తెలంగాణ రాజకీయం చంద్రబాబు చుట్టూ తిరుగుతోందా?

చంద్రబాబు ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసారు. సీమాంధ్రలోనూ, తెలంగాణలోనూ ఆయన మార్క్ చూపించారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఏపీలో టీడీపీ విజయం సాధించి చంద్రబాబు సీఎం అయ్యారు కానీ.. తెలంగాణలో మాత్రం టీడీపీ డీలా పడిపోయింది. 2014 లో ఎన్నికల్లో గెలిచిన కొన్ని స్థానాల్లోని మెజారిటీ నాయకులు కూడా పార్టీని వీడి తెరాసలో చేరారు. దీంతో ఇక టీడీపీ పని అయిపోయింది అనుకున్నారంతా. చంద్రబాబు కూడా తెలంగాణ బాధ్యతను ఉన్న ఒకరిద్దరు లోకల్ సీనియర్ నేతలకే అప్పగించి.. ఆయన దృష్టి అంతా ఏపీ అభివృద్ధి మీద పెట్టారు. ఇక కేసీఆర్ విషయానికి వస్తే ఆయన ప్రతిపక్షాల లిస్ట్ లో టీడీపీ ఉండనే విషయాన్ని మర్చిపోయారు. ఇక అంతో ఇంతో బలంగా ఉన్న కాంగ్రెస్సే మన టార్గెట్ అనుకోని.. గడిచిన నాలుగేళ్లు కాంగ్రెస్ మీదే విమర్శలు చేసుకుంటూ వచ్చారు. రోజులన్నీ ఒకేలా ఉంటే అవి రాజకీయాలు ఎందుకు అవుతాయి చెప్పండి. ఎన్నికలకు ఏడెనిమిది నెలలు గడువు ఉండగానే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఇక్కడ మొదలైంది అసలైన తెలంగాణ రాజకీయం. ఎవరి ఊహలకు అందకుండా కాంగ్రెస్, టీడీపీ మహాకూటమితో దగ్గరయ్యాయి.

 

 

మొన్నటి వరకు తెలంగాణలో తెరాసకు ఎదురులేదు. మళ్ళీ తెరాసదే అధికారమని తెరాస బలంగా నమ్మింది. కానీ అసెంబ్లీ రద్దు, అభ్యర్థుల ప్రకటన, ముందస్తుకు అడుగులు తరువాత పరిస్థితి మారిపోయింది. ముఖ్యంగా మహాకూటమి తెరాస నమ్మకాన్ని కాస్త బలహీన పరిచింది. తెలంగాణలో కాంగ్రెస్ కాస్త బలంగానే ఉంది. ఇక టీడీపీ, నాయకులు దూరమైనా కొన్ని ప్రాంతాల్లో కేడర్ మాత్రం టీడీపీని అంటిపెట్టుకొని ఉంది. ఇదే ఇప్పుడు తెరాసకు తలనొప్పిగా మారింది. కాస్త బలంగా ఉన్న కాంగ్రెస్ కి మహాకూటమితో టీడీపీ బలం కూడా తోడైతే.. తెరాస విజయం సులభం కాదు. దీనికితోడు మహాకూటమికి అండగా టిజెఎస్, సిపిఐ కూడా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మహాకూటమి పుణ్యమా అని తెరాస విజయం మహా కష్టంగా మారింది. అయితే ఈ  మహాకూటమి ఏర్పడటానికి తెరవెనుక చంద్రబాబు పావులు కదిపారని గుసగుసలు వినిపించాయి. ఏది ఏమైనా ఈ మహాకూటమితో మొన్నటి వరకు కేసీఆర్ కు కనిపించని టీడీపీ, చంద్రబాబు.. ఇప్పుడు కనిపించడం మొదలు పెట్టారు. మొన్నటివరకు కాంగ్రెస్ మీద మాత్రమే ఎక్కువ విమర్శలు చేసిన కేసీఆర్ ఇప్పుడు చంద్రబాబుని టార్గెట్ చేసారు. చంద్రబాబు తెలంగాణ ద్రోహి.. ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి సిగ్గులేదా అంటూ హద్దులు దాటి విమర్శలు చేసారు.

 

 

అయితే కేసీఆర్, చంద్రబాబు మీద చేస్తున్న విమర్శలు ఆయనకు మైలేజీ తీసుకురాకపోగా నెగటివ్ ఇమేజ్ తీసుకొస్తున్నాయి. 2009 లో తెరాస, టీడీపీతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని గుర్తుచేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లు కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. 2009 లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు చంద్రబాబుని గొప్ప నాయకుడు అన్నావ్. అప్పుడు తెలంగాణ ద్రోహిగా కనపడని ఆయన ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే సరికి చంద్రబాబు ద్రోహి అయ్యాడా అంటూ నిలదీస్తున్నారు. హైదరాబాద్ ని డెవలప్ చేసి ప్రపంచపటంలో నిలిపినందుకు ద్రోహ? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మొన్నటివరకు కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్ కాస్తా.. ఇప్పుడు కేసీఆర్ వర్సెస్ చంద్రబాబుగా మారిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రస్తుతం తెలంగాణ రాజకీయం చంద్రబాబు చుట్టూ తిరుగుతోంది. మరి తెరాసకు గెలుపు నమ్మకాన్ని దూరం చేస్తున్న మహాకూటమి.. గెలుపుని కూడా దూరం చేస్తుందేమో చూడాలి.