ఎట్టకేలకు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి..!!

తమ పార్టీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను అధికారపార్టీలోకి లాగేసుకున్నారని, వారిపై అనర్హత వేటు వేసే వరకు తాము అసెంబ్లీకి రామని చెప్పి.. అన్నట్టుగానే అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న వైసీపీ మనస్సు మార్చుకున్నట్టు తెలుస్తోంది.. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకాబోతున్నట్టు సమాచారం.

 

 

గత ఏడాది నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు.. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నా.. ఆ పార్టీ అధినేత జగన్‌ మాత్రం ఇన్నాళ్లూ పట్టించుకోలేదు.. అయితే, తాజాగా మనస్సు మార్చుకున్నట్టు తెలుస్తోంది.. కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది.. వారు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది, ప్రజా సమస్యలపై చర్చించడానికి కాదట.. సమావేశాలు జరుగుతున్న సమయంలోనే తమ పార్టీ ఎమ్మెల్యేలందరి చేత రాజీనామా చేయించాలని జగన్‌ భావిస్తున్నారట.. ఏపీకి ప్రత్యేకహోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమని ప్రసంగించి ఒకేసారి తమ పార్టీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలనుకుంటున్నారట.. దీనివల్ల చంద్రబాబు మీద ఒత్తిడి పడటంతో పాటు, ప్రత్యేకహోదా విషయంలో తమ పార్టీ గట్టిగా ఉందనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుందని జగన్ భావిస్తున్నారట.. నిజానికి జగన్, ఎమ్మెల్యేల చేత ఎప్పుడో రాజీనామా చేయించాలి అనుకున్నారు.. కానీ ఎంపీల రాజీనామాల ఎఫెక్ట్ తో కాస్త వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది.. అయితే ఇప్పుడు జగన్ మనసు మారింది.. అసెంబ్లీకి వెళ్లకుండా ఉండే కంటే రాజీనామా చేస్తే ప్రజల్లో సానుభూతి వస్తుందని జగన్ భావిస్తున్నారట.

 

 

అయితే కొందరు వైసీపీ శ్రేణులు మాత్రం జగన్ నిర్ణయం పట్ల ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే ఎంపీల చేత రాజీనామా చేపించి పార్లమెంట్ సాక్షిగా కేంద్రాన్ని నిలదీసే అవకాశాన్ని కోల్పోయారని విమర్శలు మూటగట్టుకున్నాం.. ఇప్పుడు ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామా చేపిస్తే ఇంకెన్ని విమర్శలు మూటకట్టుకోవాల్సి వస్తుందోనని భయపడుతున్నారట.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా ఉండటానికో లేదా రాజీనామా చేయడానికో మిమల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉందని అంటున్నారు.. చూద్దాం మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తరువాత ఏం జరుగుతుందో.