కూలింగ్ వాటర్‌ తాగుతున్నారా! ఇది చదవండి…

 

 

ఎండాకాలం వచ్చిందంటే చాలు... సీసాల కొద్దీ చల్లటి నీళ్లని గొంతులో ఒంపేసుకుంటాము. కానీ అదేం చిత్రమో! చల్లటి నీళ్లు ఎంత తాగినా కూడా దాహం తీరదు. పైగా దగ్గు, జలుబులాంటి సమస్యలు పలకరిస్తూ ఉంటాయి. కూలింగ్‌ వాటర్‌ తాగడం వల్ల ఒంటికి ఇసుమంతైనా ఉపయోగం ఉంటుందా అంటే లేదనే జవాబిస్తున్నారు నిపుణులు. పైగా నానారకాల సమస్యలనీ ప్రస్తావిస్తున్నారు. అవేమిటంటే…

 

అందుకే జలుబు!

చల్లటి నీటి వల్ల గొంతులో మ్యూకస్‌ అనే జిగురు పదార్థం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల గొంతు, ఊపిరితిత్తులలోని రోగనిరోధక శక్తి తగ్గిపోయి త్వరగా దగ్గు, జలుబు వంటి అనారోగ్యాలు పలకరిస్తాయి. చల్లటి నీరు తాగాక వచ్చే సమస్యలకు ఇదే కారణం!

 

అనవసర శ్రమ

ఒంట్లోకి చేరుకునే ఏ పదార్థాన్నయినా మన శరీరం సాధారణ ఉష్ణోగ్రత వద్దకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో శరీరం తన శక్తిని కోల్పోతుందంటున్నారు. చాలామంది తిండి మధ్యలో ఈ చల్లటి నీరు తాగుతూ ఉంటారు. దాని వల్ల శరీరం తనకు ఆహారం ద్వారా అందుతున్న పోషకాలను జీర్ణం చేసుకునే శక్తి కాస్తా చల్లటి నీటిని వెచ్చచేసుకునే ప్రయత్నంలోనే మునిగిపోతుంది. అంటే! మనం తినే ఆహారం ఒంటపట్టదన్నమాట!

 

రక్తప్రసారానికి అడ్డు

చల్లచల్లటి నీరు ఒంట్లోకి చేరడం వల్ల, ఒంట్లోని రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దాని వల్ల ఒంట్లోని కణాలకు తగినంత నీరు అందక... ఇంకా దాహం తీరనట్లుగానే ఉంటుంది. చల్లటి నీరు రక్తప్రవాహం మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అందుకే చల్లటి నీరు ఎక్కువగా తాగిన తరువాత ఒళ్లు తిమ్మిర్లు ఎక్కినట్లుగా అనిపిస్తుంది.

 

గుండె మీద భారం

చల్లటి నీటి వల్ల రక్తప్రసావం తగ్గిపోతుందని చెప్పుకొన్నాం కదా! దీనివల్ల గుండె మీద భారం పడుతుంది. అంతేకాదు! చల్లటి నీరు తాగడం వల్ల గుండెకు చెందిన vagus అనే నరం పనితీరులో మార్పు వస్తుందట. దానివల్ల గుండె వేగం ఒక్కసారిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

 

జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం

ఒంట్లోని సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీలు. మరి చల్లటి నీరేమో పది డిగ్రీల లోపే ఉంటుంది. అలాంటి నీరు శరీరంలోకి ప్రవేశించడం వల్ల మన జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం అయిపోతుంది. కొవ్వు పదార్థాలు శరీరంలోనే పేరుకుపోయి ఊబకాయానికి దారితీస్తాయి. ఒకోసారి రక్తం కూడా గడ్డకట్టే ప్రమాదం ఏర్పడుతుంది. అదెంత ప్రాణాంతకమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కదా!

 

చల్లటి నీటికి విరుద్ధంగా గోరువెచ్చటి నీటి వల్ల శరీరానికి బోలెడ లాభాలు ఉంటాయి. ఎండాకాలంలో గోరువెచ్చటి నీరు తాగే ప్రయత్నం చేయడం ఏమంత తేలిక కాకపోవచ్చు. కానీ చల్లటి నీటికి మాత్రం దూరంగా ఉండమనే చెబుతున్నారు పెద్దలు.    

- నిర్జర.