కాంగ్రెస్ గూటికి వైసీపీ మైనార్టీలు..!

విభజన అనంతరం కాంగ్రెస్ మెజారిటీ ఓటు బ్యాంక్ ని వైసీపీ కొల్లగొట్టింది.. 2014 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించనప్పటికీ, బలమైన పార్టీగా నిలబడగలిగింది అంటే, అది కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పుణ్యమనే చెప్పాలి.. అయితే ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ మూలంగా వైసీపీ బలహీనపడే ప్రమాదం ఏర్పడింది.. గతంలో కాంగ్రెస్ కు అండగా ఉన్న ముస్లిం మైనార్టీలు, విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో ఏకపక్షంగా వైసీపీకి మద్దతు తెలిపారు.. కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. మైనార్టీలు వైసీపీకి హ్యాండిచ్చి కాంగ్రెస్ తో చేతులు కలపాలని చూస్తున్నారు.. దానికి కారణం వైఎస్ జగన్, బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరగటమే.

 

 

పైకి బీజేపీని వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నా, కేసుల భయంతో వాటిని మాఫీ చేసుకునేందుకు జగన్, బీజేపీతో రహస్యంగా దోస్తీ చేస్తున్నారనేది బహిరంగ రహస్యం.. దీంతో మైనార్టీలు జగన్ తమను మోసం చేసాడని భావిస్తున్నారు.. అందుకే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు.. తాజాగా కర్నూలులో వైసీపీ ముస్లిం కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరారు.. వన్ టౌన్ ఏరియాకు చెందిన 200 మంది వైసీపీ కార్యకర్తలు, వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు.. వారిని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.. ఈ సందర్భంగా మాట్లాడిన కోట్ల.. బీజేపీతో కలిసి జగన్ డ్రామాలు ఆడుతున్నాడు.. బీజేపీతో కలిసి జగన్ మైనారిటీలను మోసం చేసాడు.. అందుకే మైనారిటీ లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు అన్నారు.. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.. కాంగ్రెస్ పార్టీ లో ఉండి వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తింపు తెచ్చుకున్నాడు, అదే ఉద్దేశంతోనే జగన్ ని ఆదరించారు.. కాని ఇప్పుడు బీజేపీతో కలిసి మైనారిటీలను మోసం చేయడాన్ని గుర్తించిన మైనారిటీలు వైసీపీకి బుద్ది చెబుతారని కోట్ల అన్నారు.. అయితే ఈ పరిస్థితి కర్నూల్ లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. మైనారిటీలతో పాటు, కాంగ్రెస్ కి మొదటినుండి అండగా ఉన్న దళితులు.. అదేవిధంగా బీజేపీ వ్యతిరేకించే కార్యకర్తలు ఇలా అందరూ వైసీపీని వీడి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.. ఏపీలో తిరిగి పుంజుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ కు ఇది శుభపరిణామం అనే చెప్పాలి.