ఇంతకీ లక్ష్మీనారాయణ ఉన్నట్లా? లేనట్లా? పవనే దూరం పెడుతున్నారా?

లక్ష్మీనారాయణ... సీబీఐలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా క్రేజ్ తెచ్చుకున్న లక్ష్మీనారాయణ 2014 సార్వత్రిక ఎన్నికల్లో జనసేనాని వెంట నడిచారు. వైజాగ్‌ ఎంపీ పోరులోనూ గౌరవమైన ఓట్లు కూడా తెచ్చుకున్నారు. అయితే, ఎన్నికల తర్వాత ఒకట్రెండు సమావేశాలు మినహా జనసేన కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశమవుతోంది. ఆమధ్య జరిగిన విశాఖ లాంగ్ మార్చ్ లో గానీ, ఇప్పుడు బీజేపీతో జనసేన కలిసి నడుస్తున్నవేళ గానీ, ఏ మీటింగ్ లోనూ లక్ష్మీనారాయణ కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. లక్ష్మీనారాయణే పార్టీకి దూరంగా ఉంటున్నారా? లేక జనసేనే లక్ష్మీనారాయణను దూరం పెడుతోందో తెలియక జనసైనికులు, లక్ష్మీనారాయణ అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు.

మరోవైపు అమరావతిలో రాజధాని ఉద్యమం పెద్దఎత్తున ఎగిసిపడుతోంది. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా రాజధాని ప్రజలకు మద్దతుగా ఒకరోజు ఆందోళనల్లో పాలుపంచుకున్నారు. కానీ, లక్ష్మీనారాయణ ఎక్కడా కనబడలేదు. ఇటు రాజధాని ఆందోళనల్లోనూ... అటు పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనకపోవడంతో... లక్ష్మీనారాయణ అసలు జనసేనలోనే ఉన్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కారణాలేమైనప్పటికీ జనసేనతో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, లక్ష్మీనారాయణ పార్టీ మారుతారనే టాక్ కూడా వినిబడుతోంది. అందుకే, పార్టీ సమావేశాలకు హాజరవడం లేదని అంటున్నారు. 

అయితే, తాను జనసేనకు దూరంగా ఉంటున్నానని, పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలను లక్ష్మీనారాయణ కొట్టిపారేశారు. పార్టీ నిర్ణయాల ప్రకారమే తాను నడుచుకుంటున్నానని స్పష్టం చేశారు. అయితే 2020లో తాను కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నానని, వాటి కోసం అధిక సమయం వెచ్చిస్తానని చెప్పారు. అదే సమయంలో పార్టీ అభివృద్ధి కోసం కూడా కృషి చేస్తానని అన్నారు. ఒక వేళ పార్టీ మారే పరిస్థితి ఏర్పడితే అందరికీ చెప్పే చేస్తానని లక్ష్మీనారాయణ తేల్చిచెప్పారు. ప్రస్తుతానికి అయితే తాను పార్టీ మారబోనని, అలాంటి ఆలోచనే లేదన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటున్నానని, ప్రజా చైతన్య కార్యక్రమాలకు హాజరవుతూ ఫుల్ బిజీగా ఉన్నట్లుగా లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు.

పార్టీ మారే ఉద్దేశం లేదని లక్ష్మీనారాయణ చెబుతున్నా... జనసేన విధానాలు, నిర్ణయాల్లోనూ తనకు పాత్రలేకుండా చేస్తున్నారని లోలోపల రగిలిపోతున్నారట. రాజకీయాల్లో సీనియర్‌ కాకపోయినా, తనకంటూ సమాజంలో ఒక ఇమేజ్‌ ఉందని, కానీ తనకు ఆ మేరకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. జనసేనకు సంబంధించి ప్రతి కార్యక్రమంలోనూ పవన్ కల్యాణ్‌ తర్వాత నాదెండ్ల మనోహర్ మాత్రమే కనపడ్తున్నారని, ఇది సరికాదని అంటున్నారట. మొత్తానికి పార్టీ నిర్ణయాల్లో తనకేమాత్రం భాగస్వామ్యం కల్పించడం లేదని లక్ష్మీనారాయణ ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే, ఇటీవల నియోజకవర్గ ఇన్ ఛార్జులను ప్రకటించిన జనసేనాని పవన్ కల్యాణ్.... విశాఖ పార్లమెంట్ సెగ్మెంట్ బాధ్యతలను లక్ష్మీనారాయణకే అప్పగించారు. దాంతో, లక్ష్మీనారాయణ జనసేనలోనే ఉన్నారని, ఆయనకు పార్టీ ప్రాధాన్యత ఇస్తోందని చెప్పినట్లయ్యింది. అయితే, పార్టీ విధాన నిర్ణయాల్లో... పార్టీ కార్యక్రమాల్లో లక్ష్మీనారాయణను ఎందుకు భాగస్వామ్యం చేయడం లేదో ప్రశ్నార్ధకమవుతోంది. మొత్తానికి లక్ష్మీనారాయణ జనసేనలో ఉన్నారంటే ఉన్నారు... లేరంటే లేరన్నట్లుగా పార్టీ వ్యవహరిస్తోందని అంటున్నారు.