పైపై మెరుగుల కోసం పాకులాడితే

అనగనగా ఓ రెండు గుర్రాలు ఉండేవి. దేవతా గుర్రాలంటే మాటలా! పాలరాతి తెలుపుతో, నురగలాంటి జూలుతో మహా అందంగా ఉండేవి. వాయువేగంతో ముల్లోకాలూ చుట్టిపారేసేవి. జనం ఆ గుర్రాలను చూసినప్పుడల్లా ముక్కున వేలేసుకునేవారు. అంత అందమైన గుర్రాలను చూడటంతో తమ జన్మ ధన్యమైపోయిందని మురిసిపోయేవారు. కానీ ఆ గుర్రాల మనసులో ఏదో చింత! రెండు గుర్రాలనీ అంతా సమానంగా చూస్తున్నారు. రెండూ అందమైనవే అనీ, రెండూ వేగమైనవే అనీ పొగుడుతున్నారు. ‘అలా జరగడానికి వీల్లేదు! ఈ ప్రపంచంలో అన్ని గుర్రాలకంటే నేనే అందంగా ఉండాలి,’ అన్న ఆలోచన రెండు గుర్రాలలోనూ కలిగింది. అంతే వాటిలో ఒక గుర్రం నిదానంగా దేవుడి దగ్గరకి చేరింది.

 

‘భగవంతుడా! నన్ను ఇంత అందంగా అద్భుతంగా సృష్టించినందుకు కృతజ్ఞతలు. దేవతా గుర్రంగా నా జన్మ ధన్యమైపోయింది. కానీ నాదో చిన్న కోరిక,’ అంది ఆ గుర్రం. దాని మనసులో మాట గ్రహించినట్లుగా భగవంతుడు ఓ చిరునవ్వు నవ్వి- ‘నువ్వు దేవతా గుర్రానికి. నీ కోరికని తీర్చాల్సిందే! ఏం కావాలో కోరుకో!’ అన్నాడు. ‘నేను అందంగా ఉన్న మాట నిజమే కానీ ఇంకాస్త అందంగా ఉంటే బాగుండు అన్న దుగ్థ నన్ను తెగ వేధిస్తోంది. ఆలోచించి చూస్తే నాలో చాలా అవకరాలే కనిపిస్తున్నాయి. అవన్నీ సరైపోయి నేను ఇంకా అందంగా ఉండేట్లు ఆశీర్వదించండి స్వామీ!’ అని వేడుకుంది.

 

‘ సరే! నీలో నీకు ఏ లక్షణాలు లోపాలుగా కనిపిస్తున్నాయో చెప్పు. అవన్నీ సరిదిద్దుతాను,’ అంటూ అభయమిచ్చాడు భగవంతుడు. దాంతో ఆ గుర్రం తనలో తనకి లోపాలుగా తోచిన లక్షణాలన్నింటినీ ఏకరవు పెట్టడం మొదలుపెట్టింది.
‘ఈ తల చూసారా! మరీ మెడకి అంటుకుపోయినట్లుగా ఉంది. అది ఇంకాస్త పొడవు ఉంటే బాగుంటుంది. ముక్కు కూడా మరీ సన్నగా ఉందేమో అని నా అనుమానం. ఇక కాళ్లు ఇంకాస్త పొడవుంటే భలే ఉంటుంది. దయచేసి ఇవన్నీ సరిదిద్దురూ!’ అంది గుర్రం. ‘తథాస్తు! రేపు ఉదయం నువ్వు లేచి చూసుకునే సరికి ఈ లోపాలేవీ లేని సరికొత్త రూపం నీకు వస్తుంది,’ అన్నాడు భగవంతుడు.

