రాణి రుద్రమ ఆదర్శంగా పోరాడండి.. అమరావతి మహిళలకు వైసిపి ఎంపీ పిలుపు

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి మహిళలు 200 రోజులకు పైగా దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వైసిపి ఎంపీ రఘురామకృష్ణం రాజు వీరిని ఉద్దేశించి మాట్లాడుతూ రాజధానిని కాపాడుకునే ఈ ఉద్యమంలో మహిళలే ముందుండి నడపాలన్నారు. రాజధాని ప్రాంత మహిళలు నాయకత్వానికి ప్రతీకలైన రాణిరుద్రమ, ఝాన్సీ లక్ష్మి బాయి వంటి వీరనారీమణుల స్ఫూర్తిగా పోరాటం చేయాలనీ ఆయన పిలుపునిచ్చారు. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో రాజధాని రైతులను దగా చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని అయన ఆరోపించారు. 

సి ఆర్ డి ఎ ద్వారా రైతులకు వచ్చిన అధికారాలని కాలరాసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని..తాజాగా ప్రభుత్వం చేసిన కొత్త చట్ట సవరణ ద్వారా రైతులకు దక్కేది గుండుసున్నానే అని అయన ఆరోపించారు. పరిపాలన వికేంద్రీకరణ పేరుతొ మూడు రాజధానులు అనేది కేవలం కంటితుడుపు మాత్రమేనని కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో కూడా స్పష్టంగా ఉందని అయన పేర్కొన్నారు. సెక్షన్ 94(3) ద్వారా ఒకే రాజధానిలో రాజ్ భవన్ ,హైకోర్టు, అసెంబ్లీ వంటి భవనాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసిందని అయన తెలిపారు. రైతులకు న్యాయం చేయాలి అంటే దాదాపు లక్ష కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది ఐతే దానికి బదులు కేవలం 4, 5 వేల కోట్లతో అమరావతి రాజధాని పూర్తిచేయవచ్చని అయన తెలిపారు. 

ఇదే సమయంలో కృష్ణా గుంటూరు జిల్లాల టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని పవన్ కళ్యాణ్ చేసిన డిమాండ్ పై సంధిస్తూ.. రాజీనామా చేయడం కంటే రాజీలేని రాజకీయ పోరాటం చేయడం అవసరమని పవన్ కళ్యాణ్ గుర్తిం చాలని అయన అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన బీటెక్ రవి కి ఆ ఆలోచన మానుకొని ప్రత్యక్ష పోరాటానికి దిగాలని అని సూచించారు. అంతే కాకుండా సీఎం జగన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ "ముఖ్యమంత్రి గారూ ! సాక్షి ని కాకుండా మనస్సాక్షిని నమ్మండి…" ఈ విషయంలో రిఫరెండం పెట్టి ప్రజల ఆలోచన తెలుసుకోండి. మీరు ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య పెన్షన్ 250 రూపాయలు పెంచేందుకే మన దగ్గర డబ్బు లేనప్పుడు వేల కోట్లతో మూడు రాజధానుల నిర్మాణం ఎలా సాధ్యం అవుతుంది ? అని అయన జగన్ ను ప్రశ్నించారు. 

కేవలం సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఓట్లు వస్తాయని భ్రమ పడి.. ప్రజాభీష్టాన్ని నిర్లక్ష్యం చేయవద్దని ఆయన హితవు పలికారు. విలువలకు కట్టుబడి నన్ను రాజీనామా చేయాలని కోరుతున్న వైసీపీ నేతలు అదే విలువల కోసం రాజీనామా చేయడానికి మీరు కూడా సిద్ధమా ? అని అయన ప్రశ్నించారు. పార్టీ ఎమ్మెల్యేలు అందరూ వారి వారి నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితి తెలుసుకుని ముఖ్యమంత్రికి వివరిస్తే ఆయన మనసు కరుగుతుంద ని తాను నమ్ముతున్నానని అయన అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కోసం ముందే మాట ఇచ్చినట్టుగా నాలుగు జోన్లు ఏర్పాటు చేయాలనీ అలా కాకుండా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమని అయన ప్రశ్నించారు. 151 స్థానాలు గెలుచుకున్న మీరు రాజీనామా చేసి ప్రజల వద్దకు రిఫరెండం కోసం వెళ్తే 175 కు 175 మీరే గెలుచుకోవచ్చు అని ఐతే ఇది ప్రభుత్వానికి తాను ఇచ్చే సూచన మాత్రమేనని వైసిపి పార్టీకి కాదని అన్నారు ఇదే సమయంలో అమరావతి రైతులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఆదర్శంగా తీసుకొని పోరాడాలని అయన సూచించారు. తనకు సెక్యూరిటీ వచ్చిన తర్వాత అమరావతి వెళ్లి రైతుల వెనుక ఉండి పోరాటం చేస్తానని అయన తెలిపారు .