ‘భారత రాష్ట్ర సమితి’ అని మార్చడమే మామూలు విషయం కాదు.. పార్టీ పేరు బీఆర్ఎస్ అని మార్చిన సమయంలో పింక్ పిల్లకాయలంతా కేసీఆర్ ప్రధానమంత్రి కాబోతున్నారని కలలు కన్నారు. కేసీఆర్ కూడా ఆ ఊహల్లో ఊరేగారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పేరుతో హడావిడి చేశారు. ఇంతకాలం తాము తిట్టిపోసిన ఆంధ్రప్రదేశ్‌లో కూడా బిఆర్ఎస్ బ్రాంచ్ ఓపెన్ చేశారంటే వీళ్ళ తెంపరితనానికి, నిస్సిగ్గు వైఖరికి ఇంతకంటే వేరే ఉదాహరణ వుంటుందా? శరీరంలో వున్న సిగ్గుని చివరి బొట్టు వరకూ బయటకి కక్కేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ శాఖ ప్రారంభించాలన్న ఆలోచన రాదు. 2023 ఎన్నికల తర్వాత కేసీఆర్ కొంతకాలం ముఖ్యమంత్రిగా వుంటారు. ఆ తర్వాత 2024 పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో వున్న ఎంపీ సీట్లన్నీ గెలుచుకుని, ఏకంగా మోడీని పక్కకి నెట్టేసి కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారు... అప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుని తెలంగాణ ప్రజల్ని ఉద్ధరిస్తారు... ఇదీ బీఆర్ఎస్ వర్గాలు ఆరోజుల్లో కన్న పగటి కల. రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఆ కల కల్లగా మారిపోయింది. అప్పటి నుంచి బీఆర్ఎస్ వర్గాల్లో ‘పార్టీ పేరు మారిన తర్వాతే మనం మటాష్ అయిపోవడం ప్రారంభమైంది’ అనే అంతర్మథనం మొదలైంది. పార్టీ పేరు మార్చడం తప్పే అని చాలామంది పార్టీ నాయకులు కేసీఆర్ తిడతాడేమో అనే భయం కూడా లేకుండా బాహాటంగానే చెప్పారు. మరికొంతమంది అయితే, త్వరలో మా పార్టీ పేరు టీఆర్ఎస్‌గా మారబోతోంది అని ప్రకటించేశారు కూడా. పార్టీ వర్గాల ఆకాంక్షలను అర్థం చేసుకోవడంతోపాటు తన మనసులో కూడా వున్న ‘బీఆర్ఎస్’ ప్రభావం ప్రేరేపించడంతో కేసీఆర్ ఎన్నికల సంఘాన్ని సంప్రదించారని తెలుస్తోంది. ఒక్కసారి పార్టీ పేరుని మార్చుకున్న తర్వాత పాత పేరును ఎన్నికల కమిషన్ ఐదేళ్ళపాటు ఫ్రీజ్ చేస్తుంది. ఐదేళ్ళపాటు ఆ పేరుని ఎవరికీ కేటాయించదు. మీరు మళ్ళీ మాకు టీఆర్ఎస్ పేరు కావాలంటే ఎలా సార్? ఇంత చిన్న లాజిక్ మీరు ఎలా మిస్సయ్యారు సార్... అనే అర్థం వచ్చేలా ఎన్నికల సంఘం అధికారుల నుంచి రియాక్షన్ వచ్చిందట. దాంతో బీఆర్ఎస్ అనే పేరును టీఆర్ఎస్‌గా మార్చాలనే ప్రయత్నాలు మానేశారట. ఇప్పటికిలా సర్దుకుపోయి పేరు మార్పు సంగతి ఐదేళ్ళ తర్వాత ఆలోచిద్దామని డిసైడ్ అయ్యారట.
Publish Date: Apr 24, 2024 3:39PM

పెమ్మసాని ఆస్తులు, అర్హతలు చూసి కుళ్ళుకుని చస్తున్న వైసీపీ!

