మంగళగిరిలో లోకేష్ గెలుపు ఖాయం.. కానీ టీడీపీ?

 

ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఏపీలో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో చెప్పేశాయి. మెజారిటీ సంస్థలు ఏపీలో వైసీపీనే అధికారంలోకి వచ్చే అవకాశముందని అంచనా వేసాయి. రాజకీయ విశ్లేషకులు కూడా ముందు నుంచి వైసీపీనే గెలిచే అవకాశముందని అభిప్రాయపడ్డారు. అయితే ఏపీలో ఈసారి కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములపై హాట్ హాట్ చర్చలు, విశ్లేషణలు జరిగాయి. ప్రధానంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం గురించి ఎక్కువగా చర్చలు జరిగాయి. ఎందుకంటే ఇక్కడ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఎన్నికల బరిలోకి దిగారు. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన లోకేష్ పోటీ చేసేందుకు మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఇక్కడ జోరుగా ప్రచారం కూడా నిర్వహించారు. అయితే మంగళగిరిలో లోకేష్ గెలిచే అవకాశంలేదని పలువురు అభిప్రాయపడ్డారు. కానీ తాజాగా ఎగ్జిట్ పోల్స్ మాత్రం మంగళగిరిలో నారా లోకేష్ గెలుపు ఖాయమని చెబుతున్నాయి. ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ చేయించిన సర్వేలో కూడా మంగళగిరిలో టీడీపీయే గెలుస్తుందని అంచనా వేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాను బట్టి చూస్తే మంగళగిరిలో లోకేష్ గెలుస్తారు కానీ.. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం కష్టమే అనిపిస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.