జగన్ పట్ల వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి.. ఇందుకేనా గెలిచింది?

 

ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన ప్పటి నుండి అవినీతిలేని పాలన అందిస్తానని వాగ్దానాలు చేస్తున్నారు. ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నారు. అయితే తన సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ‘ఎన్నికల్లో అప్పులు చేసి మరీ కోట్లు ఖర్చుపెట్టుకున్నాం. తీరా గెలిచాక పైసా తీసుకోవద్దంటున్నారు. ఇలా అయితే ఇక రాజకీయాలు చేసినట్టే.’ అని కొందరు ఎమ్మెల్యేలు తెగ ఫీలై పోతున్నారట.

మంత్రులు, ఎమ్మెల్యేలు సహా ఎవరు అవినీతికి పాల్పడినా సహించబోనన్న జగన్ నిర్ణయం వారికి ఇబ్బందికరంగా మారిందట. ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఇంటిలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటున్న జగన్.. ఎమ్మెల్యేలు, మంత్రుల లావాదేవీలపై దృష్టిసారిస్తున్నారు. ఇదే క్రమంలో ఉద్యోగుల బదిలీల్లో జోక్యం చేసుకున్న నలుగురు మంత్రులకు జగన్ ఇప్పటికే ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే బాటలో సీఐల బదిలీల్లో రూ.10 లక్షలు తీసుకున్న ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేను తన వద్దకు పిలిపించుకుని మరీ సదరు సీఐకి డబ్బులు వెనక్కి ఇప్పించారు.

సీఐల బదిలీల్లో పది లక్షలు రూపాయలు తీసుకున్న ఎమ్మెల్యే నుంచి జగన్ డబ్బులు వెనక్కి ఇప్పించడం ఇప్పుడు ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతోందట. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో డబ్బులు లేకుండా ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం అసాధ్యం అన్న వాదన స్ధిరపడిపోయింది. ఏపీలో ఇటీవల ఎన్నికల్లో కూడా సగటున ప్రతీ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే అభ్యర్ధి దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు ఓ అంచనా. చాలా మంది పొలాలు, స్ధలాలు అమ్ముకుని, కొందరైతే అప్పులు చేసి మరీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే తన హయాంలో అవినీతి రహిత పాలన సాగాలన్న జగన్ నిర్ణయం వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోందట. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యాక కాంట్రాక్టులు, పైరవీల ద్వారా ఎంతో కొంత సంపాదించుకుందామనుకుంటున్న సమయంలో.. జగన్ ఇలాంటి అవినీతి రహిత పాలన నిర్ణయం తీసుకోవడం కొందరు ఎమ్మెల్యేలకు రుచించడం లేదట. ఇదే పరిస్ధితి కొనసాగితే ఇక రాజకీయాల్లో కొనసాగడం కూడా కష్టమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టింది అధికారంలోకి వస్తే తిరిగి సంపాదించుకునేందుకేనని, ఇప్పుడిలా ఆంక్షలు విధిస్తే తమ భవిష్యత్తు ఏం కావాలని వారు ప్రశ్నిస్తున్నారట.

మరోవైపు ఇంటిలిజెన్స్ వర్గాలతో తెప్పించుకుంటున్న సమాచారం ఆధారంగా నియోజకవర్గాలతో పాటు సచివాలయంలో సైతం ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు జగన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఐదారుగురు మంత్రులు, వారి వద్ద పనిచేస్తున్న సిబ్బంది చేస్తున్న దందాలు జగన్ దృష్టికి చేరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్ వారి విషయంలో సీరియస్ గా ఉన్నారట. ఇదే పరిస్ధితి కొనసాగితే కఠిన చర్యలకు వెనుకాడేది లేదనే హెచ్చరికలు కూడా పంపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట.