కశ్మీరుతో బీజేపీ వ్యూహం ఇదే!

అంతా ఊహించినట్లే జరిగింది. కశ్మీర్‌లో మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీ ముందుకు రాకపోవడంతో గవర్నరు పాలననే కొనసాగించనున్నారు. ఇంతకీ బీజేపీ అకస్మాత్తుగా ప్రభుత్వాన్ని ఎందుకు కూలదోసింది. దాని వల్ల ఎవరికి లాభం అన్న ప్రశ్నలు చాలా ఆసక్తికరమైన జవాబులకి దారితీస్తున్నాయి.

నిజానికి పీడీపీ, బీజేపీ పార్టీలు ఉప్పునిప్పులాంటి సిద్ధాంతాలతో నడుస్తున్నాయి. పీడీపీ వేర్పాటువాదం పట్ల కాస్త సానుకూలంగా ఉంటే, బీజేపీ పూర్తిగా జాతీయవాదం వైపే మొగ్గుచూపుతుంటుంది. కానీ 2014లో ఎన్నికలు జరిగిన తర్వాత అధికారం కోసం ఆ రెండు పార్టీలు కలవక తప్పలేదు. అధికారం కోసం సిద్ధాంతాన్ని పక్కనపెట్టేశాయి. ఫలితం! దాదాపు 30 ఏళ్ల తర్వాత ఆ రాష్ట్రంలో ఓ సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది.

సహజంగానే పీడీపీ, బీజేపీల మధ్య ఈ మూడేళ్లలో ఏవో ఒక విబేధాలు పొడచూపుతూనే వచ్చాయి. కానీ ఇరు పార్టీలు కాస్త ఓర్చుకున్నాయి. అయితే కటువా ఉదంతంతో రెండు పార్టీల మధ్యా దూరం ఒక్కసారిగా పెరిగిపోయింది. కటువాలో ఓ ముస్లిం బాలిక మీద అత్యాచారం జరిగింది. దానికి దేశవ్యాప్తంగా నిరసనలు తలెత్తుతుంటే, కశ్మీర్‌ ప్రభుత్వంలోని బీజేపీ మంత్రులు మాత్రం నిందితుల పక్షాన ర్యాలీ నిర్వహించారు. వాళ్ల పట్ల ముఖ్యమంత్రి కటువుతో ప్రవర్తించడంతో, బీజేపీ మొహం ఎర్రబడింది. ఇహ ఇంచుమించుగా అప్పటినుంచే బయటకి రావడం కోసం కాచుకుని కూర్చుంది.

రంజాన్‌ సందర్భంలో ముఖ్యమంత్రి కశ్మీర్‌లోయలో కాల్పుల విరమణను ప్రకటించారు. దీని వల్ల శాంతి నెలకొనలేదు సరికదా... ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. రైజింగ్‌ కశ్మీర్‌ పత్రిక ఎడిటర్ బుఖారీని, ఔరంగజేబు అనే సైనికుడినీ కాల్చి చంపారు. ఈ సంఘటనలని బీజేపీ గొప్ప అవకాశంగా భావించింది. ముఫ్తీ సర్కారులో శాంతిభద్రతలు విఫలం అయ్యాయని ఆరోపిస్తూ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసింది. దీని వల్ల రెండు ప్రయోజనాలు సాదించింది. ఒకటి- ప్రభుత్వం నుంచి బయటకి వచ్చేసి, తను చెప్పినట్లు సాగే గవర్నరు పాలనని విదించడం; రెండు- కశ్మీరులో అశాంతికి కారణం ముఫ్తీ వైఫల్యమే అని ఆరోపించడం.

కశ్మీరు ప్రభుత్వం నుంచి బయటకు రావడం వచ్చేందుకు బీజేపీ మనసులో మరో ఎత్తుగడ కూడా ఉందని భావిస్తున్నారు. సర్జికల్‌ స్ట్రైక్స్ తర్వాత ఒక్కసారిగా వెలిగిన మోదీ ప్రభ ఇప్పుడు కొడిగడుతోంది. దాన్ని మళ్లీ ఎగదోయాలంటే ఉగ్రవాదుల మీదో, పాకిస్థాన్‌ మీదో దాడులు చేసి... దేశభక్తిని రాజేయాలి. ఇలాంటి చర్యలకు ముఫ్తీ అడ్డు తగుల్తుంది కాబట్టి తనకు అనుకూలమైన గవర్నరు పాలనని విధించాలి. ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం ఉంది కాబట్టి, ‘ఉగ్రవాదుల అణచివేత’ కార్యక్రమాన్ని ప్రశాంతంగా సాగించవచ్చు. వాటిని ఓట్ల రూపంలోకి మార్చుకోనూవచ్చు.

ఈ మొత్తం వ్యవహారంలో ముఫ్తీ బలిపశువుగా కనిపించవచ్చు. కానీ అధికారం కోసం తనకు విరుద్ధమైన బీజేపీతో చేతులు కలిపి ఆ పార్టీ భస్మాసుర హస్తాన్నే వరించింది. అందుకని ఇప్పుడు ప్రజలకు కానీ విపక్షాలకు కానీ ఆమె మీద పెద్దగా జాలి కూడా లేదు. పీడీపీని శుభ్రంగా వాడేసుకున్న బీజేపీ... తాను ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నానని కూడా ఆమెకి చెప్పలేదంటే, అక్కడ సంకీర్ణాల సంస్కారం ఎంత ఉన్నతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పార్టీలన్నింటి మధ్యా కశ్మీర్‌ పౌరుడి బతుకు ఎలా ఉంటుందా అని అడక్కండి! అలాంటి విషయాల గురించి ఆలోచించేదెవరు.