చిక్కుల్లో వైసీపీ ఎమ్మెల్యే కాటసాని... ముందు నుయ్యి వెనుక గొయ్యి

సామాన్యుల స్థలంలో బలమున్నోళ్లు బోర్డులు పాతేసి ఈ స్థలం మాదని దౌర్జన్యంగా ఆక్రమించడం చూస్తుంటాం. ఇప్పటికీ పలుచోట్ల కబ్జా భాగోతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా వంద కోట్ల విలువైన ఓ భూ వివాదం తెరమీదకు వచ్చింది. ఇది స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నమో లేక తెలియక ఇరు వర్గాలు ఒకే స్థలం కొని మోసపోయాయో తెలియదు కానీ.. ఈ వివాదంలో కర్నూల్ జిల్లా పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పేరు ఉండటం హాట్ టాపిక్ గా మారింది.

హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని తుఫ్రాన్‌పేట శివారు ప్రాంతంలో గల కోట్ల విలువైన భూమి వివాదాస్పదంగా మారింది. ఇరు వర్గాలూ తమదంటే తమదని వాదిస్తున్నాయి. పోలీసుల కథనం ప్రకారం... తుఫ్రాన్‌పేటలోని సర్వే నంబరు 72, 74, 85, 87, 88, 89లో సుమారు 50 ఎకరాల్లో శివప్రియ నగర్‌-2 పేరుతో రెండు దశాబ్దాల క్రితం వెంచర్ వేశారు. సర్వే నంబరు 88, 89లో ఉన్న దాదాపు 40 ఎకరాల స్థలంలో ఒక్కో ప్లాటు 200 చదరపు గజాల చొప్పున.. మొత్తం 828 ప్లాట్లు వేశారు. స్థానిక పగడాల వంశస్థులకు చెందిన ఈ భూమిని కర్నూలుకు చెందిన చంద్రమౌళీశ్వర్‌రెడ్డి జిపిఏ చేసుకొని 2000-2001 సంవత్సరంలో ప్లాట్లను విక్రయించగా.. తెలుగు రాష్ట్రాలకు చెందినవారు పలువురు వీటిని కొనుగోలు చేశారు. ప్రస్తుతం, ఈ ప్రాంతంలో ఎకరం రూ. 2 కోట్లకు పైగా పలుకుతుండటంతో.. మొత్తం దీని విలువ రూ.100 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. 

అయితే, ఈ భూమి వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డికి చెందినదంటూ ఇటీవల బోర్డు వెలిసింది. అంతేకాదు, ఈ ఏడాది ఏప్రిల్‌లో వెంచర్‌లో ఉన్న ప్లాట్ల హద్దురాళ్లను తొలగించారు. ఆ భూమిలోకి ఎవరూ వెళ్లకుండా కందకాలు కూడా తవ్వారు. దీంతో స్థలాలు కొన్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ అంశంపై కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సర్వే నంబరు 89లోని పదెకరాల భూమిని 2008లో నా భార్య పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించానని అన్నారు. నెల రోజులుగా కొంత మంది తనకు ఫోన్‌ చేసి ఇందులో తమకు ఫ్లాట్లు ఉన్నాయని అంటున్నారని తెలిపారు. అయితే, మా కంటే ముందే ఈ భూమిని వారికి అమ్మి ఉంటే వాళ్లకే ఇచ్చేస్తామని అన్నారు. కానీ ఈ వెంచర్‌పై మొదట్నుంచీ వివాదం ఉందని.. అప్పట్లో వెంచర్‌ వేసిన చంద్రమౌళీశ్వర్‌ తండ్రి శివారెడ్డిపై పలు కేసులున్నాయని, గతంలో సీబీసీఐడీ విచారణలో ఆయన జైలుకు కూడా వెళ్లారని చెప్పుకొచ్చారు. అంతేకాదు, తమ వద్ద భూమి కొనుగోలుకు సంబంధించి పక్కా ఆధారాలున్నాయని స్పష్టం చేశారు.

అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. భూమి కొనుగోలుకు సంబంధించి పక్కా ఆధారాలున్నాయని కాటసాని అంటున్నారు. ఆ వివాదాస్పద 40 ఎకరాల స్థలంలో పదెకరాల స్థలం తనదని బల్లగుద్ది చెప్తున్నారు. సరే తుఫ్రాన్‌పేటలో సర్వే నంబరు 89లోని పదెకరాల భూమి కాటసానిదే అనుకుందాం. మరి ఆయన ఎన్నికల అఫిడవిట్ లో ఆ భూమి వివరాలు ఉండాలిగా?. ఆయన సబ్మిట్ చేసిన ఎన్నికల అఫిడవిట్ లో ఆయన పేరు మీద కానీ, ఆయన భార్య పేరు మీద కానీ.. తుఫ్రాన్‌పేటలో సర్వే నంబరు 89 తో పదెకరాల భూమి ఉన్నట్టు వివరాలు లేవు. పలు సర్వే నెంబర్ల పేర్లతో తెలుగు రాష్ట్రాలలో ఉన్న భూమి వివరాలను పొందుపరిచిన ఆయన.. మరి ఈ పదెకరాల భూమి వివరాలను ఎందుకు పొందుపరచలేదు. భూమి కొనుగోలుకు సంబంధించి పక్కా ఆధారాలున్నాయంటున్న ఆయన ఎన్నికల అఫిడవిట్ లో భూమి వివరాలను తెలియజేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అఫిడవిట్ లో ఆస్తులు, కేసులు ఇలా అన్నీ వివరంగా ఇవ్వాల్సి ఉంటుంది. వివరాలు దాచి చట్టపరంగా పదవి కోల్పోయిన వారు కూడా పలువురు ఉన్నారు. ఇక ఇప్పుడు కాటసానికి కూడా చట్టపరంగా చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూమి తనది అంటే అఫిడవిట్ లో ఎందుకు పొందుపరచలేదని అడుగుతారు. భూమి తనది కాదు అంటే బోర్డు ఎందుకు పాతావు అని అడుగుతారు. మొత్తానికి కాటసాని పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుంది.