ఏపీ ఖజానాలో డబ్బుల్లేవు కానీ.. 19 మంది సలహాదారులు, లక్షల్లో జీతాలు!

 

వైసిపి అధికారం లోకి వచ్చినప్పటి నుంచిసలహాదారుల నియామకం ఒక ప్రవాహంగా సాగుతుంది. టిడిపి హయాంలో 6 సలహాదారులు మాత్రమే ఉన్నారు. వీరిలో నలుగురికి క్యాబినెట్ ర్యాంక్ ఉండేది. ఈ సలహాదారుల్లో చివరి దాకా ఉన్నవారు ఒకరిద్దరేనని చెప్పుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు వైసీపీ కి ఏకంగా 19 మంది సలహాదారులున్నారు. అందులో 10 మందికి క్యాబినెట్ హోదా కట్టబెట్టారు. ఒక్కొక్కరికీ జీతభత్యాల కింద రూ.3 లక్షల నుంచి రూ.3.50 లక్షలు చెల్లిస్తున్నారు. వారి సహాయక సిబ్బంది జీతభత్యాలు దీనికి అదనం. ఒక వైపు డబ్బుల్లేవంటూ ఆర్భాటాలకు పోకూడదని అంటూనే సలహాదారుల కోసం లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో 25 మంది సభ్యులున్నారు. ఈ సంఖ్యకు పోటా పోటీగా సలహాదారుల నియామకాలున్నాయి. విచిత్రమేమిటంటే రాష్ట్రంతో సంబంధం లేని వారిని కూడా సలహాదారుడుగా నియమించుకున్నారు. 

మొత్తం సలహాదారుల్లో ఎక్కువ మందిని రాజకీయ లేదా ఇతర పునరావాసం కోసం నియమించుకున్నారని ఆరోపణులున్నాయి. వీరు ఎలాంటి సలహాలిస్తున్నారు.. ఇస్తున్న సలహాలను ప్రభుత్వ పెద్దలు ఎలా స్వీకరిస్తున్నారన్నదే అర్థం కావటం లేదు. చాలా మందికి ఈ పదవులు అలంకార ప్రాయమేనని ప్రభుత్వ పెద్దలకు సలహాలిచ్చేంత సాహసం వీరు చెయ్యలేరనే వాదన కూడా ఉంది. మరింత విచిత్రమేంటంటే చాలా మంది సలహాదారులకు సచివాలయంలో కూర్చునేందుకు ఛాంబర్ల కూడాలేవు. సలహాదారులు ఎక్కడ కూర్చొని సలహాలు ఇస్తున్నారని దానిపై స్పష్టత లేదు. పెంపకమే లక్ష్యంగా పదవులను సృష్టించటానికి సలహాదారుల నియామకమే ఒక ఉదాహరణ. మీడియాకు సంబంధించే ముగ్గురు సలహాదారులున్నారు. పరిశ్రమల శాఖకు కూడా 3 సలహాదారులను నియమించారు. ఐటీకి 2 సలహాదారులను ఇచ్చారు. అష్టకష్టాల్లో ఉన్న ఆర్ధిక శాఖకు ఒక సలహాదారును కేటాయించారు. ఆ సలహాదారు ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. ప్రజా వ్యవహారాలకు ఒక సలహాదారును ప్రజా విధానాలకు ఒక సలహాదారును విడివిడిగా నియమించారు. గల్ఫ్ దేశాలతో ఏపీ పారిశ్రామిక సంబంధ బాంధవ్యాలు నెలకొల్పేందుకు క్యాబినెట్ ర్యాంకు ఇచ్చి మరీ ఒక సలహాదారును నియమించారు. వ్యవసాయ శాఖ సలహాదారు విజయ్ కుమార్ చంద్రబాబు హయాం నుంచి అదే పోస్టులో ఉన్నారు.