'జనసేన'కు మెగా మద్దతు!?

 

'జనసేన'కు మద్దతుగా మెగా హీరోలు రంగంలోకి దిగుతున్నారా? తమ మాటల ద్వారా జనసేనాని పవన్ కల్యాణ్ వెనుక తాము ఉన్నామని మెగా ఫ్యామిలీలో యువ హీరోలందరూ చెప్పదలుచుకున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే అవునక తప్పదు. అయితే... ఇక్కడ ఓ విషయం గమనించాలి. మెగా వారసులు నేరుగా రాజకీయ ప్రసంగాలు చేయడం లేదు. సినిమా వేడుకలకు వచ్చినప్పుడు తమ ప్రసంగాల్లో రాజకీయాలను ప్రస్తావించకుండా వదలడం లేదు. ఎవరిపై విమర్శలు చేయడకుండా.. పవన్ 'జనసేన'కు మద్దతుగా మాట్లాడటమో లేదా పవన్‌ని విమ‌ర్శించేవారిపై సుత్తిమెత్తగా విరుచుకు పడటమో జరుగుతుంది.

'పడి పడి లేచె మనసు' ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం రాత్రి జరిగింది. దానికి స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ అతిథిగా వచ్చారు. చంద్రబాబునాయుడు, కేసీఆర్, చిరంజీవి, పవన్ కల్యాణ్... ఎవరినైనా 'గారు' అని సంభోదించాలని చెప్పారు. ఒకరికి గౌరవం ఇవ్వడం తప్పేం కాదన్నారు. అల్లు అర్జున్ స్పీచ్ గమనిస్తే "రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రానా గౌరవం ఇవ్వకూడదని ఎవరూ హక్కు ఇవ్వలేదు" అన్నారు. చంద్రబాబునాయుడు, కేసీఆర్ ఎప్పట్నుంచో రాజకీయాల్లో ఉన్నారు. వారితో పోలిస్తే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినది పవన్ కల్యాణే. రాజకీయాల్లో విమర్శలు సహజం. పవన్‌ని ఎంతోమంది విమర్శిస్తున్నారు. కొందరు మాత్రం అసభ్య పదజాలంతో వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. అటువంటి వాళ్లకు బన్నీ కౌంటర్ ఇచ్చాడని మెగా టాక్.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'అంతరిక్షం' ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం రాత్రి జరిగింది. దీనికి మెగా ప‌వ‌ర్‌స్టార్‌ రామ్‌చ‌ర‌ణ్‌ అతిథిగా వచ్చారు. అమెరికాలో పవన్ ప్రసంగం బావుందని చెప్పారు. వేదిక ముందున్న అభిమానులను ఉద్దేశిస్తూ రామ్ చరణ్ "మీరు వేదికకు అటువైపు ఉన్నారు కాబట్టి అరుస్తున్నారు. నేను ఇటువైపు ఉన్నాను కాబట్టి అరవలేకపోతున్నా. నాకూ మీలా అరవాలని ఉంది" అన్నారు. పవన్ ఏం చెప్పారని కాదు... ఆయన మాటల్లో భావాన్ని ఆదర్శంగా తీసుకోవాలని రామ్ చరణ్ కోరారు. ఫేస్‌బుక్‌లో పవన్ ప్రసంగాన్ని ప్రశంసిస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టారు.

"నిజమైన ధైర్యం అంటే... భయం లేకపోవడం కాదు. ప్రతిరోజూ భయాన్ని ఎదుర్కోవడం! ఆ భయాన్ని అధిగమించాలంటే... మిమ్మల్ని భయపెట్టే పనినే రోజూ చేయండి. భయంలో మార్పును ఎదుర్కోలేక పోవడమే పెద్ద భయం" అని తాజా అమెరికా పర్యటనలో తన ఉపన్యాసంలో పవన్ చెప్పారు. ఈ మాటలను వదిలేసి కొందరు భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని పవన్ చెప్పిన మాటలను హైలైట్ చేస్తూ విమర్శలు చేయడం పట్ల మెగా ఫ్యామిలీ అసంతృప్తిగా ఉందట. ఇంతకు ముందూ పవన్‌ని టార్గెట్ చేస్తూ కొందరు చేసిన టీవీ కార్యక్రమాలపై మెగా ఫ్యామిలీ అసంతృప్తితో ఉంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇటువంటి విమర్శలకు చెక్ పెడుతూ.. 'జనసేన'కు మద్దతుగా మెగా హీరోలు మాట్లాడే అవకాశాలు ఉన్నాయని సమాచారం.