వైసీపీలో ఇప్పుడు కొత్త ఏడుపు మొదలైంది. తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌కి వేల కోట్లలో వున్న ఆస్తులను చూసి వైసీపీ వర్గాలు కుళ్ళుకు చస్తున్నాయి. పెమ్మసానికి ఇన్ని ఆస్తులు వున్నాయి.. అన్ని ఆస్తులు వున్నాయి అని వైసీపీ మీడియాలో ఏవేవో కట్టుకథలు వండి వార్చుతున్నారు. అన్ని ఆస్తులు వుండటం వల్లే చంద్రబాబుకు ఎన్నో కోట్లు ఇచ్చి టిక్కెట్ కొనుక్కున్నారనే ప్రచారం మొదలుపెట్టారు. ఈ చెత్త ప్రచారాన్ని పెమ్మసాని చంద్రశేఖర్ విజయవంతంగా తిప్పికొడుతున్నారు. భగవంతుడు తనకు చిన్నతనంలోనే ఎంతో సంపద వచ్చేలా అనుగ్రహించారని, తాను వైసీపీ నాయకుల మాదిరిగా అడ్డదారుల్లో డబ్బు సంపాదించలేదని కౌంటర్ ఇస్తున్నారు. తాను వైసీపీ నాయకుల తరహాలో డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదని, తన మాతృభూమికి సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని వైసీపీ నాయకుల కర్ణభేరులు బద్దలయ్యేలా చాటుతున్నారు.  చంద్రబాబుకు డబ్బిచ్చి టిక్కెట్లు కొనుకున్నారంటే ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులకు కర్రుకాల్చి వాత పెట్టేలాంటి ఫ్లాష్‌బ్యాక్‌ని పెమ్మసాని రివీల్ చేశారు. 2019 ఎన్నికల సందర్భంగా పెమ్మసానిని రాజకీయాల్లోకి రప్పించడానికి జగన్ తీవ్రంగా ప్రయత్నించాడట.. ఎమ్మెల్యే, ఎంపీ ఏ సీటు కావాలంటే ఆ సీటుకి టిక్కెట్ ఇస్తాం.. ఎలక్షన్లో పోటీ చేయడం ఇష్టం లేదంటే ఎమ్మెల్సీగానో, రాజ్యసభ సభ్యుడిగానో ఉంటానన్నా ఓకే... మీరు మా పార్టీలో చేరితే చాలు అంటే భారీ స్థాయిలో రాయబారాలు నడిపారట. వీళ్ళు ఎంత కాళ్ళావేళ్ళఆ పడినప్పటికీ, వైసీపీ విధానాలు, వ్యక్తుల పద్ధతులు నచ్చని పెమ్మసాని వైసీపీకి నో చెప్పారట. అప్పుడు తమ పార్టీలో చేరాలంటూ కాళ్ళావేళ్ళా పడిన వైసీపీ నాయకులు ఇప్పుడు తాను టీడీపీలో చేరితే ఇష్టమొచ్చిన ప్రచారాలు చేయడం వాళ్ళ సంస్కారాన్ని బహిర్గతం చేస్తోందని పెమ్మసాని అంటున్నారు. టీడీపీకి ప్రస్తుత గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈసారి ఎన్నికలలో పోటీ చేయకుండా తప్పుకున్నారు. ఇక్కడ నుంచి కొత్తగా పోటీకి దిగిన టీడీపి అభ్యర్థిని ఒక ఆట ఆడుకోవాలని అనుకున్న వైసీపీ నాయకులు పెమ్మసాని దూకుడు చూసి బిత్తరపోతున్నారు. పెమ్మసాని ఆడించేవాడే తప్ప, వేరేవాళ్ళు ఆడుకునేవారు కాదని అర్థమై నీళ్ళు నములుతున్నారు. ఎన్నారై కదా, ఏసీ కార్లో వచ్చి, జనానికి చేతులు ఊపి వెళ్ళిపోతాళ్ళే అనుకుంటే, నియోజగకవర్గంలోని గడపగడపనూ పెమ్మసాని సందర్శిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్య కంటే ప్రచారంలో చాలా ముందున్నారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ అనేది  డిసైట్ అయిపోయిందని భావిస్తున్నారు.
Publish Date: Apr 24, 2024 3:02PM

బీజేపీ స్ట్రాటజీ వ‌ర్క్ అవుట్ అవుతుందా? మోదీ గ్యారెంటీ ప్ర‌భావం ఎలా ఉంది?

