పుస్తకం మన ప్రియ నేస్తం

పుస్తకాలు ఎక్కువగా చదివే వాళ్ళని నమ్మకూడదు అని అన్నాడు హెన్రీ డేవిడ్ అనే ఒక రచయిత. కారణం తన ఇంటికి వచ్చిన స్నేహితుడొకరు తన దగ్గరున్న పుస్తకాన్ని చెప్పకుండా పట్టుకుపోయి, అది బాగా నచ్చటంతో తిరిగి ఇవ్వలేదట. ఆశ్చర్యపోవక్కర్లెద్దు ఇలా కూడా ఉంటారండి పుస్తక ప్రియులు.


ఒక మంచి పుస్తకం మంచి స్నేహితుడు లాంటిది అంటారు. నిజంగానే ఎంత తిరిగినా, ఎంత తిన్నా, ఎంత సేపు పడుకున్నా రాని ఆనందం ఒక మంచి పుస్తకం చదివితే వస్తుంది. ఎప్పుడైనా కాస్త చికాకుగా ఉన్నా, లేదా నిస్పృహలో పడినా పుస్తక పఠనం మనని అందులోంచి బయటకి లాగగలదు.


ఈ రోజు ప్రపంచ పుస్తక దినోత్సవం. ఎవరికి వారు ఒక మంచి పుస్తకాన్ని కొని మనకి ఇష్టమైన వాళ్ళకి కానుకగా ఇద్దాం. పుస్తకం మనిషికి అత్యంత ప్రియ నేస్తం కాబట్టి ఇందుకోసం కూడా ఒక ప్రత్యేకమైన రోజుని కేటాయించాలని నిర్ణయించుకున్న యునెస్కో 1995వ సంవత్సరంలో ఏప్రిల్ 23వ తారీఖుని ఖరారు చేసింది. అప్పటి నుంచి మనం ఈ ఇంటర్నేషనల్ బుక్ డేని జరుపుకుంటున్నాం. ఇదే రోజున సెయింట్ జార్జ్ జన్మదినాన్ని స్పెయిన్ లో జరుపుకుంటారు. ఇప్పటికీ స్పెయిన్ లో ప్రతి పుస్తక కొనుగోలు పై ఒక గులాబీని గిఫ్ట్ గా ఇస్తారు తెలుసా.


ఈ బుక్ రీడింగ్ అలవాటు మనలో సృజనాత్మకతని పెంచుతుంది. మన ఆలోచనా విధానాన్ని కూడా మార్చుతుందనటంలో సందేహమే లేదు. అందుకే పుస్తకం చదివే అలవాటు లేకపోతే వెంటనే అలవాటు చేసుకుంటే చాలా ఉపయోగాలే ఉన్నాయండోయ్. ఒక పుస్తకం మన చిన్నప్పుడు చదివితే మనకు వచ్చే అనుభూతికి, అదే పుస్తకాన్ని కాస్త వయసులోకి వచ్చాకా చదివితే వచ్చే అనుభూతికి మద్య చాలా తేడా ఉంటుంది. కావాలంటే టెస్ట్ చేసి చూసుకోండి.


రిటైరయిపోయి ఖాళీగా ఉన్న వాళ్ళు చేసే పని ఈ బుక్ రీడింగ్ అనుకుంటే పొరపాటే. అసలు వాళ్ళకన్నా జీవితాన్ని మొదలుపెట్టటానికి ప్రపంచంలోకి అడుగుపెట్టేవారికే  ఇది చాలా అవసరం. ఎందుకంటే పుస్తకాలు చదవటం వల్ల కొత్త విషయాల సేకరణ జరుగుతుంది. ఒక పుస్తకం చదివాకా అందులో ఉన్న విషయాన్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉండటం వల్ల మన జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. మనం ఏదన్నా రాయాలన్నా బుక్ రీడింగ్ వల్ల మనం అలవర్చుకున్న పరిజ్ఞానం రాయటంలో  ప్రదర్శించచ్చు.


ఈ పుస్తక పఠనం వల్ల అన్ని రకాల పుస్తకాలు చదవటం అలవాటయ్యి, ఏదైనా సమస్య ఎదురైనపుడు ఎలా దాన్ని హేండిల్ చెయ్యాలో కూడా మనకి చాలా సులువుగా తెలిసిపోతుంది. ముఖ్యంగా మన ఏకాగ్రత పెరుగుతుంది. కుదురుగా ఒక దగ్గర కూర్చునే అలవాటు లేని వాళ్ళు సైతం బుక్ రీడింగ్ హేబిట్ వల్ల దాన్ని అలవాటు చేసుకుంటారు.


నలుగురిలో కలిసే అలవాటు లేనివాళ్ళు చాలా మటుకు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు పుస్తకం చదివే అలవాటు చేసుకుంటే ఇక ఎప్పటికి ఒంటరితనం ఫీల్ అవ్వరు. మొత్తానికి ఒక మంచి పుస్తకం అన్ని వయసుల వారిని అలరిస్తుంది. అందుకే మన లైఫ్ లో మనం ఎంత బిజీ అయిపోయినా మనకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకుని పుస్తకం చదవటంలో ఉండే ఆనందాన్ని అనుభవిద్దాం.

...కళ్యాణి