 

మొదటి గుర్రం సంతోషంగా భగవంతుని దగ్గర సెలవు తీసుకుంది. అది అలా వెళ్లిందో లేదో రెండో గుర్రం భగవంతుడి దగ్గరకు చేరుకుంది. ‘హే భగవాన్‌! ఆ గుర్రం తన అందాన్ని పెంచుకోవాలనే కోరికతోనే నీ దగ్గరకి వచ్చిందని నాకు తెలుసు. ఎలాగైనా ప్రపంచంలోనే గొప్ప గుర్రం అనిపించుకోవాలని దాని తపన. దాని అత్యాశని మీరు అణచాల్సిందే! అది తనలోని అందం మెరుగుపడేందుకు ఏ లక్షణాలనైతే కోరుకొందో... అవి నాలో మరింత ఎక్కువగా ఉండేలా వరం ఇవ్వండి,’ అని వేడుకుంది.
‘అయ్యో అదెంత భాగ్యం! అసలే నువ్వు దేవతా గుర్రానివి. నీ కోరికను తీర్చాల్సిందే! రేపు ఉదయం నువ్వు లేచి చూసుకునేసరికి ఆ లక్షణాలన్నీ నీలో కనిపిస్తాయి. తథాస్తు!’ అంటూ నవ్వాడు భగవంతుడు.

 

ఆ రాత్రి గుర్రాలకి సరిగా నిద్రపట్టనే లేదు. ఎప్పుడెప్పుడ తెల్లవారుతుందా... నిబిడీకృతమైన తమ అందాన్ని ఎప్పుడెప్పుడు చూసుకుంటామా అన్న ఉద్విగ్నతతో ఆ రాత్రిని గడిపాయి. ఎప్పుడో అర్ధరాత్రి వాటికి మాగన్నుగా నిద్రపట్టింది. తెల్లవారాక చూసుకుంటే ఆ రెండు గుర్రాలకీ తమ కోరిక నెరవేరిన విషయం తెలిసిపోయింది. కాకపోతే... మొదటిగుర్రం కోరుకున్న లక్షణాల కారణంగా అది అచ్చు ఒంటెలా మారిపోయింది. మొదటి గుర్రం కోరుకున్న లక్షణాల మోతాదు తనలో మరింతగా ఉండాలని కోరుకోవడంతో రెండో గుర్రం జిరాఫీలా మారిపోయింది!!!

 

తమ శరీరాల వంక చూసుకున్న గుర్రాలు రెండూ లబోదిబోమంటూ భగవంతుడి దగ్గరకు పరుగులెత్తాయి. ఆయనను చూస్తూనే ‘ఏమిటీ మాకీ అన్యాయం!’ అంటూ ఆక్రోశించాయి.

 

‘మీరు కోరుకున్న వరాన్ని యథాతథంగా తీర్చాను. ఇది అన్యాయం ఎలా అవుతుంది? ఆగమేఘాల మీద పరుగులు తీసే దేవతాశ్వాలు ఎలా ఉండాలో, మిమ్మల్ని అలా పుట్టించాను. కానీ మీకు మీ శరీరం పట్ల కానీ, దానిని అందించిన నా పట్ల కానీ నమ్మకం లేదు. అదే అసలైన అన్యాయం. మీరు నిజంగా నన్ను ఏదన్నా కోరుకోవాలని అనుకుంటే... ఎలాంటి నిస్సత్తువా దరిచేరకుండా బలిష్టంగా ఉండాలనో, కోరుకున్న గమ్యాలని సమర్థంగా చేరుకోవాలనో అడగాల్సింది! కానీ మీరు పైపై మెరుగులకే ప్రాధాన్యతని ఇచ్చారు. ఇక ఫలితం అనుభవించండి. ఇక నుంచీ మీరు దేవతా అశ్వాలు కాదు. ఒకరేమో ఒంటెలాగా ఎడారుల్లో తిరుగుతూ నానా బరువులూ మోయాల్సి ఉంటుంది. మరొకరేమో చిటారుకొమ్మ మీద దొరికే ఆహారంతో తృప్తిపడుతూ అడవులలో కాలం గడపాల్సి వస్తుంది. పోండి!,’ అనేశాడు భగవంతుడు. అదీ విషయం!

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

- నిర్జర.