ఆమంచి ఎఫెక్ట్.. జగన్ కి షాకిస్తున్న నేత

 

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ అధినేత జగన్ ను కలిసి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆమంచి ఎఫెక్ట్ తో వైసీపీకి షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. చీరాల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త యడం బాలాజీ టీడీపీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి సమన్వయకర్తగా పని చేస్తున్న యడం బాలాజీ.. ఆమంచి రాక పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఆమంచితో వైసీపీ నాయకులు మంతనాలు జరుపుతున్నారని తెలిసిన తర్వాత నుంచే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. ఎమ్మెల్యే ఆమంచిని పార్టీలో చేర్చుకునే విషయాన్ని ముందుగా తెలిజేయకపోవడంపై బాలాజీ ఆనుచరులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గురించి ఇప్పటికే హైదరాబాదులో జగన్‌ను కలిసిన బాలాజీ ఆయన ఎదుట తన అసంతృప్తిని వెళ్లగక్కారు. చీరాలలో వైఎస్‌ విగ్రహాల ఏర్పాట్లను అడ్డుకోవడం, చివరకు మీ పర్యటనను కూడా అడ్డుకున్న ఆమంచిని మీరు స్వాగతించవచ్చేమో కానీ, తాను స్వాగతించలేనని చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు బాలాజీతో టీడీపీ నాయకులు టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. అయితే నియోజకవర్గంలో గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా తనతో ఉన్న అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఆ మేరకు బాలాజీ ఆదివారం ముఖ్య అనుచరులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అందిన సమాచారాన్ని బట్టి ఆయన అనుచరులతో కలిసి టీడీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.