జగన్ బెయిల్ పిటిషన్ రద్దు... అసంతృప్తిలో వైసీపీ


 

 వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ జరుగుతుండగా... అటు వైసీపీ పార్టీ నేతలతో పాటు... ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా ఉత్కంఠంగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యోంలో జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలవ్వగా... దీంతో జగన్ కు బెయిలా? జైలా? అని.. ఏం తీర్పు వస్తుందా అని.. పార్టీ నేతలు అందరూ టెన్షన్ పడ్డారు. కానీ జగన్ బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలన్న సీబీఐ వాదనతో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విభేదించి బెయిల్ ను రద్దు చేయాలన్న పిటిషన్ ను కొట్టివేసింది. రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ విషయంలో జగన్ హస్తం ఉంటుందని భావించడం లేదని, ఎడిటోరియల్ బోర్డు నిర్ణయానికి, జగన్ కు సంబంధం ఉంటుందని భావించడం లేదని న్యాయస్థానం తెలిపింది.

 

ఇదిలా ఉంటే జగన్ బెయిల్ రద్దు కాకపోవడంపై వైసీపీ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయట. అదేంటీ అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా గుర్తుండే ఉంటుంది కదా. అందులో బ్రహ్మానందం.. ముందుచూపు పేరుతో ముందే వీడియోలు చేసి పెట్టుకుంటాడు. ఇక్కడ వైసీపీ పార్టీ నేతలు కూడా అలాగే చేశారంట. జగన్ కు బెయిల్ రద్దవుతుందని పార్టీ నేతలే కాదు.. జగన్ కూడా అస్సలు ఊహించలేదట. ఒకవేళ జగన్ బెయిల్ రద్దయితే దానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమంటూ ఆయనను బద్నాం చేయడానికి ముందస్తుగా కథనాలు రెడీ చేసుకున్నారట వైసీపీ పార్టీ నేతలు. ప్రత్యేక హోదాపై పోరాడుతున్న జగన్ ను ఎలాగైనా అణగద్రోక్కాలనే ఉద్దేశంతో, కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు లాలూచీ పడ్డారని, అందుకే ఉన్న పళంగా జగన్ బెయిల్ రద్దయ్యిందని ఆయనపై కథనాలు ప్రిపేర్ చేసుకున్నారట. కానీ వారు ఊహించని విధంగా పిటిషన్ కొట్టిపారేసింది కోర్టు. దీంతో సదరు కధనాలన్నీ వృధా అయిపోయాయని వైసీపీ వర్గాలు నిరాశ చెందాయట. అయితే భవిష్యత్ లో ఎప్పుడైనా అవి ఉపయోగపడొచ్చని వాటిని అలాగే ఉంచారట.