జగన్ కి షాకిచ్చిన వరల్డ్ బ్యాంక్...వేలితో కన్ను పొడుచుకున్నట్టయ్యింది !

 

అనుకున్నదే అయ్యింది, గతంలో మేము ప్రస్తావించినట్టే అమరావతి నిర్మాణం మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏపీ నూతన ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంక్ పెద్ద షాకే ఇచ్చింది. నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్ట్ విషయంలో చేతులెత్తేసింది. రాజధాని నిర్మాణానికి రుణం కోసం ప్రభుత్వం దరఖాస్తు చేసుకోగా అలాంటిది ఏదీ ఇవ్వమని చెబుతూ రుణ సహాయాన్ని నిలిపివేసింది. ఏపీ ప్రభుత్వం 300 మిలియన్‌ డాలర్ల రుణ సాయాన్ని ప్రపంచ బ్యాంక్ ని కోరగా దాని నుంచి తప్పుకుంటున్నట్లు ప్రపంచ బ్యాంక్ తెలిపింది. 

ఈ మేరకు బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని పొందుపరిచారు. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రపంచబ్యాంకు ఈ నిర్ణయం తీసుకోవడం సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజా నిర్ణయంతో అమరావతి రాజధాని నిర్మాణం నుంచి ప్రపంచబ్యాంకు తప్పుకున్నట్టయింది. గత ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణం మీద ఇప్పటి ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలోప్ ఉండి సంచలన ఆరోపణలు చేసింది. 

అయితే అప్పుడు ప్రపంచబ్యాంకు బృందం అమరావతిని సందర్శించి పూర్తిస్థాయిలో సంతృప్తి చెందడమే కాకుండా మరింతగా ఆర్థికంగా సహాయపడాలని నిర్ణయించింది. ప్రపంచ బ్యాంక్ నుండి అమరావతి నిర్మాణం రూపేణా రుణం కోసం చంద్రబాబు ప్రభుత్వం 2016 నుంచి ప్రయత్నాలు చేస్తోంది. ప్రయత్నాల్లో భాగంగా రాజధాని నిర్మాణానికి అమరావతి అభివృద్ధి కోసం రూ.7200కోట్ల రుణానికి ప్రతిపాదనలు ప్రపంచ బ్యాంకుకి సీఆర్డీయే పంపింది. దీనిలో భాగంగా తొలివిడతగా 3200కోట్లు, రెండో విడతగా మరో 3200కోట్లు తీసుకునేలా ఒప్పందం కుదిరింది. 

కానీ అప్పుడే అప్పటి ప్రతిపక్షంలో జగన్ పార్టీ నుండి కొందరు రాజ‌ధాని విష‌యంలో కోర్టుల‌కు, గ్రీన్ ట్రిబ్యూన‌ల్ కి కూడా ఫిర్యాదులు చేశారు. వ‌ర‌ద‌ముప్పు, వివిధ పంట‌లు పండించే ప్రాంతం, సామాజిక‌, ప‌ర్యావ‌ర‌ణ కోణంలో జ‌రిగేన‌ష్టం వంటి అంశాల‌ను ముందుకు తీసుకొచ్చారు. అక్కడితో ఆగక ప్ర‌భుత్వం రాజ‌ధాని విష‌యంలో ప్ర‌జాభిప్రాయానికి భిన్నంగా వెళుతుందంటూ రాజ‌ధాని ప్రాంత రైతుల పేరిట కొంద‌రు 2017 మే 25 నాడు ప్ర‌పంచ‌బ్యాంక్ కి ఈమెయిల్స్ పంపి ఫిర్యాదు చేశారు. 

