మండలి రద్దయితే... పిల్లి, మోపిదేవి పరిస్థితేమిటి?

మండలిలో పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం చూస్తుంటే... కౌన్సిల్ రద్దు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ తో పెట్టుకుంటే ఏమవుతుందో... తెలుగుదేశానికి రుచి చూపించాలన్న పట్టుదలతో... జగన్మోహన్ రెడ్డి ఉన్నారని... దాంతో, మండలి రద్దు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. తన ఏకచత్రాధిపత్యాన్నే ధిక్కరిస్తారా? అనే భావనతో జగన్ పట్టుదలకు పోతేమాత్రం మండలి రద్దు తప్పదంటున్నారు. శాసనసభలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని విశ్లేషించిన మీడియా, రాజకీయ విశ్లేషకులు సైతం మండలి రద్దు ఖాయమనే చెబుతున్నారు.

అయితే, పట్టుదలకుపోయి మండలిని రద్దుచేస్తే, ముందుముందు జగన్మోహన్ రెడ్డి అనేక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదంటున్నారు. ఎన్నికల సమయంలో ఎంతోమందికి ఎమ్మెల్సీ ఇస్తానంటూ జగన్ హామీ ఇచ్చారు. మరి, వీళ్లందరికీ ఏం సమాధానం చెబుతారు... ఏవిధంగా పదవుల్లో అకామిడేట్ చేస్తారనేది ప్రశ్నార్ధకమే. హామీలు పొందినవాళ్ల సంగతి పక్కనబెడితే... ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న 9మంది తమ పదవులు కోల్పోయి రాజకీయ నిరుద్యోగులు మారతారు. ముఖ్యంగా శాసనమండలి సభ్యులుగా ఉంటూ మంత్రులుగా కొనసాగుతున్న పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణ పరిస్థితి ఏమిటనే చర్చ జరుగుతోంది. 

అయితే, మండలి రద్దయితే, ఇప్పటికిప్పుడు పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవులకు వచ్చే ముప్పు లేకపోయినా, ఆరు నెలలు తర్వాత మాత్రం కచ్చితంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈలోపు... ఏవైనా అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలొచ్చి... ఎమ్మెల్యేలుగా గెలిస్తే తప్ప.... వీళ్లిద్దరూ మంత్రి పదవుల్లో కంటిన్యూ అయ్యే ఛాన్సుండదు. అయితే, ఏపీలో ప్రస్తుతం ఉపఎన్నికలు జరిగే పరిస్థితే లేదు. దాంతో, మండలి రద్దు జరిగితే మాత్రం ఆర్నెళ్ల తర్వాత కచ్చితంగా పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణలు మాజీలుగా మారిపోతారు.

అయితే, పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణలు... వైఎస్ కుటుంబానికి ఎంతో నమ్మకస్తులు. పైగా ఎప్పట్నుంచో వైఎస్ ఫ్యామిలీతో అసోసియేటై ఉన్నారు. అదే సమయంలో జగన్ కు కూడా ఇద్దరూ అత్యంత సన్నిహితులు. అందుకే, మోపిదేవి వెంకటరమణ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రి పదవి కట్టబెట్టారు. పిల్లి సుభాష్ చంద్ర బోస్ ది కూడా దాదాపు అలాంటి పరిస్థితే. అయితే, మండలి రద్దయి ఆర్నెళ్ల తర్వాత మాజీలుగా మారితే... వీళ్లిద్దరికీ కేబినెట్ ర్యాంక్ తో కీలకమైన నామినేటెడ్ పదవులు కట్టబెట్టొచ్చని అంటున్నారు.