బాబు పిరికివాడిలా పారిపోతాడా? లేక పోరాడతాడా?

 

ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా 'ప్రజావేదిక' గురించే చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా, మీడియా అన్న తేడా లేకుండా ఎక్కడైనా ప్రస్తుతం ప్రజావేదికే హాట్ టాపిక్ అయింది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రజావేదిక అక్రమ కట్టడమని భావించిన సీఎం జగన్.. ఆ భవనాన్ని కూల్చి వేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ప్రజావేదిక నేలమట్టమైంది. ప్రజావేదిక అక్రమ కట్టడమని, రేకుల షెడ్డు కోసం రూ.9 కోట్లు ఖర్చు చేసి.. టీడీపీ అవినీతికి పాల్పడిందని వైసీపీ విమర్శలు చేస్తోంది. అయితే వైసీపీ ఆరోపిస్తున్నట్లు అది రేకుల షెడ్డో, కోళ్ల‌ఫారమో కాదని.. ప్రీ ఇంజనీరింగ్ బిల్డింగ్ సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వాడి ఆ నిర్మాణం చేసారని తెలుస్తోంది. దీనికో ప్ర‌త్యేక‌త కూడా ఉందట. జాగ్ర‌త్త‌గా నిపుణులు ఈ నిర్మాణాన్ని డిస్‌మేంట‌ల్ చేస్తే.. ఇందులో 80 శాతం మెటీరియ‌ల్‌తో మ‌ళ్లీ ఇలాంటి నిర్మాణం ఇంకోటి చేయొచ్చట. కానీ జగన్ సర్కార్ ముందు వెనుక ఆలోచించకుండా జేసీబీలతో కూల్చేసి నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియ‌ల్‌ ని వృధా చేసిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

అంతేకాదు.. వైసీపీ ఆరోపిస్తున్నట్లు ప్రజావేదిక నిర్మాణానికి రూ.9 కోట్లు ఖర్చు కాలేదట. ప్రజావేదిక నిర్మాణం కోసం ఆర్‌ అండ్‌ బి శాఖ 4.4.2017న జీఓ నెం.ఆర్‌.టి.104ను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రజావేదిక నిర్మాణం కోసం రూ.90లక్షలు, పార్కింగ్‌ కోసం రూ.47లక్షలు, మట్టి చదును కోసం రూ.32లక్షలు, ప్రహారిగోడ కోసం రూ.14లక్షలు, సెక్యూరిటీ పోస్టు కోసం రూ.8లక్షలను విడుదల చేసింది. ప్రజావేదిక నిర్మాణం, ఇతర సదుపాయాల కల్పన కోసం అప్పటి ప్రభుత్వం వెచ్చించిన మొత్తం రూ.కోటి 91లక్షలు. కానీ వైసీపీ శ్రేణులు మాత్రం రేకుల షెడ్డు కోసం టీడీపీ రూ.9 కోట్లు ఖర్చు చేసి అవినీతికి పాల్పడిందని సోషల్ మీడియాలో ప్రచారం చేసాయి. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో టీడీపీ శ్రేణులు విఫలమయ్యాయనే చెప్పాలి. టీడీపీ నేతలు కూడా ఈ నిర్మాణం గురించి, నిర్మాణానికి అయిన ఖర్చు గురించి ప్రజలకు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేయలేదు.

మరోవైపు మిగతా అక్రమ కట్టడాలను కూడా కూల్చే యోచనలో జగన్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం బాబు నివాసముంటున్న ఇంటిని కూల్చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాబు రాజధాని ప్రాంతంలో మరో అద్దె ఇంటిని చూసుకుంటున్నారని కూడా వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా ఓ కొత్త విషయం తెరమీదకు వచ్చింది. జగన్ సర్కార్ బాబు నివాసాన్ని కూల్చివేయడానికంటే ముందు.. ఆ ఇంటికి వెళ్లే దారిని మూసివేయాలనుకుంటుందట.

ప్రజావేదిక అంటే ప్రభుత్వ నిర్మాణం కాబట్టి వెంటనే కూల్చి వేసింది ప్రభుత్వం. కానీ బాబు ఉంటున్న నివాసం ఓ వ్యక్తికి సంబంధించిన ప్రైవేట్ నిర్మాణం. అది ఒకవేళ అక్రమ కట్టడమైనా దాన్ని కూల్చాలంటే ఓ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఇప్పటికే దానిపై కోర్టులో కేసు కూడా ఉంది. దాన్ని కోర్టు ఆదేశాలతో కూల్చాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం పట్టే అవకాశముంది. అందుకే జగన్ సర్కార్ బాబుని మరోలా ఇబ్బంది పెట్టాలని చూస్తోందట. ప్రజావేదిక, బాబు నివాసం అక్రమ కట్టడాలు అయినప్పుడు.. వాటికోసం వేసిన రోడ్ కూడా అక్రమమే అవుతుంది కదా. అందుకే ముందుగా బాబు నివాసానికి వెళ్లే దారిని మూసివేయాలి అనుకుంటుందట. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి చెందిన జడ్పీ చైర్మన్ నివాసానికి వెళ్లే దారిని క్లోజ్ చేసారని వార్తలొచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు బాబుని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, ఇప్పటికే బాబు కొత్తింటి వేటలో ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఒకవేళ బాబు నిజంగానే కొత్తింటికి వెళ్తే.. ఇన్ని రోజులు తాను ఉన్న నివాసం.. అక్రమ నిర్మాణమని ఒప్పుకున్నట్లు అవుతోంది. ఇన్నాళ్లు అక్రమ నిర్మాణమని తెలిసే బాబు అందులో ఉన్నారా అంటూ విమర్శలు వస్తాయి. అలాగే బాబు భయపడి పారిపోయాడనుకునే అవకాశముంది. అసలే బాబు పిరికివాడని, ప్రతి చిన్న దానికి భయపడతారని కొందరు విమర్శలు చేస్తుంటారు. ఇప్పుడు కొత్తింటికి వెళ్తే బాబుకి మళ్ళీ అలాంటి విమర్శలే ఎదురయ్యే అవకాశముంది. మరి బాబు విమర్శలు ఎదుర్కొంటారా లేక అక్కడే ఉండి పోరాడతారా?. ప్రజావేదిక కూల్చివేత పుణ్యమా అని బాబుకి పోరాడటానికి మంచి అవకాశం వచ్చిందని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. బాబు అదే నివాసంలో ఉండి, ఒకవేళ రోడ్డు తవ్వేస్తే కట్ట మీద నడిచైనా రాకపోకలు సాగించాలని, అప్పుడే ఆయనలోని పోరాట యోధుడు ప్రజలకు కనిపిస్తాడని అంటున్నారు. ఒకవేళ బాబు అక్కడే ఉండి పోరాడితే బాబుకి అన్యాయం జరిగిందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది, అదేవిధంగా కార్యకర్తల్లో కూడా ధైర్యం నింపినట్లు అవుతుందని అంటున్నారు. అంటే బాబు కొత్తింటికి వెళ్తే పిరికివాడని అనిపించుకునే అవకాశముంది. అదే పాత నివాసంలోనే ఉంటే పోరాడే యోధుడు అనిపించుకుంటారు. మరి బాబు పారిపోతారో లేక పోరాడతారో చూడాలి.