ప్ర‌పంచ‌బ్యాంక్ ప్ర‌తినిధి బృందం స్వ‌యంగా వ‌చ్చి ప‌రిశీల‌న చేయాల‌ని కోరారు. అదే సంవ‌త్స‌రం జూన్ 12నాడు ఫిర్యాదుని స్వీక‌రించిన ప్ర‌పంచ‌బ్యాంక్ బృందం 2017 సెప్టెంబ‌ర్ లో ఇండియాలో ప‌ర్య‌టించింది. ఆ స‌మ‌యంలో ల్యాండ్ ఫూలింగ్ విధానంపై అభ్యంత‌రాల‌తో పాటు స‌మ‌ర్థిస్తున్న రైతులు కూడా ప్ర‌పంచ‌బ్యాంక్ పానెల్ బృందాన్నిక‌లిశారు. ఏపీ ప్ర‌భుత్వ అధికారులు కూడా ప్రపంచ‌బ్యాంక్ బృందం ముందు త‌మ వాద‌న‌ వినిపించారు. 

అయితే అమరావతి వచ్చి స‌మ‌గ్ర విచార‌ణ చేయడం అవ‌స‌రమని ప్ర‌పంచ‌బ్యాంక్ బృందం తేల్చింది. అప్పుడు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు అమరావతి వచ్చి అంతా గమనించి క్లియరెన్స్ ఇచ్చారు. కానీ నిధులు కావాలంటే మరొమారు తనిఖీలు నిర్వహించాల్సిందేనని తేల్చిన ప్రపంచబ్యాంక్ తమ అభిప్రాయాన్ని ఈ నెల 23వ తేదీలోపుగా చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి బ్యాంక్ ఇన్స్‌పెక్షన్ ప్యానెల్ తనిఖీలు చేయాలని స్పష్టం చేసిన నేపధ్యంలో ఈ మేరకు కేంద్రం నుండి రాష్ట్రానికి వరల్డ్ బ్యాంకు నుండి సమాచారం అందింది. 

అయితే ఈ విషయమై తమకు మరింత గడువు కావాలని కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపింది కానీ ఆ లేఖకు ప్రపంచ బ్యాంకు స్పందించలేదు. కానీ కేంద్రం ఈ వ్యవహారంలో తమ నిర్ణయాన్ని రాష్ట్రానికి చెప్పేసింది .ప్రపంచబ్యాంక్ ఇన్స్‌పెక్షన్ ప్యానెల్ తనిఖీలు చేయడం అనేది కొత్త సంప్రదాయమని, అది ఇక్కడ చేయనిస్తే  దేశంలో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న అన్ని ప్రాజెక్టులకు కూడా తనిఖీలు చెయ్యాలని చూస్తారని ఇది ఇబ్బందిగా మారే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. 

ఈ తరుణంలో అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులను తీసుకెళ్లే ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్రం రాష్ట్రానికి సూచించినట్టుగా తెలుస్తోంది. ఇతర మార్గాల ద్వారా రాజధాని నిర్మాణానికి నిధులను సమీకరించాలని కేంద్రం సూచించినట్టుగా చెబుతున్నారు. కానీ ప్రపంచ బ్యాంకు నుండి నిధుల సేకరణ ఆలోచన విరమించుకోవాలని తెలిపింది. ఆ విధంగా చివ‌ర‌కు తాజాగా ప్రాజెక్ట్ నుంచి వైదొలుగుతున్న‌ట్టు ప్ర‌పంచ‌బ్యాంక్ తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం. 

ఇప్పుడు ప్రపంచబ్యాంకు నిర్ణయం నేపథ్యంలో ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్ (ఏడీబీ) రుణాల మీద కూడా అనుమానలు ఏర్పడ్డాయి. అమరావతి నిర్మాణం కోసం ఏడీబీ రూ.1400 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఇప్పుడు ప్రపంచబ్యాంకు ఈ నిర్ణయం తీసుకోవడంతో ఏడీబీ కూడా అదే బాటలో పయనిస్తే జగన్ ఏమి చేస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే అప్పటి బాబు సర్కార్ ని ఇబ్బంది పెట్టాలని జగన్ పార్టీ చేసిన ఈమెయిల్స్ ఫిర్యాదులు ఇప్పుడు తమ ప్రభుత్వానికి పెను పరీక్షను తెచ్చిపెట్టాయి.