రాధాకృష్ణకు పెద్ద ఊరట... కేసు కొట్టివేత...

 

పరువు నష్టం కేసులో ఆంధ్రజ్యోతి  ఎండీ వేమూరి రాధాకృష్ణకు పెద్ద ఊరట లభించింది. ఇక ఈ కేసు వేసిన వైసీపీ ఎమ్యెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. గతంలో ఒకసారి జగన్ మోడీని కలిసిన సంగతి తెలిసిందే కదా. దీనిపై ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది. దీనికిగాను తమ పార్టీ నాయకుడికి, పార్టీకి ఈ కథనం నష్టం చేకూర్చేలా ఉందని, అసత్య కథనాలు ప్రచురించారని ఆరోపిస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఆంధ్రజ్యోతిపై పరువునష్టం దావా వేశారు. ఇక దీనిపై విచారించిన హైకోర్టు కేసును కొట్టివేసింది. అంతేకాదు రామకృష్ణారెడ్డికి చురకలు కూడా అంటించింది... ఆంధ్రజ్యోతి కథనంలో మీకేం సంబంధం ఉంది... సంబంధం లేని అంశంపై కోర్టును ఎలా ఆశ్రయిస్తారని ప్రశ్నించారు. అభ్యంతరకరమైన కథనం ప్రచురిస్తే బాధితులే కోర్టును ఆశ్రయించాలని, ఈ కేసుతో పిటిషనర్‌కు ఎటువంటి సంబంధం లేదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలతో ఆ పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణకు, బ్యూరో చీఫ్‌కు సంబంధం ఉన్నట్లు పిటిషనర్ ఎటువంటి ఆధారం చూపలేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.