మొద‌టి ద‌శ పోలింగ్ త‌రువాత బీజేపీలో ఎందుకు టెన్ష‌న్ పెరిగింది. మ‌రో వైపు యూపీపై ఆ పార్టీ ఎందుకు ప‌ట్టు కోల్పోతోంది. యూపీ బీహార్ వంటి పెద్ద స్టేట్స్ లో రాజకీయంగా అత్యంత కీలకమైన భూమిక పోషించే జాట్లు, బీజేపీ పట్ల వ్యతిరేకంగా మారిపోయారు. గ‌తంలో ఈ సామాజిక వర్గం అండ‌తోనే బీజేపీ రికార్డు స్థాయి విజయాలను సొంతం చేసుకుంది.  వాస్త‌వానికి బీజేపీ బలం అంతా ఉత్తరాదిలోనే ఉంది. బీజేపీ అధికారంలోకి రావ‌డానికి ప్ర‌ధాన కారణం ఉత్తరాది రాష్ట్రాలే అని ఖ‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు. మొత్తం 542 ఎంపీ సీట్లలో సగానికి పైగా ఉత్తరాదిలో రాష్ట్రాల్లోనే  ఉన్నాయి. దాంతో బీజేపీకి ఎపుడు విజయం ఉత్తరాది నుంచే దక్కుతూ వ‌చ్చింది. అయితే  ఇప్పటికే రెండు ఎన్నికల్లో బీజేపీని గెల‌పించిన ఉత్తరాది ప్ర‌జ‌లు ఈసారి మార్పు కోరుకుంటున్నారు. గతంలో వచ్చిన దాని కంటే సీట్లు తగ్గుతాయని బీజేపీ నేత‌లే అంటున్నారు.  2019లో బీజేపీ ఉత్తరాదిన గెలుచుకున్న సీట్లు 260. అయితే ఈ సీట్ల‌లో ఈ సారి యాభై సీట్లు త‌గ్గ‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. అంటే అపుడు 210 ఎంపీ సీట్లు మాత్రమే బీజేపీకి వస్తాయి. ఇది నిజంగా బీజేపీకి చాలా ఇబ్బంది పెట్టే అంశం. ఎందుకంటే మెజారిటీ కి మ్యాజిక్ ఫిగర్ 273 గా ఉంది. దానికి అరవై సీట్ల దూరంలో బీజేపీ నిలిచిపోతే ఆదుకోవాల్సింది కచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలే. లేకపోతే బీజేపీ సొంతంగా మెజారిటీని సాధించి అధికారంలోకి రావడం అన్నది సాధ్యపడదు. 2019 ఎన్నికల్లో చూసుకుంటే రాజస్థాన్ లో మొత్తం పాతికకు పాతిక సీట్లు గెలుచుకున్న బీజేపీకి ఈసారి 10 సీట్లు త‌గ్గ‌వ‌చ్చ‌ట‌. అలాగే బీహార్ లో మొత్తం 40 ఎంపీ సీట్లు ఉంటే 38 గెలుచుకుంది. ఈసారి అలా కుదరదు అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఆర్జేడీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు పుంజుకున్నాయి. దాంతో పది సీట్లు నష్టపోతుందనే అంచ‌నా. అదే విధంగా చూస్తే కనుక గుజరాత్ మొత్తం 26 ఎంపీ సీట్లనూ స్వీప్ చేసింది బీజేపీ. ఈసారి కనీసంగా రెండు ఎంపీ సీట్లు అయినా బీజేపీ నష్టపోతుంద‌ట‌. అలాగే హర్యానాలో నాలుగు సీట్లు బీజేపీ ఓడిపోతుందట‌. ఢిల్లీలో ఏడు ఎంపీ సీట్లు ఉంటే అందులో ఏడింటికి ఏడూ 2019లో బీజేపీ ఖాతాలో పడ్డాయి. కానీ ఈసారి చూస్తే కనుక బీజేపీకి అయిదు దాకా వస్తాయని అంటున్నారు. అంటే రెండు ఎంపీ సీట్లు నష్టపోక తప్పదు. కర్నాటకలో 28 ఎంపీ సీట్లలో పాతిక దాకా బీజేపీ గెలుచుకుంది. ఈసారి పది ఎంపీ సీట్లు బీజేపీ నష్టపోతుందని అంచనాలు ఉన్నాయి. కర్నాటలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. దాంతో కాంగ్రెస్ కూడా గట్టిగా పోరాడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి ఏకపక్ష విజయాలు ద‌క్క‌వు. ఉత్తర భారతాన బీజేపీ యాభైకి పైగా ఎంపీ సీట్లు నష్టపోవడానికి కారణాలు చూస్తే కనుక అక్కడ చాలా రాష్ట్రాలలో బలంగా ఉన్న రాజ్ పుట్ లు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీకి