జగన్ కి షాకిచ్చిన పీకే.. కేసీఆర్ తో దోస్తీ డౌటే!!

 

ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేళ జగన్, కేటీఆర్ భేటీ కావడం హాట్ టాపిక్ అయింది. ఈ భేటీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కొందరు వైసీపీ నేతలే.. రాబోయే ఎన్నికల్లో జగన్, టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తారా ఏంటని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ భేటీ గురించి ప్రశాంత్ కిషోర్ టీం కూడా షాకింగ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చిందట. జగన్, కేటీఆర్ తో భేటీ అయి రాజకీయాలపై చర్చించారు. ఇక దీనిపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్న జగన్.. ప్రశాంత్ కిషోర్ టీంకు ఆ బాధ్యతను అప్పగించారు.అయితే ప్రజల దాకా వెళ్ళకుండానే.. వైసీపీ నేతలు, కార్యకర్తలను ముందుగా సర్వే చేస్తేనే చాలా ప్రతికూల ఫలితాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రజల వద్దకు వెళ్లకుండానే వైసీపీ నేతల నుండి తీసుకున్న ఫీడ్ బ్యాక్ చాలా నెగిటివ్ గా వచ్చిన నేపథ్యంలో జగన్ కేసీఆర్ తో దోస్తీ పై ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.

ఇంతకాలం జగన్ పాదయాత్రలతో పార్టీకి కాస్తోకూస్తో మైలేజీ తీసుకొని వచ్చారని సంబరపడుతున్న వైసీపీ శ్రేణులకు జగన్ కేటీఆర్ తో భేటీ నీరుగార్చేసింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నోటికొచ్చినట్టు ఆంధ్ర ప్రజలను తిడుతూ వారి మనోభావాలను కించపరిచే కేసీఆర్ తో పొత్తు పెట్టుకొని ఏపీలో ఎన్నికలకు వెళితే ఘోరంగా ఓడిపోవడం ఖాయమని ఓ వైసీపీ నేత చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక పొరుగు రాష్ట్ర ప్రాంతీయ పార్టీ నేతలతో జతకడితే ఏపీకి ఏవిధంగా లాభం కలుగుతుందో జగన్ ఆలోచించుకోవాలని.. దీనిని ఏపీ రాష్ట్ర ప్రజలు హర్షించరని ఒక నేత ఆందోళన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్నడూ తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ప్రాంతం గురించి విమర్శలు చేయని చంద్రబాబుని ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ప్రజలు ఆదరించలేదు. అలాంటిది ఆంధ్ర ప్రజలని దొంగలు, దోపిడీదారులు అని అభివర్ణించిన కేసీఆర్.. గతంలో తెలంగాణ వస్తే ఆంధ్ర విద్యాసంస్థలను నిషేధిస్తామని చెప్పిన కేసీఆర్.. ఆంధ్రాలో బిర్యాని పేడ బిర్యానీ అంటూ వంకలు పెట్టిన కేసిఆర్.. ఏపీ రాజకీయాల్లో జగన్ కు మద్దతిస్తే అది జగన్ కు మైనస్ తప్ప ప్లస్ కాదని, ఏపీ ప్రజలు కేసిఆర్ మాటలు ఇంకా మరిచిపోలేదని ఒక నేత అభిప్రాయపడ్డారట.

ప్రత్యేక హోదా పైన వ్యతిరేకత ప్రదర్శించి, పోలవరం పైన పలు కేసులను దాఖలు చేసి, విద్యుత్ వినియోగానికి సంబంధించి ఏపీకి రావాల్సిన 5200 కోట్ల ధనాన్ని ఎగవేసి, ఇక విభజన చట్టంలో ఉన్న ఉమ్మడి ఆస్తులను పంపిణీ చేయడానికి ఏ విధంగానూ సహకరించని టీఆర్ఎస్ పార్టీని ఏపీ ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారట. ఇవన్నీ పక్కన పెట్టి కేసిఆర్ తో దోస్తీ చేయడమంటే జగన్ తన గోతి తానే తీసుకున్నట్లు అవుతుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారట. రాహుల్ గాంధీ ఏపీ పర్యటన సమయంలో.. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా పైన చేస్తామని ప్రకటన చేసిన సందర్భంలో కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లు తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సోనియా గాంధీ ఏపీకి ప్రత్యేకహోదా హామీ ఇస్తే.. తెలంగాణకు వచ్చి ఏపీకి వరాలు ఇవ్వడం ఏంటని టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. మరి జగన్ అలాంటి వారితో కలిసి టీడీపీని ఓడించటానికి పని చేస్తే అది వైసీపీకే నష్టం చేస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇక తాజాగా కేటీఆర్ తో జగన్ భేటీ అయిన నేపథ్యంలో వైసీపీలో చేరాలని, వైసీపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని భావించిన ఆశావహులు చాలామంది వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో వేలుపెట్టి సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ను ఓడించడానికి పనిచేస్తామని టీఆర్ఎస్ చెప్తున్న నేపథ్యంలో.. టీఆర్ఎస్ తో దోస్తీ తనకు లాభిస్తుంది అనుకుంటున్న జగన్ కు సొంత పార్టీ నేతల నుండి వస్తున్న వ్యతిరేకత పునరాలోచనలో పడేలా చేసిందట. ఒకవేళ జగన్ నిజంగానే టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే తన వేలితో తన కంటినే పొడుచుకున్నట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.