నోటి దురుసు... అమరావతిని శ్మశానంతో పోల్చిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ


అమరావతిని శ్మశానంతో మంత్రి బొత్స సత్యనారాయణ పోల్చారంటూ భగ్గుమన్నారు టిడిపి నేతలు. రైతుల త్యాగాలను అవహేళన చేస్తారా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు చంద్రబాబు. శత్రువు కూడా అమరావతిని శ్మశానంగా పోల్చలేరని అన్నారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రముఖులను కూడా మంత్రి అవమానించారన్నారు. బొత్సను వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.శ్మశానంలో వైసిపి ఎమ్మెల్యే ఎలా గెలిచింది అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. క్యాబినెట్ సమావేశం స్మశానంలో నిర్వహిస్తున్నారా అని నిలదీశారు. బొత్స వ్యాఖ్యలు చూస్తుంటే రాక్షసులు పాలిస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు బుద్దా వెంకన్న. బొత్స మెదడు అరికాళ్లలో ఉందని అనుకున్నానని.. కానీ అసలు మెదడే లేదని నిన్నటి ప్రకటనతో తేలిపోయిందన్నారు టిడిపి నేత నారా లోకేష్. అమరావతిని శ్మశానంతో పోల్చి ప్రజా రాజధానిని అవమాన పరిచారని విమర్శించారు.

దేశం గుర్తించిన రాజధాని అమరావతిని శ్మశానంతో పోల్చడం మంత్రి బొత్స దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పనులు ఆపేసి రాజధానిని నిర్వీర్యం చేసి ఇపుడు ఇలా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సోమిరెడ్డి. రాజధానిని శ్మశానంతో పోల్చడం సరికాదన్నారు మాజీ మంత్రి టీడీపీ నేత యనమల రామకృష్ణుడు. శాసన సభ, హై కోర్టు, సచివాలయం వీరి కళ్లకు శ్మశానంగా కనిపిస్తున్నాయా అని ఆయన ప్రశ్నించారు. మంత్రి బొత్సను తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని యనమల డిమాండ్ చేశారు.మంత్రి బొత్స, సీఎం జగన్ రోజు స్మశానంలో కూర్చుని పరిపాలన సాగిస్తున్నారని నిలదీశారు టిడిపి నేత.తన వ్యాఖ్యల పై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ అమరావతిని తాను శ్మశానంతో పోల్చిలేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రైతుల దగ్గర భూములు తీసుకుని సరిగ్గా అభివృద్ధి చేయని చంద్రబాబు రాజధానిని స్మశానంగా మార్చారని మాత్రమే తాను అన్నట్లు మంత్రి వివరణ ఇచ్చారు.మొత్తం మీద బొత్సా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపింది.