అన్నగారి ఊసులేదు..నర్సిమన్న పేరూ లేదు...

 

 

 

 

 

 

 

 

 

ఈ నెల 27 వ తేది నుండి 29 వ తేదివరకు తిరుపతిలో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలలో మన కిరణ్ కుమార్గారి ప్రభుత్వం, తెలుగుజాతి గర్వపడే ఇద్దరు మహానుభావులను రాజకీయ కారణాలతో పక్కకుబెట్టి విమర్శలు మూటగట్టుకొంటోంది. వారు స్వర్గీయ పీ.వి. నరసింహరావుగారు మరియు స్వర్గీయ నందమూరి తారకరామారావుగారు. పరిచయమే అవసరంలేని మహనీయులు వారిరువురూ.

 

తెలుగుజాతి గర్వపడే మేధావి స్వర్గీయ పీ.వి. నరసింహరావుగారయితే, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా స్వర్గీయ నందమూరి తారకరామారావుగారు నిలిచేరు. దేశం చాల క్లిష్టమయిన పరిస్థితుల్లో ఉన్నపుడు ప్రధానమంత్రిగా పగ్గాలుచేపట్టిన స్వర్గీయ పీ.వి. నరసింహరావుగారు, తన అపారమయిన తెలివి తేటలతో దేశాన్ని సురక్షితంగా ఆర్దిక సమస్యలనుండి గట్టెకించడమేగాకుండా, తన మైనార్టీ ప్రభుత్వాన్ని కడదాకా పడిపోనివ్వకుండా చాకచక్యంగా నడుపుతూ ఆర్దిక సంస్కరణలకు రూపుదిద్దారు. బహుముఖ ప్రజ్ఞాశీలి అయిన ఆయన స్వయంగా ఎన్నో రచనలు చేసారుకూడా. దాదాపు 8 బాషలపై పూర్తీ సాధికారతగల ఆయన తన గొప్పలు తానూ ఎన్నడూ చెప్పుకోనీ ఒక మౌనమునీస్వరునిగా పేరుగాంచారు. తెలుగుజాతి గర్వపడే అటువంటి పెద్దమనిషి పేరు తలుచుకోవడానికూడా నేడు కిరణ్కుమార్ ప్రభుత్వం జంకుతోంది అంటే తెలుగు ప్రజలకి అంతకంటే అవమానం ఏముంటుంది.

 

అదేవిదంగా తెలుగు బాషకి నిలువెత్తు స్వరూపంగా భాసిల్లిన స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదని అందరికి తెలుసు. తెలుగు బాషపై అపారమయిన మమకారం చూపించిన ఆయనకీ తెలుగు మహాసభలలో చోటు దొరకలేదు.

 

ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జి.ఓ.లో తెలుగుజాతికి చెందిన అనేకమంది పేర్లు ఉన్నపటికీ, వీరిద్దరి పేర్లు లేకపోవడంతో ఆగ్రహించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు దాడి వీరభద్రరావు ఆ జీ.ఓ.కాపీలను మీడియా ముందే చించి చెత్త బుట్టలో పడవేసి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఇప్పటికయినా కొంత విజ్ఞత అలవరుచుకోవాలని కోరారు.

రాజకీయాలు తెలుగుబాషని ఏవిదంగా కబలిస్తున్నాయో తెలుసుకొనేందుకు ఇదొక ఉదాహరణగా నిలుస్తుంది.