పిల్లలు అన్యాయంగా చనిపోతున్నారు

ఈ లోకంలో పిల్లల్ని మించిన ఆస్తి మరేముంటుంది. ప్రపంచం ఎంత అభివృద్ధి సాధించినా, ఎటు దూసుకు పోతున్నా... అందులో పిల్లలు సంతోషంగా లేకపోతే ఉపయోగం ఏముంటుంది. కానీ ఇప్పుడు ఆ పిల్లలనే మనం చేజేతులారా దూరం చేసుకుంటున్నామని తెలుస్తోంది.

 


- ఐదేళ్లలోపు పిల్లలలో ఏటా దాదాపు 17 లక్షల మంది నిష్కారణంగా చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతోంది. వాయు కాలుష్యం, ఇతరులు తాగే సిగిరెట్ పొగని పీల్చడం (second hand smoke), వాతావరణ కాలుష్యం, ఆహారంలో రసాయనాలు చేరడం, అపరిశుభ్రమైన నీరు... ఇలా రకరకాల నిర్లక్ష్య ధోరణుల మధ్య వారు చనిపోతున్నారని అంచనా వేస్తున్నారు.


- పిల్లలలో రోగనిరోధకశక్తి చాలా బలహీనంగా ఉంటుంది. వారి అవయవాలేమో చిన్నగా, అల్పంగా ఉంటాయి. దాని వల్ల చిన్నతనంలోనే నిమోనియా, ఆస్తమా వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతూ ఉంటారు.


- గాలి సంగతి అలా ఉంచితే తాగే నీరు కలుషితం కావడం వల్ల కూడా లక్షలాదిమంది పిల్లుల డయేరియా బారిన పడుతున్నట్లు చెబుతోంది WHO. 2012లో ఇలా డయేరియా ద్వారా 3,61,000 మంది పిల్లలు చనిపోయారట. నీరు కలుషితం కావడం వల్ల దోమల ద్వారా వ్యాపించే రోగాలు కూడా అదుపుతప్పుతున్నాయి. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను తట్టుకోవడం పిల్లల వల్ల కావడం లేదు.


- గాలి, నీరే కాదు. పిల్లలకు పరిశుభ్రమైన ఆహారం కూడా అందడం లేదన్నది WHO విశ్లేషణ. క్రిమిసంహారక మందులు, ప్లాస్టిక్‌ వంటి పదార్థాలలోని హానికారకమైన రసాయనాలు ఆహారంలోకి చేరిపోతున్నాయట. ఇలా ఆర్సెనిక్‌, లెడ్‌, ఫ్లోరైడ్‌, పాదరసం వంటివన్నీ ఆహారం ద్వారా పిల్లల శరీరంలోకి చేరుతున్నాయి. వీటిలో కొన్ని రసాయనాలు పిల్లల్లోని ఎండోక్రైన్‌ వ్యవస్థను దెబ్బతీస్తాయి. దీంతో లివర్, థైరాయిడ్‌, నరాలు దెబ్బతినిపోతాయి.


- వాహనాల నుంచి వచ్చే కాలుష్యం, పెద్దవారు పొగ తాగుతున్నప్పుడు పీల్చాల్సి రావడం... ఆఖరికి ఇంటి నాలుగుగోడల మధ్యా పేరుకుపోతున్న దుమ్ము కూడా పిల్లల్లో ఆస్తమా రావడానికీ కారణం అవుతోందట.


- గ్లోబల్‌ వార్మింగ్‌ కూడా పిల్లల జీవితాల మీద తీవ్రమైన ప్రభావం చూపుతోందని WHO చెబుతోంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణంలోని కార్బన్‌ వాయువులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటి వల్ల పూలల్లో పుప్పొడి ఎక్కువగా పెరుగుతుందట. ఈ పుప్పొడి కారణంగా పిల్లల్లో ఆస్తమా శృతి మించుతోంది. అంతేకాదు! ఉష్ణోగ్రతలలో వచ్చే అసాధారణమైన మార్పుల వల్ల అంటువ్యాధులు కూడా త్వరగా ప్రబలే ప్రమాదం ఉంది.


- పైన పేర్కొన్నవన్నీ మనం తరచూ వింటున్న ప్రమాదాలే! కానీ ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల వల్ల కూడా పిల్లల జీవితాలు కడదేరిపోతున్నాయని చెబుతోంది WHO. ఎప్పటికప్పుడు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నా electronic wastage వల్ల పిల్లలలో ఊపిరితిత్తులు దెబ్బతినడం దగ్గర నుంచీ కేన్సర్‌ వరకూ ప్రాణాంతక వ్యాధులు కమ్ముకుంటున్నాయని హెచ్చరిస్తోంది.


ఇంతకాలమూ కాలుష్యం అనేది కేవలం పర్యావరణానికి సంబంధించినదో లేకపోతే పెద్దవారికి సంబంధించినదో అని భావించేవారు. కానీ మన కంటిముందే ఆ కాలుష్యం పసిపిల్లల జీవితాలని చిదిమేస్తోందని హెచ్చరికలు అందుతున్నాయి. మరి ఈ హెచ్చరికలని ప్రభుత్వాలు పట్టించుకుంటాయా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అప్పటివరకూ మన చిన్నారులని మనమే ఎలాగొలా కాలుష్యం నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

 

- నిర్జర.