సీఎంకి ఎదురుదెబ్బ.. విచారణ తప్పేలా లేదు

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 2007 లో విద్వేషపూరిత ప్రసంగం చేసిన కేసులో యూపీ ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు సుప్రీమ్ కోర్ట్ నోటీసులు జారీ చేసింది.. ఈ కేసును ఎందుకు విచారణ చేపట్టకూడదో చెప్పాలంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

 

 

జనవరి 2007లో మొహర్రం సందర్భంగా గోరఖ్ పూర్‌లో హిందువులు, ముస్లింలకు మధ్య జరిగిన ఘర్షణల్లో రాజ్ కుమార్ అగ్రహారి అనే హిందూ మతానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు.. ఆనాడు ఘర్షణలు జరిగిన ప్రాంతాన్ని యోగీ ఆదిత్యనాథ్ సందర్శించకూడదని, దీనివల్ల హింస చెలరేగే అవకాశముందని జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసింది.. అయితే అహింసా పద్ధతిలోనే ఘటనాస్థలంలో యోగీ ఆదిత్యనాథ్ ధర్నా చేశారు.. ఈ సందర్భంగా కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.. దీంతో ఆయన అనుచరులు కొన్ని ముస్లిం కట్టడాలకు నిప్పంటించారు.. ఆ సమయంలో పోలీసులు కర్ఫ్యూ విధించారు.. ఆదిత్యనాథ్‌ను అరెస్ట్ చేసారు.. ఆయన అరెస్టుతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.. ముంబై నుంచి గోరఖ్ పూర్ వెళ్లే గోదాన్ ఎక్స్‌ప్రెస్‌కు హిందూ యువవాహిని కార్యకర్తలు నిప్పంటించారు.. దీంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది.. నాటి అల్లర్లలో ఆందోళనకారులు మసీదులను, ఇళ్లను, బస్సులను, రైళ్లను తగులబెట్టారు.

దీంతో గోరఖ్ పూర్‌ అల్లర్ల కేసుకు యోగీ ఆదిత్యనాథ్‌ ప్రసంగం కూడా కారణమని ఆరోపణలు వచ్చాయి.. దీనిపై సీబీఐతో విచారణ చేయించాలంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. యూపీ ప్రభుత్వం సీఎం ని విచారించేందుకు నిరాకరించింది.. అలాగే అలహాబాద్ హైకోర్టు కూడా ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.. ఈ కేసులో సీఎం ను విచారించేందుకు యూపీ ప్రభుత్వం నిరాకరించడాన్ని అలహాబాద్ కోర్ట్ సమర్ధించడంపై పలువురు తప్పుపట్టారు.. ఈ విషయంపై పర్వేజ్ అనే వ్యక్తి సుప్రీమ్ కోర్ట్ లో పిటీషన్ వేయగా.. సమాధానం చెప్పాలని ప్రభుత్వానికి సుప్రీమ్ కోర్ట్ నోటీసులు జారీ చేసింది.