టీడీపీతో పొత్తు కుదుర్చు రామా!

 

 

 

రాష్ట్ర బీజేపీ నాయకులు తమ పార్టీ దైవమైన రాముణ్ణి ఇప్పుడు ఒకే ఒక కోరిక కోరుకుంటున్నారు. అదేమిటంటే.. సాధ్యమైనంత త్వరగా తెలుగుదేశం పార్టీతో తమకి పొత్తు కుదరాలి. ఇటు తెలంగాణలో, అటు సీమాంధ్రలో ఎదుర్కొంటున్న కష్టాల నుంచి గట్టెక్కాలి. అదేంటీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలుగుదేశం పార్టీతో పొత్తు వుండదని నొక్కి వక్కాణిస్తున్నారు కదా అనే సందేహం వస్తోంది కదూ? అది మేకపోతు గాంభీర్యమే! ఎక్కువగా బెట్టు చేసి పొత్తులో ఎక్కువ లాభం పొందే ప్లానే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

 

రాష్ట్ర బీజేపీకి ఎప్పుడూ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తే అధ్యక్ష పదవిని అలంకరిస్తూ వుంటాడు. వాళ్ళు మొదటి నుంచీ తెలంగాణ ఉద్యమాన్ని ఎగదోయడానికి తమవంతు కృషి చేశారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో తెలంగాణలో పాగా వేయొచ్చని కేంద్ర నాయకత్వాన్ని నమ్మించారు. అయితే అవన్నీ భ్రమలేనని తాజాగా తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వబోతున్నట్టు ప్రకటించాక పరిస్థితులను బేరీజు వేసుకుంటే ఇటు తెలంగాణలో అటు సీమాంధ్రలో బావుకునేదేమీ లేదని బీజేపీకి అర్థమైంది. తెలంగాణని నమ్ముకుని సీమాంధ్రలో బిచాణా ఎత్తేసే పరిస్థితిని తెచ్చుకోవడం పట్ల ఇప్పుడు తీరిగ్గా విచారిస్తోంది.



ప్రస్తుతం సీమాంధ్రలో బీజేపీ కార్యాలయాల తలుపులు తీసి కూర్చునే పరిస్థితులు కూడా బీజేపీ కార్యక్తలకి కనిపించడం లేదు. దాంతో బీజేపీ అగ్ర నాయకత్వం టీడీపీతో పొత్తు పెట్టుకోవడం మినహా తమకు వేరే గత్యంతరం లేదన్న విషయాన్ని అర్థం చేసుకుంది. అయితే టీడీపీతో పొత్తును రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఇంతకాలం కిషన్ రెడ్డి లాంటి తెలంగాణ నాయకులు చెప్పిన మాటల్లా విన్న కేంద్ర నాయకత్వం ఇప్పుడు మీరు కాస్త తగ్గండమ్మా అని అంటోంది. మీ మాటలు విని రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని అస్తవ్యస్తం చేసుకున్నామని చెబుతోంది.




తెలంగాణ ఉద్యమం విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం అత్యుత్సాహాన్ని ప్రదర్శించిందన్న అభిప్రాయానికి బీజేపీ కేంద్ర నాయకత్వం వచ్చినట్టు తెలుస్తోంది. ఇకముందు తెలంగాణ విషయంలో దూకుడును కంట్రోల్ చేయాలని యోచిస్తోంది. దీనిలో భాగంగానే రాష్ట్ర విభజన మీద మంత్రుల బృందానికి నివేదిక ఇచ్చే విషయంలో జాప్యాన్ని పాటిస్తోంది. గతంలో మాదిరిగా పూర్తిగా తెలంగాణ పక్షం వహించకూడదని భావిస్తోంది. రాబోయే ఎన్నికలలో ఇటు తెలంగాణలో, అటు సీమాంధ్రలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారానే జరిగిన నష్టాన్ని పూడ్చుకోగలమని బీజేపీ అగ్రనాయకత్వం అనుకుంటోంది. ఆ రాముడి మీద భారం వేసి చంద్రబాబుతో సంప్రదింపులు జరిపే ప్రయత్నాలు మొదలు పెట్టింది.