ఆడవారికి గులాబీ రంగంటే ఇష్టమా!


ఆడవారి కోసం రూపొందించే వస్తువులు, దుస్తులలో తప్పకుండా లేతగులాబీ రంగు (పింక్) కనిపించి తీరుతుంది. వాళ్లకి ప్రేమలేఖ రాయాలన్నా, కానుకని అందించాలన్నా కూడా అది పింక్ రంగులో ఉంటే... వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని మన నమ్మకం. దానికి అనుగుణంగానే స్త్రీలు కూడా పింక్ రంగంటే ఇష్టపడటాన్ని గమనిస్తూ ఉంటాము. ఇంతకీ ఈ నమ్మకంలో నిజం ఎంత?

 

ఆడవారికి గుర్తుగా పింక్ రంగునీ, మగవారికి గుర్తుగా నీలం రంగునీ ఫ్యాషన్ ప్రపంచం గుర్తిస్తోంది. ఈ ఇష్టాల వెనుక శాస్త్రీయ కారణాన్ని తెలుసుకునేందుకు అనేక పరిశోధనలు జరిగాయి కూడా! ఉదాహరణకు ఇంగ్లండులోని  న్యూకేస్టిల్ విశ్వవిద్యాలయం వారు 2007లో ఓ ప్రయోగం చేశారు. ఇందుకోసం ఓ వేయిమంది జంటలకి కంప్యూటర్లో వేర్వేరు రంగులను చూపించారు. వీటిలో ఆడవారు ఎక్కువగా గులాబీని తలపించే ఎరుపుని ఇష్టపడుతున్నారని తేలింది. మగవారేమో నీలం రంగుని ఎంచుకుంటున్నట్లు గమనించారు.

 

స్త్రీలు పింక్ రంగునీ, మగవారు నీలం రంగునీ ఎంచుకోవడం వెనుక మన కుటుంబవ్యవస్థ ఏర్పడిన తీరే కారణం అని విశ్లేషించారు సదరు శాస్త్రవేత్తలు. ఒకప్పుడు ఆడవారు పండ్లని కోసుకురావడం, పిల్లల బాగోగులను గమనించుకోవడం వంటి పనులలో నిమగ్నమయ్యేవారు. మగవారేమో పొలం పనులు, వేట వంటి పనులు చేస్తుండేవారు. పండ్లని కోసేటప్పుడు బాగా ఎర్రగా పండిన పండ్ల మీదకి దృష్టి మళ్లడం సహజం. ఇక పిల్లల బాగోగులను గమనించుకునేటప్పుడు కూడా వారి మొహంలో ఎరుపుదనం మరీ ఎక్కువైనా, తక్కువైనా అది అనారోగ్యానికి చిహ్నంగా భావించి.... వారి చర్మపు రంగుని గమనించుకోవడమూ సహజమే! ఇక మగవారేమో పొలం పనులు చేసేటప్పుడూ, వేటాడేటప్పుడూ ముదురు రంగులే వారి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. అలా కుటుంబంలోని శ్రమవిభజన వల్ల ఆడవారికీ పింక్ రంగు, మగవారికి నీలం రంగు మనసులో ఉండిపోయింది.

 

పింక్ రంగు, నీలం రంగు అనే తేడాలు కేవలం మనం సృష్టించుకునేవే అన్న వాదనలూ లేకపోలేదు. 19వ శతాబ్దంలో ఫలానా రంగు ఆడవారికీ, ఫలానా రంగు మగవారికీ అన్న తేడాలు ఉండేవి కావట. ప్రపంచీకరణ మొదలైన కొద్దీ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు, ఇలాంటి చిట్కాలను ప్రయోగిస్తున్నారని కొందరి భావన. ఈ విషయాన్ని నిరూపించేందుకు 2011లో ఓ పరిశోధన జరిగింది. ఇందులో-  రెండేళ్లలోపు పిల్లలు గులాబీ లేదా నీలం రంగుని ఎంచుకోవడంలో పెద్దగా పట్టింపులు చూపలేదు. కానీ రెండేళ్లు దాటిన పిల్లలు ఆడపిల్లలైతే గులాబీ రంగునీ, మగపిల్లలైతే నీలం రంగునీ ఎంచుకోవడం మొదలుపెట్టారు. పిల్లలకి ఊహ తెలుస్తున్న కొద్దీ సమాజం వారిలో గులాబీ ఆడవారికీ, నీలం మగవారికీ అని రకరకాలుగా నూరిపోయడమే దీనికి కారణం అని తేల్చారు.

 

ఏతావాతా తేలేదేమిటంటే- రంగుల ఎంపికలో ఆడామగా తేడా ఉండే అవకాశం ఉన్నా... మన చుట్టూ ఉన్న వ్యాపారవ్యవస్థ దానిని పెంచి పోషించింది. ఈ విషయాన్ని నిరూపించేందుకు మార్కో అనే సామాజికవేత్త గూగుల్లో లభించే కొన్ని లక్షల పుస్తకాలను స్కాన్ చేసి చూశారు. ఇందులో 1880కి ముందు ఉన్న పుస్తకాలలో గులాబీ రంగు ఆడవారికి ఇష్టమైన రంగు అన్న మాట చాలా తక్కువగా కనిపించింది. కానీ కాలం గడిచేకొద్దీ ఈ తరహా వాక్యాలు తరచూ చోటు చేసుకోవడం మొదలుపెట్టాయి. ఈ పరిస్థితి కనుక మరీ హద్దు మీరితే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. గులాబీ రంగు ఆడవారిది, గులాబీ రంగు స్త్రీత్వానికి సూచన... అంటూ మోత మోగించేస్తే కొన్నాళ్లకి ఆ రంగంటేనే విరక్తి పుట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

 

- నిర్జర