వైఎస్ జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి మృతి

 

మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు, వైసీపీ అధినేత జగన్‌ బాబాయ్.. వైఎస్‌ వివేకానందరెడ్డి (68) హఠాన్మరణం చెందారు. పులివెందులలోని ఆయన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. వివేకానందరెడ్డి నిన్న కూడా కడప జిల్లా చాపాడు మండలం మద్దూరులో వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాత్రి 8.30 వరకు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆయన తనయుడు అశోక్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా పులివెందుల పయనం అయ్యారు. వేకువజామున వాంతులవ్వడంతో బాత్‌రూంలోకి వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆ సమయంలో ఇంట్లో ఆయనొక్కరే ఉన్నారు.వివేకానందరెడ్డి కడప లోక్‌సభ నుంచి రెండుసార్లు ఎంపీగా.. పులివెందుల నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించారు. 2010లో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

వైఎస్ వివేకానంద రెడ్డి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రిగా, ప్రజా ప్రతినిధిగా వివేకానందరెడ్డి అనేక మంది అభిమానం పొందారని గుర్తుచేశారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా దీర్ఘకాలం సేవలందించారని కొనియాడారు. వివేకానందరెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నట్లు తెలిపారు.