800కోట్లకు చేరువలో ప్రపంచ జనాభా.. లాక్ డౌన్ కారణంగా ఏడు లక్షల అవాంఛిత గర్భాలు

800కోట్లకు చేరువలో ప్రపంచ జనాభా..
33ఏండ్లలో మూడు వందల కోట్లు జనాభా పెరిగింది..
మానవవనరులు, ప్రకృతి వనరుల మధ్య సమతుల్యత చర్చించేందుకు వీలుగా ప్రపంచ జనాభా దినోత్సవం..
కరోనా కారణంగా 47లక్షల మంది మహిళలకు గర్భనిరోధక మాత్రలు అందుబాటులోలేవు - యుఎన్ఎఫ్ పిఎ పరిశోధన..
లాక్ డౌన్ కారణంగా ఏడు లక్షల అవాంఛిత గర్భాలు..
మహిళలకు కరువైన వైద్యసేవలు..
లైంగిక హింస, బాల్యవివాహాలు తగ్గించే లక్ష్యంగా 2020 థీమ్..

ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న జనాభా, అందుబాటులో ఉన్న ప్రకృతి వనరులు, అభివృద్ధి అంశాలను చర్చించేందుకు ప్రతిఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి  నిర్ణయించింది. 11జూలై, 1987 నాటికి ప్రపంచ జనాభా ఐదువందల కోట్లకు చేరింది. పెరుగుతున్న జనాభాను నియంత్రించే అంశాలపై చర్చించేందుకు ప్రతి ఏటా 11 జూలై ను ప్రపంచ జనాభా దినోత్సవంగా నిర్వహించాలన్న ప్రతిపాదన 1989లో వచ్చింది. అన్ని దేశాల ప్రతినిధులతో చర్చించిన తర్వాత ప్రతి ఏటా ఒక అంశంతో జనాభా దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం నిర్ణయించింది. ఈ ఏడాది లైంగిక హింస అరికట్టడం, మహిళల సంతానోత్పత్తి సమస్యలను నివారించడం, బాల్యవివాహాలు అడ్డుకోవడం అంశాలను ప్రధానంగా తీసుకున్నారు. 2020ని మహిళలు, బాలికల ఆరోగ్యం, వారి హక్కుల రక్షణ సంవత్సరంగా ప్రకటించారు.

లాక్ డౌన్ కొత్త సమస్యలను..
ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ సరికొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది.  కొన్ని దేశాల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరి కొన్ని దేశాల్లో సరైన వైద్యసదుపాయాలు, మందులు అందుబాటులో అనారోగ్య సమస్యలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.  ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై, అవాంఛిత గర్భధారణపై లాక్ డౌన్ ప్రభావం చాలా ఉందని,  47లక్షల మంది మహిళలకు  గర్భనిరోధక మాత్రలు అందుబాటులో లేకపోవడంతో అవాంఛిత గర్భం దాల్చుతున్నారని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యుఎన్ఎఫ్ పిఎ) పరిశోధనల్లో స్పష్టమైంది.  ఆరునెలల పాటు దశవారీగా లాక్ డౌన్ విధించిన కొన్ని దేశాల్లో వైద్యసేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. మరికొన్ని దేశాల్లో మహిళలు పిల్లలు కనడాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ఈ విపత్కర పరిస్థితి కారణంగా విభిన్న ప్రాంతాల్లో భిన్నమైన హెచ్చుతగ్గులు ఉంటాయని యుఎన్ఎఫ్ పిఎ పేర్కొంది. 

ప్రపంచ జనాభాలో 36శాతం రెండు దేశాల్లోనే..
ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం ప్రపంచ జనాభా  ఎనిమిది వందల కోట్లకు చేరువలో ఉంది. 2023 నాటికి 800కోట్లు దాటవచ్చని అంచనా.  అత్యధిక జనాభా కలిగిన ఆసియా ఖండంలోని రెండు దేశాలు చైనా, భారత్ లోనే ప్రపంచ జనాభాలో 36శాతం జనాభా ఉంది. అయితే కోవిడ్ 19 వైరస్ విసిరిన పంజాలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ  ప్రణాళిక లేని గర్భాల కారణంగా జననాల రేటు పెరిగే ప్రమాదం ఉందని అంచనా. కొన్ని దేశాల్లో లక్షల్లో మరణాలు సంభవించడంతో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి.

2050 నుంచీ ...
ప్రపంచ జనాభా 2050 తర్వాత  తగ్గుతుందనే అంచనాలున్నాయి. అత్యధిక జనాభా ఉన్న చైనా, భారత్ లో జననాల రేటు తగ్గుతుందని అంచనా. గతంతో పోలిస్తే ఈ తేడా స్పష్టమవుతుంది.