ప‌టిష్టమవుతున్న భార‌త ఆర్థిక వ్యవ‌స్థ..!

ఇది శుభ సూచ‌క‌మే. ఇది ఆనందించే అంశ‌మే. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఆర్థికంగా ఎంతో వెనుక‌బ‌డి ఉన్నామ‌నుకునే భార‌త్ కు ఆర్థిక రంగంలోప్రపంచ‌ బ్యాంక్ ఇచ్చిన రేటింగ్ కొత్త ఆశ‌లు చిగురింప‌జేస్తోంది. ప్రపంచ బ్యాంక్ తాజాగా విడుద‌ల చేసిన లెక్కల ప్రకారం ఫ్రాన్స్ దేశాన్ని వెన‌క్కు నెట్టి భార‌తదేశం ఆర్థికంగా ఎంతో ముందుకు వెళ్తోంది. జ‌నాభా ప్రకారం చూసుకున్నా భార‌తదేశం ఫ్రాన్స్ కంటే చాలా పెద్దది. అయినా ఆ దేశాన్ని వెన‌క్కి నెట్టి ఆర్థికంగా దేశం పురోగ‌తి సాధించ‌డం మంచి ప‌రిణామ‌మే. ఇన్నాళ్లూ ఆర్థిక ప్రగ‌తిలో ఫ్రాన్స్ 2.597 ల‌క్షల కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా ఆరో స్థానంలో ఉంది.

 

 

ప్రపంచ బ్యాంక్ కొత్త లెక్కల ప్రకారం ఫ్రాన్స్ ఆ స్ధానాన్ని కోల్పోయింది. ఆ స్థానంలోకి భార‌త్ చేరుకుంది. ఇది మంచి ప‌రిణామ‌మే. దీనికి కార‌ణం భార‌త్‌లో వ‌స్తు త‌యారీ పెర‌గడం.. దాని వినిమ‌యం కూడా అధిక స్ధాయిలో ఉండ‌డ‌మే అని ప్రపంచ‌బ్యాంక్ తేల్చింది. దీని కార‌ణంగా భార‌త ఆర్థిక వ్యవ‌స్థ పుంజుకుంది అన్నది ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ర్యాంకింగ్‌కి కార‌ణంగా చెబుతున్నారు. ఇది దేశ ప్రజ‌ల‌కు శుభ వార్తే అయినా... ఇక్కడి ఆర్థిక ప‌రిణామాలు మాత్రం మ‌ధ్యత‌ర‌గ‌తి, సామాన్యుల‌ను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. దేశంలో నోట్ల ర‌ద్దు కుదిపిన కుదుపున‌కు ఇంకా ఎవ‌రూ తేరుకోలేదు. ఏటిఎం సెంట‌ర్ల ముందు ప్రజ‌లు ఇంకా బారులు తీరి నిలుచున్న చిత్రాలు పాల‌కుల‌ను వెక్కిరిస్తున్నాయి. కేంద్రం తీసుకువ‌చ్చిన జి.ఎస్‌.టి కూడా ప్రజ‌ల న‌డ్డివిరుస్తోంది. ఏది అస‌లు ధ‌రో.... ఏదీ జిఎస్టీనో తెలియ‌క స‌గ‌టు భార‌త పౌరుడు నానా హైరానా ప‌డుతున్నాడు. నిత్యావ‌స‌రాలు ధ‌ర‌లు కొండ‌నెక్కాయి. వంటింట్లో ఆడ‌వారు పాల‌కుల‌పై శివ‌తాండ‌వం చేస్తున్నారు. పెట్రోలు ధ‌ర‌లు నిమిష నిమిషానికి కాదు... క్షణ‌క్షణానికి మారుతున్నాయి. వంట గ్యాస్ ధ‌ర‌లు వెక్కిరిస్తున్నాయి. కూర‌గాయ‌లు కొనాలంటే సామాన్యులను చుక్కలు వెక్కిరిస్తున్నాయి. 

 

 

దేశంలో అంత‌ర్గతంగా ఇలాంటి ప‌రిస్థితులుంటే దేశం వెలుప‌ల మాత్రం భార‌త్ ప్రభ వెలిగిపోతోంది. అంటే దేశాన్ని, దేశ ప్రజ‌ల‌ను ఓ భ్రమ‌లో ఉంచి త‌మ ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని ప్రపంచంలో ఆర్థికంగా బ‌లంగా ఉన్న అమెరికా వంటి దేశాలు త‌ల‌పోస్తున్నాయ‌ని భావించాలా...? దేశంలో ఆర్ధిక ఇబ్బందులు అతలాకుతలం చేస్తూంటే ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు ర్యాంకింగ్‌లు ఇవ్వడం పట్ల ఆర్థికవేత్తలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఏ రంగాన్ని చూసినా ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. వ్యవసాయం కుంటుపడింది.

 

 

పారిశ్రామిక రంగం కుదేలవుతోంది. నిరుద్యోగులు పెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా ఓ ఆర్థిక అనిశ్చితి కనపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ర్యాంకింగ్‌ భారత్‌ను ఏ తీరాలకు తీసుకువెళ్తుందో చూడాలి. అయినా భారత ప్రజలు ఆశావాహులు. ఉందిలే మంచి కాలం ముందు ముందునా... అనుకుని కాలం వెళ్లదీసేవారు. ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన తాజా ర్యాంకుల్లో నిజమున్నా... కుట్రలు ఉన్నా.... భారత ప్రజలు మాత్రం అన్నింటినీ దిగమింగి ఆర్థికంగా... సామాజికంగా ముందుకు వెళ్తారు. ఎందుకంటే... మేరా భారత్
మహాన్...