మీరు ప్రేమించిన అమ్మాయిని కిడ్నాప్ చేస్తా: బీజేపీ ఎమ్మెల్యే

 

ఎమ్మెల్యే అంటే నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తా, ప్రజలకు సాయం చేస్తా, ప్రేమ వివాహం జరిపిస్తా ఇలాంటివి చెప్పాలి కానీ వెరైటీగా మీరు ప్రేమించిన అమ్మాయిని కిడ్నాప్ చేస్తా అనటం ఏంటి అనుకుంటున్నారా?.. ఆ ఎమ్మెల్యే అంతేలేండి.. ఆయనో రకం.. ఇంతకీ ఆ మాట అన్నది ఎవరంటే మహారాష్ట్రలోని ఓ బీజేపీ ఎమ్మెల్యే.. ఆయన పేరు రామ్‌ కదామ్‌.. ముంబై శివార్లలోని ఘట్‌కోపర్‌ నియోజకవర్గంలో నిర్వహించిన కృష్ణాష్టమి కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్‌ కదామ్‌ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా యువతతో ముచ్చటిస్తూ.. వారికేమి కావాలో కోరుకోమని అడగ్గా, ప్రేమించిన అమ్మాయిలు కాదంటున్నారని యువత తెలిపారు.. అందుకు రామ్‌ కదామ్‌ ఇచ్చిన సలహా ఏంటో తెలుసా?.. ‘మీ తల్లిదండ్రులతో నాకు చెప్పించండి.. ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే.. కిడ్నాప్‌ చేయించి మరీ తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను’ అని అన్నారు.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఇంకేముంది అమ్మాయి అంగీకారంతో సంబంధం లేదా? ప్రజాప్రతినిధిగా ఉంటూ అలా ఎలా మాట్లాడుతారు? అంటూ ఎమ్మెల్యే మీద విమర్శలు వెల్లువెత్తాయి..దీంతో ఆ ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పారు.