అర్థరాత్రి ఆగిపోయిన వాట్సాప్

కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాలని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ప్రతి ఏటా ఎదురుచూస్తుండేవారు. గతంలో ఫోన్లు, మేసేజ్‌లతో విష్ చేసిన జనానికి వాట్సాప్ అందుబాటులోకి రావడంతో అది ఇంకా సులువుగా మారింది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్ని తాకాయి. గడియారంలో 12 గంటల గంట మోగగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయాలని వాట్సాప్‌ను ఆన్ చేసిన నెటిజన్లకు నిరాశే ఎదురైంది.

 

సాంకేతిక లోపం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ కొద్దిసేపు నిలిచిపోయింది. దీని ప్రభావం భారత్‌పైనా పడింది. సుమారు 200 మిలియన్ల మంది వాట్సాప్ వినియోగదారులున్నారు. న్యూఇయర్ విషెస్ తెలిపేందుకు అందరూ ఒకేసారి వాట్సాప్‌పై పడటంతో ట్రాఫిక్ పెరిగి సర్వర్ క్రాష్ అయినట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన సాంకేతిక నిపుణులు సర్వీసులను పునరుద్ధరించారు. అయితే దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూఇయర్ హ్యాష్ ట్యాగ్‌తో పాటు వాట్సాప్ డౌన్ హ్యాష్ ట్యాగ్‌ను కూడా కలిపి పోస్ట్ చేస్తూ తమ నిరసన తెలియజేశారు.