టీకాంగ్రెస్ నేతలకు హైకమాండ్ భయపడుతోందా? పీసీసీని ఎందుకు మార్చడం లేదు? 

తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ చీఫ్ మార్పుపై రోజుకో రూమరు చక్కర్లు కొడుతోంది. ఇదిగో కొత్త పీసీసీ, అదిగో కొత్త ప్రెసిడెంట్‌ అంటూ వార్తలు వస్తున్నా, ఏదీ కార్యరూపం దాల్చడంలేదు. పీసీసీ చీఫ్‌ మార్పుపై తర్జభర్జనలు పడుతోన్న పార్టీ అధిష్టానం కూడా ఎటూతేల్చలేకపోతోంది. పీసీసీ పదవి వద్దు బాబోయ్ అంటూ ఉత్తమ్‌ అల్లంత దూరం జరిగినా, హైకమాండ్‌ మాత్రం పీఠంపై మరొకరిని కూర్చోబెట్టడానికి వెనకా ముందు ఆడుతోంది. పీసీసీ పీఠం నుంచి తప్పుకుంటానని ఉత్తమ్ ప్రకటించి ఆరు నెలలు గడుస్తున్నా, కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడంలో మాత్రం అధిష్టానం అష్టకష్టాలు పడుతోంది. 

అసలు, తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ ను నియమించడం చాలా కష్టమనే భావనలో హైకమాండ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే, పీసీసీ మార్పు విషయంలో అధిష్టానం ఆచితూచి అడుగులేస్తుందని అంటున్నారు. ఇప్పటికిప్పుడు పీసీసీ చీఫ్ ను మార్చడం వల్ల పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువనే భావనలో అధిష్టానం ఉందంటున్నారు. ముఖ్యంగా పీసీసీ అధ్యక్ష పదవి కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డితోపాటు ఇంకా పలువురు నేతలు సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు.

ఇలాంటి సమయంలో కొత్త పీసీసీని నియమిస్తే అసమ్మతి భగ్గుమనడం ఖాయమని హైకమాండ్ భయపడుతోంది. అసలే, కష్టాల్లో ఉన్న పార్టీకి ఇది మరింత ఇబ్బందులకు గురిచేస్తుందని భావిస్తోంది. అసమ్మతి నేతలు పార్టీని వీడే అవకాశముంటుందని, లేదా, రాష్ట్ర కాంగ్రెస్ నిట్టనిలువునా చీలినా ఆశ్చర్యపోనవసరం లేదని హైకమాండ్ భయపడుతోంది. అసలే, కొన ఊపిరితో ఉన్న పార్టీకి, ఈ పరిణామం మంచిది కాదని భావిస్తున్న అధిష్టానం... ఇప్పటికిప్పుడు పీసీసీని మార్చి, ఎందుకు కొత్త కష్టాలు తెచ్చుకోవడమని భావిస్తోంది. మరి, ఎంతకాలం పీసీసీని సాగదీస్తుందో చూడాలి.