రాజాసింగ్ వెనక ఎవరున్నారు? తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?

మూడు గ్రూపులు.. ఆరు అలకలు.. పన్నెండు గొడవలు. ఇదీ గ్రేటర్ హైదరాబాద్ లో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి. తెలంగాణ రాజకీయాల్లో కాక రేపిన దుబ్బాక ఉప ఎన్నికలో దక్కిన విజయం బీజేపీకి బూస్ట్ ఇచ్చింది. దుబ్బాక  జోష్ తో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కమలం వికసిస్తుందని, బల్దియాపై కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ నేతలు ప్రకటనలు చేశారు. తీరా ఎన్నికలు వచ్చాకా మాత్రం ఆ పార్టీలో నిరుత్సాహం కనిపిస్తోందని చెబుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంటే.. వర్గ పోరుతో కమలనాధులు వెనకబడ్డారనే చర్చ జరుగుతోంది. నగర పరిధిలోని నేతలు రెండు వర్గాలుగా విడిపోవడంతో కేడర్ లోనూ గందగోళం నెలకొందని చెబుతున్నారు. 
               

నగరంలో బీజేపీకి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే రాజాసింగ్. ఆయన తీరుతో గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీకి ఇబ్బందులు వచ్చాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజాసింగ్ తీరు బీజేపీలో మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. హిందూ అనుకూల, ఎంఐఎం వ్యతిరేక ప్రకటనలు చేస్తూ కేడర్ లో జోష్ నింపుతుంటారు రాజాసింగ్. అయితే పార్టీ వ్యవహారాల్లో మాత్రం ఆయన ఎప్పుడూ కాంట్రవర్సీనే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్గీయుడిగా ముద్రపడిన రాజాసింగ్.. కావాలనే బండి సంజయ్ కి సహకరించడం లేదనే చర్చ జరుగుతోంది. బీజేపీలో తీవ్ర కలకలం రేపిన రాజాసింగ్ ఆడియో వెనక కిషన్ రెడ్డి పాత్ర ఉందని తెలుస్తోంది.  గ్రేటర్ ఎన్నికల్లో తానే చక్రం తిప్పాలని కిషన్ రెడ్డి భావించారట. అయితే బండి సంజయ్ సిటీపై ఫోకస్ చేస్తూ సభలు, సమావేశాలు పెట్టారు. సంజయ్ దూకుడుతో ఆయనకు నగరంలో బలమైన వర్గం తయారైందట. గ్రేటర్ టికెట్ల ఎంపికలోనూ కిషన్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించాలని చూసినా.. సంజయ్ టీమ్ వ్యతిరేకించిందని తెలుస్తోంది. సిటీలో సంజయ్ టీమ్ పెరగడాన్ని కిషన్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారని చెబుతున్నారు. అందుకే సంజయ్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే రాజాసింగ్ తో కిషన్ రెడ్డి డ్రామా ఆడిస్తున్నారని బీజేపీ కార్యకర్తల్లోనే చర్చలు జరుగుతున్నాయి.

 

కిషన్ రెడ్డి మనిషిగా ముద్రపడిన రాజాసింగ్.. ఆయన చెప్పినట్లే చేస్తారని చెబుతుంటారు. కిషన్ రెడ్డి పార్టీ చీఫ్ గా ఉన్నప్పుడు రాజాసింగ్ పార్టీ కార్యాలయంలో యాక్టివ్ గా ఉండేవారట. ఎప్పుడు అక్కడే ఉండేవారంటున్నారు. లక్ష్మణ్ కు పార్టీ పగ్గాలు అప్పగించిన తర్వాత కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయం రావడం మానేశారట. పార్టీ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్లు కూడా పెట్టలేదంటున్నారు. కిషన్ రెడ్డి బాటలోనే రాజాసింగ్ కూడా లక్మణ్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నన్ని రోజులు.. పార్టీ కార్యాలయం వైపు వెళ్లలేదని చెబుతున్నారు. ఇప్పుడు బండి సంజయ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా రాజా సింగ్ తీరు మారలేదంటున్నారు. కిషన్ రెడ్డితో సంజయ్ కు విభేదాలు ఉన్నందునే.. సంజయ్ కి వ్యతిరేకంగా రాజా సింగ్ రాజకీయం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.

