రాజధాని నిర్ణయంతో నా భవిష్యత్ నాశనమైనా పర్లేదు.. పొలం పని చేస్కుంటా!!

ఏపీ అసెంబ్లీలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల నిర్ణయంతో తన రాజకీయ భవిష్యత్ నాశనం అయిపోయినా తాను వైఎస్ జగన్ వెంటే నడుస్తానని స్పష్టం చేశారు. సీఆర్డీఏ రద్దు, అధికార-అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను స్వాగతిస్తున్నట్టు ఆర్కే తెలిపారు. ఈ మూడు రాజధానుల ప్రకటనతో తనకి రాజకీయ భవిష్యత్ ఉన్నా లేకపోయినా జగన్ వెంట నడుస్తానని అన్నారు. రాజకీయాల్లో ఉంటే జగన్ వెంటే ఉంటా. రాజకీయాల్లో లేకపోతే నా పొలంలో ఉంటానని ఆర్కే స్పష్టం చేశారు.

అసెంబ్లీ అమరావతిలోనే ఉంటుందని సీఎం ప్రకటించడం తమ అదృష్టమని, అమరావతికి దక్కిన గౌరవమని ఆర్కే అన్నారు. సెక్రటేరియట్ తో సామాన్యులకు పని ఉండదని చెప్పుకొచ్చారు. రాజధాని అంటే అందరిదని, కొందరిది మాత్రమే కాకూడదని అన్నారు. రైతులు కోరుకుంటే భూములను తిరిగి ఇవ్వాలని, అమరావతిని అగ్రికల్చర్ జోన్ గా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు ఆర్కే తెలిపారు.

చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు తాము ఎంతో సంతోషించామని అన్నారు. అయితే, దాని వెనుక ఎంతో స్కామ్ జరిగిందని తెలిసి తాను ఎంతో బాధపడ్డానని ఆర్కే చెప్పారు. ప్రజలకు చంద్రబాబు అవాస్తవాలు చెబుతున్నారని, రైతుల ఆశలను ఆయన నీరు గార్చారని మండిపడ్డారు. తన స్వార్థ ప్రయోజనాల కోసమే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారని విమర్శించారు. రాజధాని కోసం చంద్రబాబు కష్టపడి ఉంటే తాడేపల్లి, మంగళగిరి నియోజకవర్గాల్లో ప్రజలు ఎందుకు టీడీపీని ఓడించారని ఆర్కే ప్రశ్నించారు.