సానుభూతి వ్యూహాన్ని సానబెడుతున్న జగన్!

రాజకీయాల్లో బాగా రాటుదేలిన నేతలు రెండు వ్యూహాలు అమలు చేస్తుంటారు! ప్లాన్ A… ఇది ఏంటంటే… తమ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఎదురు దాడి చేయటం! ఇక ప్లాన్ B… దీంట్లో భాగంగా తమ మీద వచ్చిన ఆరోపణ గురించి అస్సలు మాట్లాడరు! కాకపోతే, మరో దారిలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న తామే బాధితులమని ప్రచారం చేసుకుంటారు. తమకు ఓటు వేసే ఆలోచనలో వున్నవార్ని మరింతగా ఒడిసి పట్టుకునేలా సానుభూతి సంపాదించుకుంటూ వుంటారు! ఇదంతా చెప్పుకోటానికి కారణం… జగన్!

 

 

జగన్ ఏనాటికైనా ఏపీ ముఖ్యమంత్రి అవ్వొచ్చు. కానీ, అదెప్పుడో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అందుక్కారణం ఆయన మీద వున్న తీవ్రమైన ఆర్దిక అభియోగాలే! ఏ క్షణాన జైలుకి వెళతారో తెలియని పరిస్థితి. మరోవైపు ఏ జిల్లాలో ఎన్ని వందల కిలో మీటర్ల దూరంలో పాదయాత్రలో వున్నా ఆయన ప్రతీ శుక్రవారం కోర్టుకు వచ్చి వెళుతుంటారు. ఇలాంటి సంకట స్థితి మరే రాజకీయ నేతకు ప్రస్తుతం లేదు. మరీ ముఖ్యంగా, ఒక రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత ప్రతీ వారం కోర్టుకు హాజరు కావటం కూడా దేశంలో ఎక్కడా లేదు. మరి ఇలాంటి జగన్ని ఓటర్లు ఎందుకు నమ్మాలి? దీని వల్లే ఆయనను అభిమానించే వాళ్లు ఎంతగా ఓట్లు వేసినా చంద్రబాబు సీఎం అయ్యారు గత ఎన్నికల్లో! అవినీతిని, అనుభవాన్ని రెండిట్నీ దృష్టిలో పెట్టుకునే ఓటర్లు జగన్ ను ప్రతిపక్షానికి పరిమితం చేశారు!

 

 

2014 పోతే పోయింది 2019 నాదే అనుకుంటున్న జగన్ వీలు చిక్కినప్పుడల్లా ప్లాన్ బీ అమలు చేస్తున్నారు. అంటే… సానుభూతి ఫార్ములా అన్నమాట! తండ్రి వైఎస్ మరణించాక నెలలు,సంవత్సరాల తరబడి ఓదార్పు యాత్ర చేసిన జగన్ ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు. అంతలోనే ఈడీ ఆయనకు షాకిస్తూ భార్య భారతీ పేరును కూడా ఛార్జ్ షీట్ లో దాఖలు చేసింది! అదే విషయం మీడియాలో వచ్చింది. వెంటనే జగన్ అసలు పక్కన పెట్టి కొసరు మీద దృష్టి పెట్టారు. భారతి పేరు కూడా ఛార్జ్ షిట్ లో ఎందుకు చేరింది? ఆమెకు జగన్ అవినీతితో సంబంధం వుందా? అసలు తన భార్య పేరు ఛార్జ్ షిట్లో వుందనే వార్త నిజం కాదా? మీడియా చెప్పిందంతా అబద్ధమేనా? … ఇలాంటి విషయాలేవీ వైసీపీ అధినేత మాట్లాడలేదు. తెలివిగా ‘’నా భార్యని కూడా టార్గెట్ చేశారు’’ అంటూ సింపతీ యాంగిల్ తీసుకొచ్చారు!

 

 

కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిల్లు చేసుకున్నాడు అంటూ స్వయంగా జగనే వ్యక్తిగత విమర్శలు చేశారు! ఇప్పుడు మాత్రం మీడియా తన భార్యని అనవసరంగా వివాదంలోకి లాగుతోందని బాధపడిపోయారు! వ్యక్తిగత దాడి తాము చేస్తే ఒక న్యాయం... ఎదుటి వారు చేస్తే మరో తర్కం! ఇదీ వరస! అసలింతకీ మీడియా చెప్పింది కరెక్టా? తప్పా? జగన్ ఎదుర్కొంటోన్న అవినీతి ఆరోపణల్లో భారతికి ప్రమేయం వుందని ఈడీ భావిస్తోందా? లేదా? వీటికి జగన్ వద్ద సమాధానం లేదు! ఆయన చెప్పుకొచ్చే ఏకైక పాయింట్… ‘’ నా భార్య పేరు ఛార్జిషీట్లో వుందని మీడియాకు ఎలా తెలిసింది? ‘’ ఇదొక్కటే!

 

 

జగన్ తన భార్య గురించి వస్తోన్న వార్తల్ని ఖండించకుండా కేవలం మీడియాను అనుమానించటం, అలాగే, తన కుటుంబాన్ని రోడ్డుకీడుస్తున్నారని వాపోవటం చూస్తుంటే… సానుభూతి కోణం తప్ప మరేదీ కనిపించటం లేదు. అయితే, జగన్ అమలు చేసిన ప్లాన్ బీ ఎంత వరకూ రిజల్ట్స్ ఇస్తుంది? ఎన్నికలు వస్తేగానీ తెలియదు. గతంలో వైఎస్ మరణించిన అనంతరం వెల్లువెత్తిన సానుభూతి తనని సీఎం చేస్తుందని జగన్ బలంగానే భావించారు. కానీ, అలా జరగలేదు. మరి ఇప్పుడు ఏమవుతుందో…