ఒకనాడు రాజ్ పుట్ లు బలంగా మద్దతు ఇస్తూ ఉండేవారు. ఈసారి వారు మనసు మార్చుకున్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను వారు వ్యతిరేకిస్తున్నారు. రాముడు రాముడే.. రాజకీయం రాజకీయమే... ఓటు ఓటే... అంటున్న 3 కోట్ల మంది రాజపుత్రులు బిజెపి మోడీ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ అరాచకాలపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్య‌క్తం అవుతుంది.  మొదటి దశ ఎన్నికల అనంతరం నిర్వహించిన లోక్ పోల్ సర్వేలో ఉత్తర భారతం నుంచి బీజేపీకి చెప్పుకోదగ్గ ఆధిక్యం ఏమీ లేదని తేలింది. బీజేపీ హయాంలో ప్రభుత్వం రైతులపై కాల్పులు జరిపిన తీరు, నల్లచట్టాలు తీసుకొచ్చి దౌర్జన్యాలకు పాల్పడిన తీరు, రెజ్లర్ కూతుళ్లను రోడ్డున పడేసిన తీరుపై హర్యానా, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తోన్న జాట్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ సీనియర్ నేత కిరోడిలాల్ మీనా  సామాజికవర్గం మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయబోతోందని అంతర్గతంగా వార్తలు వస్తున్నాయి.   అలాగే బీజేపీ ప్రభుత్వం, రాజ్‌పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడిని లాగి, తలపాగా విసిరి, పోలీసులు అదుపులోకి తీసుకున్న తీరు, అప్పటి నుంచి రాజ్‌పుత్ సమాజం మొత్తం బీజేపీకి ఓటు వేయబోమని ప్రమాణం చేసింది.  దీని వల్ల మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌లలో బీజేపీకి భారీ నష్టం వాటిల్లనుంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో దాదాపు అన్ని స్థానాల్లో నిర్ణయాత్మక స్థానంలో ఉన్నప్పటికీ, త్యాగి మరియు సైనీ వర్గాలకు చెందిన అభ్యర్థులను బిజెపి టికెట్లు ఇచ్చి నిలబెట్టలేదు. దీంతో అస‌హ‌నంతో వున్న ఆ రెండు వర్గాల వారు  బిజెపికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో వివిధ చోట్ల పంచాయితీలు చేస్తున్నారు. అంతే కాదు  గుర్జర్ సామాజికవర్గ ప్రతినిధులను టిక్కెట్ ఇవ్వ‌కుండా దూరంగా ఉంచింది, దీంతో చాలా మంది గుర్జర్ నాయకులు బిజెపికి వ్యతిరేకంగా గళం విప్పారు. వరుసగా 10 సంవత్సరాలుగా గుర్జర్ సామాజికవర్గ ప్రజలకు తగిన వాటా లభించలేదు.  దీని ప్రభావం రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్‌లో స్ప‌ష్టంగా కనిపిస్తుంది. ఈసారి కాశ్మీర్‌లో కూడా అనేక ప్రజా సంఘాలు మరియు కాశ్మీరీ పండిట్ల సంస్థలు బిజెపిపై తమ ఆగ్రహాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నాయి.  ఇది జమ్మూ,  కాశ్మీర్‌లో బిజెపికి ఓట్లను తగ్గిస్తుంది. గ‌త రెండు ఎన్నిక‌ల‌తో పోల్చితే, ఈ ఎన్నికల్లో బీజేపీపై పలు వర్గాల ఆగ్రహావేశాలకు లోనుకావాల్సి వస్తోందని తాజా సర్వేలో తేలింది.  ఈ కారణంగానే బీజేపీ ఓటర్లు ఫ‌స్ట్ ఫేజ్‌లో ఓటు వేసేందుకు బయటకు రాలేదు.  తదుపరి దశ పోలింగ్‌లో బీజేపీ మద్దతుదారుల ఆగ్రహం తగ్గుతుందా? ఇదే బీజేపీ అధిష్టానానికి వేధిస్తున్న ప్ర‌శ్న‌.  - ఎం.కె. ఫ‌జ‌ల్‌  
Publish Date: Apr 24, 2024 2:58PM