చంద్రబాబు, పవన్ ల మధ్య కుదిరిన డీల్.. జనసేనకు 25 సీట్లు!!

 

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష వైసీపీ, అధికార పార్టీ టీడీపీని ఇబ్బంది పెట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది. పోలీసుశాఖ పదోన్నతులు, చింతమనేని వీడియో, రైతు కోటయ్య మృతి.. కాదేదీ టీడీపీని విమర్శించడానికనర్హం అంటూ కొత్త కొత్త టాపిక్స్ తో టీడీపీ మీద ఆరోపణలు, విమర్శలు చేస్తుంది. తాజాగా వైసీపీ పరోక్షంగా మరో టాపిక్ తో టీడీపీని టార్గెట్ చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల మధ్య డీల్ కుదిరింది అంటూ  జగన్ కి సంబంధించిన పత్రికలో ఓ ఆర్టికల్ ప్రచురితమైంది.

ముసుగులో స‌ర్దుబాటు అంటూ ఒక క‌థ‌నం ప్ర‌చురించారు. దాని సారాంశం ఏంటంటే.. సీఎం చంద్ర‌బాబు, ప‌వ‌న్ కళ్యాణ్ ల మ‌ధ్య ర‌హస్య ఒప్పందం కుదిరిపోయింద‌ట‌, సీట్ల స‌ర్దుబాటు కూడా జ‌రిగిపోయిందట‌! అంతేకాదు.. ఈ మ‌ధ్య చంద్ర‌బాబు, ప‌వ‌న్ లు ఓ ర‌హ‌స్య స్థ‌లంలో భేటీ అయ్యార‌నీ, పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌ ఈ భేటీకి ఏర్పాట్లు చేశారంటూ రాశారు. ఈ భేటీలో సీట్ల సర్దుబాటు, ఎన్నికలకు ఎలా వెళ్ళాలి వంటి అంశాలు చర్చించారట. జనసేనకు 25 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు ఇచ్చేలా డీల్ కుదిరిందట. అంతేనా ‘ఇన్నాళ్లూ తిట్టుకొని ప్రజల ముందుకు వెళ్లాం. ఇప్పుడు జనం  ముందుకు ఏ ముఖం పెట్టుకొని వెళ్లగలుగుతాం? ఇప్పటికిప్పుడు కలసి పోటీ చేస్తామంటే ప్రజలు అంగీకరించే పరిస్థితి ఉండదు. ఏం చెప్పి నమ్మించగలం?’ అని ప్రధానంగా చర్చించారంటూ రాసుకొచ్చారు. మొత్తానికి 2014 లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్.. తరువాత టీడీపీకి దూరమై విమర్శలు చేసారు. ఈమధ్య చంద్రబాబుతో మళ్ళీ డీల్ కుదరడంతో విమర్శలు తగ్గించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తారు అని ఆ క‌థ‌నం సారాంశం. మరి పవన్ కళ్యాణ్ ఏమో ఎవరితో పొత్తులుండవు.. వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో మాత్రమే కలిసి పనిచేస్తాం అన్నారు. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం కమిటీ ఏర్పాటు చేసి దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు. మరోవైపు ఆయన సోదరుడు నాగబాబు యూట్యూబ్ లో చంద్రబాబుని టార్గెట్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ పత్రికలో వచ్చిన కథనం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.