ప్రజల్లోకి పవన్... ఇక జగన్ పై యుద్ధమేనంటోన్న జనసేనాని

జగన్ ప్రభుత్వానికి పవన్ ఇచ్చిన వంద రోజుల గడువు పూర్తవడంతో జనసేనాని ప్రజాక్షేత్రంలోకి దూకారు. వైసీపీ సర్కారుకు వంద రోజుల టైమిస్తామని, అప్పటివరకు ఎలాంటి విమర్శలు చేయబోమన్న పవన్ కల్యాణ్... జగన్ వంద రోజుల పాలనపై విశ్లేషణలు చేసుకుని, ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఇప్పటికే రాజధాని వివాదం, ఇసుక సమస్యపై స్పందించిన జనసేనాని... జగన్ సర్కారు ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అమరావతిలో మకాం చేసిన పవన్ కల్యాణ్ ... నియోజకవర్గాల వారీగా సమస్యలపై సమీక్షలు నిర్వహించి, వాటిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని డైసైడయ్యారు.

ప్రెస్ మీట్లు, ట్వీట్లను వీలైనంత దూరంపెట్టి, ఎక్కువగా ప్రజల్లోనే గడపాలని పవన్ నిర్ణయించుకున్నారట. అందుకే, 175 నియోజకవర్గాల నుంచి నేతలను పిలుపించుకుని, ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. తమతమ నియోజకవర్గాల్లో సమస్యలేంటి? ఆయా జిల్లాలు, ప్రాంతాల వారీగా జగన్ ఇచ్చిన వాగ్ధాలేంటి? ఏ హామీలు అమలయ్యాయి... ఏమేమీ నెరవేరలేదు... ఇలా ప్రతి దాన్నీ నోట్ చేసుకుని అంశాల వారీగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు జనసేనాని యాక్షన్ ప్లాన్ సిద్ధంచేసుకుంటున్నారు.

ఇదిలాఉంటే, ఎన్నికల్లో ఘోర ఓటమితో డీలాపడ్డ జనసైనికులను ఉత్తేజపర్చడానికి జిల్లాల పర్యటనకు పవన్ సిద్ధమవుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉండటం ద్వారా అటు పార్టీని బలోపేతం చేయడమే కాకుండా, మరోవైపు కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపినట్లు ఉంటుందని కల్యాణ్ భావిస్తున్నారు. అందుకే అక్టోబర్ నుంచే అస్త్రశస్త్రాలతో జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి రెడీ అవుతున్నారు జనసేనాని.