 

గోషామహాల్ నియోజకవర్గం పరిధిలో జరిగిన టికెట్ల గొడవ, పార్టీ కార్యాలయం దగ్గర ధర్నాలు, బీఫామ్ తీసుకునేందుకు వచ్చిన దళిత అభ్యర్థిపై దాడి చేసి బట్టలు చించేయడం వంటి ఘటనలు పార్టీ పరువు తీశాయనే చర్చ బీజేపీలో జరుగుతోంది. బండి సంజయ్ పై కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ ట్వీట్ వైరల్ కావడం కమలంలో కల్లోలం రేపింది. అయితే రాజాసింగ్ పేరుతో ఫేక్ ట్వీట్ వైరల్ అవుతోందని కమలనాధులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుండగానే.. రాజా సింగ్ ఆడియో బయటికి వచ్చింది. బండి సంజయ్ తీరుపై రాజా సింగ్ తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఆ వీడియో నిమిషాల్లోనే వైరల్ గా మారింది. గ్రేటర్ నామినేషన్ల సమయంలోనే జరిగిన ఈ రెండు ఘటనలు  పార్టీకి నష్టం కల్గించాయనే అభిప్రాయం తెలంగాణ బీజేపీ నేతల నుంచి వస్తోంది. సిటీలో ఉన్న ఒక్క ఎమ్మెల్యేనే కలిసి రాకపోతే.. జీహెచ్ఎంసీని ఎలా ముందుకు తీసుకెళతారనే చర్చ కొన్ని వర్గాల ఓటర్లలో వచ్చిందని చెబుతున్నారు. ఇది పార్టీకి చాలా మైనస్ అయిందని, కేడర్ లోనూ జోష్ తగ్గిందని చెబుతున్నారు. 

 

తెలంగాణ బీజేపీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుందని చెబుతున్నారు. లక్ష్మణ్ పార్టీ చీఫ్ గా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి ఆయనకు సపోర్ట్ చేయలేదని టాక్ ఉంది. ఇప్పుడు మాత్రం ఇద్దరూ కలిసి తీరుగుతున్నారు. తెలంగాణ బీజేపీకి ఇప్పటివరకు నగరం నేతే అధ్యక్ష బాథ్యతలు చేపట్టారు. మొదటిసారి సిటీయేతర వ్యక్తి పార్టీ పగ్గాలు చేపట్టారు. దీంతో గుర్రుగా ఉన్న నగర నేతలంతా ఏకమై.. సంజయ్ ని టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు. అందుకే సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టగానే... గతంలో ఉప్పు నిప్పులా ఉన్న  కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కలిసిపోయారని చెబుతున్నారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో పొత్తుపై మాట్లాడేందుకు కూడా కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వెళ్లారు. పార్టీ అధ్యక్షుడు సంజయ్ హైదరాబాద్ లోనే ఉన్నా ఆయనను తీసుకువెళ్లలేదు. దీంతో బండికి చెక్ పెట్టేందుకే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కలిసిపోయారనే ప్రచారానికి బలం చేకూరుతోంది. మొత్తంగా పార్టీ నేతల వర్గపోరుతో గ్రేటర్ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుందనే ఆందోళన కమలం  కేడర్ లో వ్యక్తమవుతోంది. దుబ్బాక ఇచ్చిన బూస్ట్త్ తో గ్రేటర్ లో మరింత స్పీడుగా వెళ్లాల్సిన పార్టీ.. ముఖ్య నేతల తీరుతో మూల్సం చెల్లించుకోవాల్సిన పరిస్థితికి వచ్చిందని వారు ఆవేదన చెందుతున్నారట.